Latest News

రేవంత్ వెనుకడుగు..?

posted on: Oct 26, 2017 11:42AM

గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనానికి కేంద్ర బిందువుగా మారారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు మీడియాలో విస్తృతంగా కథనాలు రావడం... వరుస ఢిల్లీ పర్యటనలు.. సొంతపార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలతో రేవంత్ పార్టీ మారుతున్నారనే వార్తలకు బలం చేకూర్చాయి. ఈ వివాదాం అటు తిరిగి ఇటు తిరిగి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారిపోయింది. రేవంత్ ఒక మామూలు ఎమ్మెల్యేనని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, టీడీఎల్పీ నేతగా ఆయన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని తమ అధినేత చంద్రబాబు స్పష్టం చేసినట్లు రమణ తెలిపారు. లండన్‌ పర్యటనలో ఉన్న బాబు ఈ అంశంపై తనతో ఫోన్‌లో మాట్లాడారని అన్నారు.

 

దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, టీడీఎల్పీ నేతగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని రేవంత్‌కు తాను సూచించినట్లు పేర్కొన్నారు. అయితే టీడీఎల్పీ నేత హోదాలో ఎల్పీ సమావేశాన్ని నిర్వహించాలని రేవంత్ నిర్ణయించారు. టీడీఎల్పీ నేతను నేనే.. సమావేశం నిర్వహించే హక్కు నాకే ఉంది.. ఎల్పీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి రమణ ఎవరు.. అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ గోల్కొండ హోటల్‌లో జరగనున్న టీడీపీ-బీజేపీ సమావేశానికి హాజరుకానని ప్రకటించారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఆయన వెనక్కు తగ్గారు. ఒక ఎమ్మెల్యేగా ఈ సమావేశానికి హాజరవ్వాలని రేవంత్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...