రేవంత్‌ ఇంటి వద్ద "స్పై"డర్లు

చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత అమరావతికి వెళ్లిన రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ తెలుగుదేశానికి రాజీనామా చేశారు. వస్తూ.. వస్తూ బెజవాడ దుర్గమ్మ ఆశీర్వాదం తీసుకొని సొంత నియోజకవర్గం కొడంగల్‌కు వచ్చారు. టీడీపీకి వీడ్కోలు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలిసినప్పటికీ.. దానిపై స్పష్టత లేదు.. ఇప్పుడే చేరుతారా లేదంటే టైమ్ తీసుకుంటారా అన్న దానిపై రేవంత్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే అభిమానులు, పార్టీ కార్యకర్తలతో హైదరాబాద్ జలవిహార్ వద్ద "ఆత్మీయ సమావేశం" నిర్వహించి అన్ని వివరాలు అప్పుడు ప్రకటిస్తానని రేవంత్ చెప్పారు.

 

కానీ పోలీసులు ఈ సమావేశానికి అనుమతి నిరాకరించారు. దీందో అందరూ తన ఇంటి వద్దకే రావాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. ఆయనకు తెలంగాణలో మంచి పాపులారిటీ ఉండటంతో రేవంత్ నాయకత్వంలో నడిచేందుకు చాలా మంది మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ నుంచి ఈ లిస్ట్ రెడీ అయిపోగా.. టీఆర్ఎస్‌కు చెందిన పలువురు అసమ్మతి వాదులు కూడా వీరికి జత కలిసే అవకాశం ఉండటంతో కేసీఆర్ అలర్ట్ అయ్యారు.

 

ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అధికారులు జూబ్లీహిల్స్‌లోని రేవంత్ ఇంటి పరిసరాల్లో నిఘా వేసినట్లు టాక్. ఆయనను ఎవరెవరు కలుస్తున్నారు.. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతున్నారు అనే విషయాలను అత్యంత రహస్యంగా సేకరిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. చెప్పినట్లుగానే ఇవాళ ఉదయం పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల నుంచి తనను కలిసిన కార్యకర్తలు, నేతలను అప్యాయంగా పలకరించారు. వీరిలో చాలా మంది తెలుగుదేశానికి చెందిన వారు కాగా.. కొందరు ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ నిఘా వేశారన్న వార్త కొందరిలో గుబులు రేపుతోంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu