లాలూకి మరిక గడ్డి మేసే అవకాశం దక్కదా

 

కాంగ్రెస్ నేతృత్వంలో సాగుతున్న యూపీఏ ప్రభుత్వం క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులను వెనకేసుకు వస్తూ చేసిన చట్ట సవరణను తీవ్రంగా ఆక్షేపిస్తూ ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటుగా విమర్శలు చేసిన రెండు మూడు రోజులలోపునే, పశువుల దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ని దోషిగా నిర్దారిస్తూ సీబీఐ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.

 

బీహార్ ముఖ్యమంత్రి పుణ్యమాని రాష్ట్రంలో అధికారానికి దూరంగా బ్రతకవలసివస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ కి ఇప్పుడు రాహుల్ గాంధీ విమర్శల కారణంగా యుపీఏ ప్రభుత్వం తను చేసిన చట్ట సవరణను రద్దు చేసినట్లయితే, 2014 ఎన్నికలలోకూడా పోటీ చేసే అవకాశం ఉండదు. ఆలూ (బంగాళా దుంపలు) ఉన్నంత కాలం లాలూయే బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడని స్వయంగా శలవిచ్చిన లాలూ ఇప్పుడు కటకటాలు పాలవడమే గాక, రాహుల్ పుణ్యమాని ఇక ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కోల్పోతే, మరి ఎన్నటికీ గడ్డిమేసే అవకాశం కూడా ఉండదేమో.

 

బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్ మరియు జగన్నాథ్ మిశ్రాలను కోర్టు దోషులుగా నిర్దారించడంతో ఇరువురిని పోలీసులు అరెస్ట్ చేసి రాంచీలోని  జైలుకి తరలించారు. అక్టోబర్ 3న వారికి కోర్టు శిక్షలు ఖరారు చేస్తుంది.