అతనొక్కడే – కానీ ముంబైకి స్ఫూర్తిగా నిలిచాడు!

 

‘‘రెండేళ్ల క్రితం ముంబైలోని వెర్సోవా బీచ్, అతి చెత్త తీరాలలో ఒకటిగా అప్రతిష్ట మూటగట్టుకుంది. కానీ ఇప్పుడు అదే తీరం అతి సుందరంగా కనిపిస్తోంది. వెర్సోవా ప్రాంతవాసుల శ్రమ వల్లే ఇదంతా సాధ్యమయ్యింది. వారికి నాయకత్వం వహించిన ‘అఫ్రోజ్ షా’ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను,’’ అంటూ ఈ మధ్య తన మన్ కీ బాత్ కార్యక్రమలో ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. అప్పటి నుంచీ దేశం యావత్తూ... వెర్సోవా బీచ్లో జరిగిన అద్భుతం గురించీ, ఆ అద్భుతం నిజమయ్యేందుకు అఫ్రోజ్ షా అనే వ్యక్తి చేసిన కృషి గురించి తెలుసుకునే ప్రయత్నంలో మునిగిపోయారు.

 

అఫ్రోజ్ షా, బాంబే హైకోర్టులో లాయరుగా పనిచేస్తున్నారు. అందరు ముంబైవాసులలాగానే ఆయన కూడా సముద్రతీరంలో ఓ ఇల్లు ఏర్పరుచుకోవాలని కలగన్నారు. 2015లో ఆ కల నిజమైంది కూడా! కానీ ఉదయం లేచి చూస్తే ఏముంది? తీరమంతా చెత్తాచెదారంతో నిండిపోయి కనిపించింది. సముద్రంలో ఎక్కడెక్కడో కలిపే చెత్తతో పాటుగా, తీరం వెంబడి ఉండేవారంతా తమ చెత్తని అక్కడ నిర్మొహమాటంగా వదిలేయడం కనిపిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే వెర్సోవా తీరం ఓ అనధికారిక డంపింగ్ యార్డుగా మారిపోయింది.

 

 

మిగతావారిలాగా అఫ్రోజ్ తనకెందుకులే అని చూసీచూడనట్లు ముక్కుమూసుకుని ఉండిపోలేదు. తన పొరుగింటాయనతో మాట్లాడి తమ వంతుగా ఆ చెత్తని శుభ్రం చేసే ప్రయత్నం మొదలుపెట్టాడు. ప్లాస్టిక్ బాటిల్స్, గాజు ముక్కలు, పాత చెప్పులు, ఇనుప సామాను... ఇలా నానా చెత్తనంతా తీయవలసి వచ్చేది. మొదట్లో జనం ఆ ఇద్దరూ చేస్తున్న పనిని చూసి తమ దారిన తాము పోయేవారు. నిదానంగా ఒకో మనిషీ వచ్చి ఒకో చేయీ వేయడం మొదలుపెట్టారు. యాత్రికులు, దారినపోయేవారు, చేపలుపట్టేవారు, స్థానికులు మొదలుకొని అఫ్రోజ్ గురించి విన్న బాలీవుడ్ హీరోల వరకూ అంతా అఫ్రోజ్ బృందంలో కలిసి చెత్తని వెలికితీసే ప్రయత్నంలో భాగస్వాములు అయ్యారు.

 

వారం వారం అఫ్రోజ్ చేస్తున్న ఈ పని క్రమేపీ ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెట్టింది. ఒకప్పుడు చెత్తాచెదారంతో నిండిపోయిన వెర్సోవా తీరం ఇప్పుడు తళతళ్లాడిపోతోంది. అఫ్రోజ్ చేస్తున్న పనిని ఐక్యరాజ్య సమితి సైతం గుర్తించింది. ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛతా కార్యక్రమంగా దీన్ని పేర్కొంది. అఫ్రోజ్కు ‘Champion of the Earth’ అనే బిరుదుని కట్టబెట్టింది. అంతేకాదు అఫ్రోజ్ స్ఫూర్తితో, దుర్గంధంతో నిండిపోయిన ఇండోనేషియా సముద్రతీరాన్ని కూడా శుభ్రపరిచే కార్యక్రమం మొదలుపెట్టింది.

 

 

వెర్సోవా తీరం ప్రస్తుతానికి ఓ కొలిక్కి వచ్చినమాట నిజమే! కానీ తమ బాధ్యత ఇక్కడితో ముగిసిపోలేదంటున్నారు అఫ్రోజ్. ఎక్కడెక్కడో సముద్రంలో కలిసే చెత్తంతా తీరానికి రాక తప్పదు కాబట్టి.... వారం వారం తాము ఆ చెత్తని శుభ్రం చేస్తూనే ఉంటామని హామీ ఇస్తున్నారు. మరోపక్క సముద్రతీరాలు కోతకు గురికావడం, సునామీబారిన పడటం వంటి ఉపద్రవాల నుంచి రక్షించే మడఅడవులని తిరిగి పెంచే కర్తవ్యాన్ని కూడా తలకెత్తుకున్నారు.

 

అందరిలా మనకెందుకులే అని అఫ్రోజ్ అనుకుంటే ఈ రోజున వెర్సోవా తీరంలో ఏ మార్పూ కనిపించేది కాదు. నేనొక్కడినే కదా అని వెనకడుగు వేస్తే ఆ మార్పు ప్రపంచాన్ని ఆకర్షించేదీ కాదు. అందుకే నిస్వార్థమైన నాయకత్వానికీ, సమాజం పట్ల బాధ్యతకీ అఫ్రోజ్ ఒక ఆదర్శంగా నిలుస్తాడని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు సైతం కితాబునిచ్చారు.

 

 

సముద్రతీరంలో చెత్తని పారేయడం మనకి చాలా సాధరణమైన దృశ్యంగా కనిపించవచ్చు. కానీ ఒకపట్టాన నేలలో కలవని గాజు, ప్లాస్టిక్ వంటి పదార్థాల వల్ల తనే ఎలాగూ పాడవుతుంది. పైగా సముద్రంలోకి చేరి అక్కడ నివసించే చేపలు వంటి జీవరాశుల ప్రాణాలు తోడేస్తాయి. సముద్ర పక్షలకి కూడా ప్రాణాంతకంగా మారిపోతాయి. ఈ కాస్త విషయమూ అర్థమైతే అఫ్రోజ్ వేసిన ముందడుగు ఎంత అవసరమో తేలిపోతుంది.

(ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా)

- నిర్జర.