స్పాట్ ఫిక్సింగ్ పై సచిన్, ధోని స్పందన

Publish Date:May 31, 2013

 

క్రికెటర్లకు, బీసీసీఐ బోర్డుకు కోట్ల రూపాయలు వర్షం కురిపిస్తున్న ఐపియల్ మ్యాచులలో బయటపడిన బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారాలు తెర వెనుకున్న క్రికెట్ బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్, బాలివుడ్ నటుడు విందూ ధారా సింగ్ వంటి పెద్ద తలకాయలను బయట పెట్టడంతో క్రికెట్ అభిమానులు షాకయ్యారు. అల్లుడు ప్రమేయం ఉందని స్పష్టంగా తెలుస్తున్నపటికీ, బోర్డు అధ్యక్ష పదవిని వదిలి పెట్టేదిలేదని శ్రీనివాసన్ గట్టిగా చెపుతుండటంతో, అటువంటి వారి నేతృత్వంలోనడుస్తున్న క్రికెట్ మ్యాచులపై అభిమానులకు నమ్మకం సడలుతోంది.

 

ఇక ఈ విషయంలో స్పందించవలసిన హేమా హేమీలయిన క్రికెట్ ఆటగాళ్ళు సైతం అనవసరంగా కలుగజేసుకొని తమ అవకాశాలను పాడుచేసుకోవడం ఎందుకని అనుకోన్నారో ఏమో ఎవరూ ఈ విషయం పై నోరు విప్పలేదు.

 

అయితే లండన్ పర్యటనలో ఉన్న ఇండియన్ టీం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మీడియాతో మాట్లాడుతూ “ప్రస్తుతం ఈ విషయంపై మాట్లాడటం మంచిదికాదని నేను భావిస్తున్నాను. దీనిపై సరయిన సమయంలో నా అభిప్రాయం వ్యక్తం చేస్తాను. ఈ విధంగా జరగడానికి ప్రధాన కారణం కొందరు ఆటగాళ్ళు మానసికంగా మిగిలిన వారికంటే కొంచెం బలహీనంగా ఉండటేనని నేను భావిస్తున్నాను. ఇంత కంటే ప్రస్తుతం ఎక్కువ మాట్లాడలేను,” అని అన్నారు.

 

ఇక, ఇటీవలే ఐపియల్ మ్యాచుల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ టెండుల్కర్ మాట్లాడుతూ, లక్షలాది ప్రజలు అభిమానించే క్రికెట్ ఆటలో ఇటువంటివి జరగడం నిజంగా నాకు చాల బాధ కలిగిస్తోంది. ఇటువంటి ఆరోపణలతో క్రికెట్ ఆట మీడియా కెక్కిన ప్రతీసారి నాకు చాల బాధ కలుగుతుంది. మేము బాగా ప్రాక్టీస్ చేసి, ఆడి విజయం సాదించాలని మాత్రమే మాకూ శిక్షణలో నేర్పబడుతుంది. ఆటలో ఓడినా గెలిచినా క్రీడాస్పూర్తి నిలపడం చాల ముఖ్యమని మాకూ శిక్షణలో చెప్పబడింది. కానీ, ఇటువంటి వ్యవహారాల వల్ల ఆటకు చెడ్డ పేరు రావడమే కాకుండా, లక్షలాది అభిమానుల నమ్మకం కూడా వమ్ము చేసినట్లవుతుంది. ఇప్పటికేయినా సమూల ప్రక్షాళన చేసి ఆటకు పునర్ వైభవం తీసుకువస్తే అందరూ సంతోషిస్తారు.”

 

ధోనీ ఆటగాళ్ళ బలహీనతలే ఇటువంటి అవినీతి పనులకు అవకాశం ఇస్తాయని అభిప్రాయ పడితే, క్రికెట్ బోర్డులో చోటుచేసుకొన్న రాజకీయాలను, తద్వారా ఆటను సమూల ప్రక్షాళణం చేయడమే దీనికి పరిష్కారమని సచిన్ అభిప్రాయ పడ్డారు.