ఏపీ.ఎస్.ఎఫ్.సి.కి రవీంద్రనాద్ రెడ్డి కుచ్చుటోపీ?
posted on Sep 3, 2015 9:48PM
.png)
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన నీరజారావు అనే ఆమెకు చెందిన భూమిని 2008లో కబ్జా చేసినప్పుడు, ఆమె కోర్టులో సుమారు ఏడాదిపాటు న్యాయపోరాటం చేసి మళ్ళీ తన భూమిని దక్కించుకొన్నారు. ఆ సంఘటన గత సార్వత్రిక ఎన్నికల సమయంలో జరగడంతో వైకాపాకు స్వంత జిల్లా అయిన కడపలోనే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చింది.
ఆమె మళ్ళీ మరోసారి రవీంద్రనాథ్ రెడ్డిపై గురిచూసి బాణం వదిలారు. ఈసారి ఆమె అభియోగం ఏమిటంటే రవీంద్రనాథ్ రెడ్డి 2008-13సం.ల మధ్య కాలంలో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ సంస్థ నుండి తన హరితా ఫెర్టిలైజర్స్ సంస్థ కోసం రూ.28కోట్లు తీసుకొన్నారు. కానీ ఆయన నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి కార్పోరేషన్ నుండి రుణం తీసుకొన్నారని ఆమె ఏసిబికి పిర్యాదు చేసారు. అంతే కాదు ఆయన తన సంస్థ కోసం తీసుకొన్న రుణాన్ని వేరే ఇతర అవసరాలకు మళ్ళించారని ఆరోపించారు. దీనిపై విచారణ చేసి తగిన చర్యలు చేప్పట్టవలసిందిగా ఆమె ఏసిబిని కోరారు. ఆమె ఆరోపణలు రుజువయితే రవీంద్రారెడ్డికి శిక్ష తప్పదు. ఆయనతో బాటే వైకాపా ప్రతిష్టకు కూడా భంగం కలగవచ్చును. నకిలీ డాక్యుమెంట్లపై ఆయనకి అంత భారీ ఋణం ఇచ్చిన అధికారులకు శిక్ష తప్పదు.