నిర్భయ కేసులో తోలి తీర్పు

 

డిల్లీలో గత ఏడాది డిశంబర్ 16న జరిగిన నిర్భయ ఉదంతంపై గత 8నెలలుగా కొనసాగుతున్న కోర్టు కేసుల్లో మొట్ట మొదటి తీర్పు ఈ రోజు వెలువడింది. ఈ కేసులో అందరి కంటే వయసులో చిన్నవాడు కానీ అందరికంటే తీవ్ర నేరానికి పాల్పడిన బాలనేరస్తుడికి ఈ రోజు బాలనేరస్థుల (జువైనల్) బోర్డు మూడేళ్ళ జైలు శిక్ష విదిస్తూ తీర్పు చెప్పింది. బాల నేరస్తుల చట్టం క్రింద అత్యధికంగా విధించగల శిక్షను విదిస్తున్నట్లు ప్రధాన మేజిస్ట్రేట్ గీతాంజలి గోయల్ తెలిపారు. ఈ నేరానికి పాల్పడిన మిగిలిన వారిపై నేటికీ ఇంకా ఫాస్ట్ ట్రాక్ కోర్టులోకేసులు నడుస్తున్నాయి.

 

ఈ కేసులు మొదలయిన్నపుడు, అన్ని ఆధారాలు ఉన్న కారణంగా ఈ కేసులు కేవలం రెండు లేదా మూడు నెలలో విచారణ పూర్తిచేసి నేరస్తులకి శిక్ష పడటం ఖాయమని అన్నారు. కానీ, 8 నెలలు గడిచినా ఇంతవరకు ఒక్క కేసు కూడా కొలిక్కి రాలేదు.

 

వారిలో రామ్ సింగ్ అనే నేరస్తుడు తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకొని మరణించగా, మరొకరిపై తోటి ఖైదీలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ నేరానికి పాల్పడిన మిగిలిన ఐదుగురు ఖైదీలు తాము ఎటువంటి నేరం చేయలేదని వాదిస్తున్నారు. వారిలో ఒక ఖైదీ ఎయిర్ ఫోర్సులో క్లర్కు ఉద్యోగానికి పరీక్షలకు సిద్దం అవుతున్నాడు కూడా. అందుకోసం కోర్టు అతనికి బలమయిన ఆహారం, పాలు, పుస్తకాలు, అతనికి జైలులో రోజూ ట్యూషన్ చెప్పేందుకు ఒక ఉపాద్యాయుడిని కూడా మంజూరు చేసింది. బహుశః ఇటువంటి అవకాశం కేవలం భారతదేశంలోనే ఉంటుందేమో.