లక్ష్యాన్ని చేరుకునే చిట్కా

 

మనిషన్నాక రకరకాల లక్ష్యాలు ఉంటాయి. కానీ కొంతమంది మాత్రమే తాము ఏర్పరుచుకున్న గోల్స్‌ని చేరుకుంటారు. వాళ్లే విజేతలుగా నిలుస్తారు. మిగతావారంతా తమకి దొరికన దాంతో సంతృప్తి పడిపోతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అనే అనుమానం వచ్చింది కొంతమంది పరిశోధకులకి. అంతే! వెంటనే ఓ పరిశోధన మొదలుపెట్టేశారు. అందులో తేలిన విషయాలు మనందరికీ ఉపయోగమే. ఇంతకీ ఆ పరిశోధన ఏమిటంటే....

మనలో చాలామంది లైఫ్‌లో ఎప్పుడో ఒకప్పుడు ‘రేపటి నుంచి రోజూ పొద్దునే లేవాలి’ అనే గోల్‌ సెట్ చేసుకునే ఉంటారు. కానీ అదేం చిత్రమో కానీ ఎప్పుడు అలా అనుకున్నా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. మొదటి రోజు రాత్రి పడుకోవడం లేట్‌ అవుతుంది, రెండోరోజు ఎవరో చుట్టాలు ఇంటికి వస్తారు, మూడో రోజు రాత్రి అసలు నిద్రే పట్టదు... ఇలాంటి కారణాలతో ఏ రోజుకి ఆ రోజు పొద్దున లేవడం కుదరనే కుదరదు. దాంతో ఇక ఆ గోల్‌ని పక్కన పెట్టేస్తారు. ఇలా గోల్‌ సెట్‌ చేసుకున్న తర్వాత వరుసపెట్టి ఇబ్బందులు తలెత్తడాన్ని ACTION CRISIS అని పిలుస్తారట. ఈ యాక్షన్‌ క్రైసిస్‌లో ఏం జరుగుతుంది. దాన్ని overcome చేయడం ఎలా అనే దిశగా పరిశోధకులు ఆలోచించారు.

ఈ పరిశోధన కోసం వాళ్లు కొంతమంది వ్యక్తులకు వేర్వేరు గోల్స్ ఇచ్చారు. వాటిని సాధించే క్రమంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు వాళ్లకి ఎలాంటి ఆలోచనలు ఏర్పడ్డాయో చెప్పమన్నారు. ఆశ్చర్యంగా గోల్‌ ఏదైనా కూడా, అందులో ఇబ్బందులు తలెత్తినప్పుడు ఒకే తరహా ఆలోచనలు వచ్చాయట. ‘అసలు ఈ గోల్‌ చేరుకోవాల్సిన ఉపయోగం ఉందా?’ అన్న అనుమానం మొదలైంది.

అప్పటివరకూ గోల్‌కి ఉన్న లాభాల గురించి ఆలోచించినవాళ్లంతా, దానికి సంబంధించిన నష్టాల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకటికి రెండు ఇబ్బందులు రాగానే తాము లక్ష్యం చేరుకోగలమనే నమ్మకాన్ని కోల్పోయారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇంకా ఏం చేయాలని ఆలోచించడం బదులు, దాన్ని ఎలా వదిలించుకునే మార్గాలు వెతకడం మొదలుపెట్టారు. దాంతో ఇక లక్ష్యం నిదానంగా కరిగిపోతుంది. ACTION CRISIS ఏర్పడినప్పుడు నిబ్బరంగా ఉండగిలిగితేనే లక్ష్యాన్ని సాధించగలం అని పరిశోధకులు తేల్చారు. ఆ కాస్త సమయంలో లక్ష్యాన్ని దూరం చేసుకోవడం కంటే, దాన్ని ఎలాగైనా సాధించేందుకు ఉపాయాన్ని ఆలోచించగలిగితే గోల్‌ రీచ్ అవ్వగలం. ఇందులో లక్ష్యాన్ని ఏర్పరుచుకున్న వ్యక్తితో పాటు... అతని చుట్టుపక్కల ఉండే స్నేహితులు, టీచర్లు, కుటుంబం పాత్ర కూడా చాలా ఉందట. వాళ్ల ప్రోత్సాహం, సహాయం ఉంటే కనుక నమ్మకం చెదిరిపోకుండా ఉంటుందట.

- నిర్జర.