మీ జీవితాన్నే మార్చివేసే జుగాద్

 

జీవితమంటే సమస్యల వలయం. పొద్దున లేచిన దగ్గర నుంచీ ఏదో ఒక సవాలు మనల్ని వేధిస్తూనే ఉంటుంది. అది లీకవుతున్న పైప్ దగ్గర నుంచీ అద్దం విరిగిపోయిన కిటికీ వరకూ ఏదైనా కావచ్చు. డబ్బు ఉన్నప్పుడు, సమయం కుదిరినప్పుడు వాటి పని చూడచ్చులే అని మనం చూస్తూ ఊరుకోం కదా! ఆ పరిస్థితిలో మన బుర్రకి కాస్త పదును పెడతాం. చిటికెలో ఏదో ఒక ఉపాయంతో ఆ సమస్యకి చెక్ పెట్టేస్తాం. దీనినే ఇప్పుడు జుగాద్ అంటున్నారు.

 

ఎవ్వరూ ఊహించని రీతిలో ఉపాయం పన్ని సమస్య నుంచి తప్పించుకోవడం భారతీయులకి కొత్తేమీ కాదు. కాకపోతే ఓ దశాబ్ద కాలం నుంచీ ఇలాంటి సమయస్ఫూర్తికి ఓ పేరుతో పిలుస్తున్నారు. అదే జుగాద్! హిందీ, ఉర్దూ, పంజాబీలలో కనిపించే ఈ మాటకి చిట్కా లేకపోతే అడ్డదారి అని అర్థం చెప్పుకోవచ్చు. భారతీయులలో నరనరాన కనిపించే ఈ జుగాద్ లక్షణం ఇప్పుడు ప్రపంచాన్ని కూడా ఆకర్షిస్తోంది. అంతర్జీతీయ విశ్వవిద్యాలయాలు సైతం దీనిని ఒక మేనెజ్మెంట్ టెక్న్క్గానూ, జీవన నైపుణ్యం (life skill)గానూ గుర్తుస్తున్నాయి. ఈ జుగాద్ వెనుక మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు చాలానే ఉన్నాయన్నది నిపుణుల మాట. అవేమిటంటే..

.

 

అపాయంలో ఉపాయం – అపాయం ఎదురైందని నిస్సహాయంగా నిలబడిపోకుండా.... దాన్నుంచి అప్పటికప్పుడు ఎలా తప్పించుకోవాలి? అన్న స్ఫూర్తి జుగాద్ తరహా ఆలోచనా ధోరణితో ఏర్పడుతుంది.

 

సులువు – ఎంతో ఖర్చు పెట్టి, గంటల తరబడి చేసే పనిని... అప్పటికప్పుడు చటుక్కున పరిష్కరించడం ఎలా అన్నదే జుగాద్లోని ప్రథమ సూత్రం. చవక, నిరాడంబరత, సులువు... ఈ మూడే జుగాద్కి పునాదులు.

 

 

బిజినెస్ ట్రెండ్ – వ్యక్తిగత జీవితంలో జుగాద్తో మన రోజువారీ సమస్యలు తీరిపోవచ్చు. కానీ అదే సృజనని వ్యాపారంలో ఉపయోగిస్తే... అద్భుతమైన లాభాలు ఆర్జించే పరికరాలను తయారుచేయవచ్చు.

 

సంస్థ నిర్వహణ – ఇప్పుడు ప్రముఖ సంస్థలు కూడా తమ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు జుగాద్ చిల్కాలను పాటిస్తున్నాయి. కొత్త ఉత్పత్తులను రూపొందించే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ శాఖలు కూడా ఇప్పుడు జుగాద్ తరహాలో ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాయి.

 

ఇతరుల గురించి ఆలోచన వద్దు – ఈ సమస్యని ఇలా పరిష్కరిస్తే చూసేవారు ఏమనుకుంటారు అనేదానికి జుగాద్ వ్యతిరేకం. ‘ సమస్య నాది. దానిని నా పద్ధతిలో పరిష్కరించుకుంటాను,’ అనే దృక్పధానికి జుగాద్ ఓ ప్రేరణ.

 

 

సృజనకు హద్దులు చెరిపేయండి – వ్యక్తిత్వ వికాసంలో ‘థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్’ అనే సూత్రం కనిపిస్తుంది. సమస్యకి దారులు మూసుకుపోయినా, లేకపోతే ఎప్పుడూ ఒకేతరహా పరిష్కరాలు కనిపిస్తున్నా... అందరూ ఆలోచించే దారి నుంచి వైదొలగి కాస్త భిన్నంగా ఆలోచించమని ఈ సూత్రం చెబుతుంది. ఆ సూత్రాన్ని ఆచరించేందుకు జుగాద్ దోహదపడుతుంది.

 

జుగాద్ తరహా ఆలోచన వల్ల బోలెడు ఉపయోగాలు ఉన్నమాట నిజమే! అలాగని ప్రతి సమస్యనీ అడ్డదారిలోనే పరిష్కరించాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ప్రతి దృక్పధానికీ ఓ హద్దు ఉన్నట్లు జుగాద్ని ఆచరించేందుకు కూడా

- నిర్జర.