ఇంటర్నెట్ ఓ అందమైన వ్యసనం

ఇప్పుడు ఇంటర్నెట్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. బ్రాడ్బ్యాండ్, 4G లాంటి సాంకేతికతత పుణ్యమా అని గంటల తరబడి వందలకొద్దీ సైట్లను చూడవచ్చు. కానీ ఇంటర్నెట్ వాడకం తర్వాత మన రక్తపోటు, గుండెవేగంలో కూడా మార్పులు వస్తాయని సూచిస్తున్నారు.

 

ఇంగ్లండుకి చెందిన Swansea University పరిశోధకులు ఇంటర్నెట్ వాడిన వెంటనే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో గమనించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం 18 నుంచి 33 ఏళ్ల లోపు వయసున్న ఓ 144 మందిని ఎన్నుకొన్నారు. కాసేపు ఇంటర్నెట్ చూసిన తర్వాత వీరందరిలోనూ గుండెవేగం, రక్తపోటు కనీసం 4 శాతం పెరిగినట్లు గమనించారు. తమలో ఉద్వేగపు స్థాయి కూడా మరీ ఎక్కువైనట్లు వీరంతా పేర్కొన్నారు.

 

రక్తపోటు, గుండెవేగంలో ఓ నాలుగు శాతం మార్పు వల్ల అప్పటికప్పుడు వచ్చే ప్రాణహాని ఏమీ లేకపోవచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఇది తప్పకుండా ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందంటున్నారు. పైగా వీటికి ఉద్వేగం కూడా తోడవ్వడం వల్ల హార్మోనులలో మార్పు వస్తుందనీ, అది ఏకంగా మన రోగనిరోధకశక్తి మీదే ప్రభావం చూపుతుందనీ హెచ్చరిస్తున్నారు.

 

ఒక అలవాటు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆరోగ్యంలో వచ్చే మార్పులని withdrawal symptoms అంటారు. మద్యపానం, సిగిరెట్, డ్రగ్స్లాంటి వ్యసనాలు ఉన్నప్పుడు ఈ withdrawal symptoms కనిపిస్తూ ఉంటాయి. ఆ వ్యసనం కొనసాగితే కానీ సదరు లక్షణాలు తగ్గవు. ఆ వ్యసనం వైపుగా మళ్లీ మళ్లీ పరుగులు తీసేందుకు అవి దోహదం చేస్తాయి. అలాగే ఇంటర్నెట్ ఆపిన తర్వాత పెరిగిన ఉద్వేగం, తిరిగి అందులో మునిగిపోయిన తర్వాత కానీ తీరలేదట.

 

ఇంతాచేసి తమ ప్రయోగంలో పాల్గొన్నవారంతా కూడా ఇంటర్నెట్ను అదుపుగా వాడేవారే అంటున్నారు పరిశోధకులు. ఇక ఇంటర్నెట్లో గేమ్స్, షాపింగ్, సోషల్ మీడియా వంటి సైట్లకి అలవాటు పడినవారిలో ఈ ‘వ్యసనం’ మరింత దారుణంగా ఉండే ప్రమాదం ఉందని ఊహిస్తున్నారు. నిజానికి ఇంటర్నెట్ వల్ల మన ఆరోగ్యంలోనూ ప్రవర్తనలోనూ మార్పులు వస్తాయన్న హెచ్చరికలు కొత్తేమీ కాదు. ఇలాంటి సమస్యలకు digital-behaviour problems అని ఓ పేరు కూడా పెట్టేశారు. ఆరోగ్యం సంగతి అలా ఉంచితే సుదీర్ఘకాలం ఇంటర్నెట్ వాడటం వల్ల డిప్రెషన్, ఒంటరితనం లాంటి సమస్యలు వస్తాయనీ... మెదడు పనితీరే మారిపోతుందని ఇప్పటికే పరిశోధనలు నిరూపించాయి. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అని పెద్దలు ఊరికే అన్నారా!

- నిర్జర.