ఫోన్లో మాట్లాడేటప్పుడు...

ఒకప్పుడంటే ఫోన్లో మాట్లాడటం విలాసం. కానీ ఇప్పుడో! పక్క ఇంట్లో ఉన్న మనిషితో కూడా ఫోన్లోనే మాట్లాడేస్తున్నాం. ఇలాంటి విచ్చలవిడి వాడకంలోని లాభనష్టాల మాట అటుంచితే ఫోన్లో మాట్లాడటం కూడా కళే అంటున్నారు నిపుణులు. మనిషి ఎదురుగుండా ఉండడు కాబట్టి మొహమాటమూ, భయమూ లేకుండా ఫోన్లో చెలరేగిపోతూ ఉంటాము. అలాంటి సమయాలలో కొన్ని కనీస మర్యాదలు పాటించాలని సూచిస్తున్నారు...

 

ముందుగానే నిర్ణయించుకోండి

ఏదన్నా విషయం గురించి మాట్లాడాలనుకునేటప్పుడు, ఓ నిమిషం సేపైనా మీరు చెప్పాలనుకున్న విషయం ఏమిటి? దానిని అవతలివారికి ఎలా తెలియచేయాలనుకుంటున్నారు? అన్న అంశం మీద దృష్టి పెట్టండి. మీ మాటలకు అవతలి వ్యక్తి ఎలా స్పందించే అవకాశం ఉంది! దానికి మీ దగ్గర తగిన జవాబు ఉందా లేదా! అన్నది తరచి చూసుకోండి. లేకపోతే సంభాషణ మధ్యలో మాటలు తడుముకోవాల్సి ఉంటుంది.

 

పరిచయంతో మొదలు

మన జీవితంలో ఎదురుపడిన ప్రతి ఒక్కరి దగ్గరా మన ఫోన్‌ నెంబరు ఉండాలన్న నిబంధన లేదు. కానీ చాలామందికి తమను తాము పరిచయం చేసుకునేందుకు అహం అడ్డు వస్తుంది. ‘నేనే మాట్లాడుతున్నాను’, ‘ఏంటి విశేషాలు’... అంటూ నేరుగా సంభాషణలోకి దిగిపోతుంటారు. అవతలివారు సదరు మనిషిని గుర్తపట్టలేక ఇబ్బందిపడుతూ ఉంటారు, ఒకవేళ గుర్తుపట్టినా సంభాషణ మొదలయ్యే తీరు చాలా అమర్యాదగా తోస్తుంది. 

 

కనీస మర్యాదలు

ఒక వ్యక్తి ఎదురుపడినప్పుడు నమస్కారం చెప్పడం, క్షేమసమాచారాలు అడగడం కనీస మర్యాదు. ఫోన్‌ సంభాషణలకు కూడా ఇదే వర్తిస్తుంది. అంతేకాదు! అవతలి వ్యక్తి హోదాలో ఎంత చిన్నవారైనా కూడా దురుసుగా మాట్లాడటం, వేళాకోళం చేయడంతో మన గురించి చెడు అభిప్రాయాన్నే మిగులుస్తుంది. చాలామంది ఫోన్లో మాట్లాడేటప్పుడు తమకి ఉన్న హాస్య చతురతని అంతా చూపిద్దామనుకుని గీత దాటుతూ ఉంటారు. దీంతో మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.

 

సాఫీగా సంభాషణ

ఫోన్లో మన వాదనని వినిపించేందుకు ఎంతగా ప్రాధాన్యతని ఇస్తామో, అవతలివారి మాటని వినేందుకు కూడా అంతే ప్రాధాన్యతని ఇవ్వాలి. మాటిమాటికీ అడ్డు తగలడం, హెచ్చుస్థాయిలో మాట్లాడటం వల్ల వాదన కాస్తా వివాదంగా మారిపోయే అవకాశం ఉంది. తొందరగా మాట్లాడేయాలన్న కంగారులో ఏదిపడితే అది మాట్లాడేసే ప్రమాదమూ లేకపోలేదు. ఇక ఏదన్నా ముఖ్య విషయం మాట్లాడలనుకునేటప్పుడు టీవీ, ట్రాఫిక్‌ వంటి శబ్దాలు లేని సందర్భాన్ని ఎంచుకోవడం మంచిది.

 

సమయం

కొంతమందికి ఫోన్‌ చూస్తే చాలు పూనకం వచ్చేస్తుంది. ‘సరే అయితే!, ‘ఇక ఉంటాను’ లాంటి సూచనలు ఇస్తున్నా కూడా సంభాషణని మరింతగా పొడిగిస్తూ ఉంటారు. ఇలాంటి సంభాషణలకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. ఫోన్ సంభాషణ ఎలా మొదలుపెట్టాలి అన్నదే కాదు, ఎంతసేపట్లో ముగించాలన్నది కూడా తెలిసి ఉండాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు ఇక చాలు అన్న సూచనని ఇచ్చినప్పుడు ఆ సంభాషణని ముగించడం మేలు.

- నిర్జర.