హైదరాబాదులో వైకాపా సమైక్యశంఖారవం సభ త్వరలో

 

ఈ రోజు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన శాసనసభ్యులతో కలిసి గవర్నర్ నరసింహన్ను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసేందుకు గాను శాసనసభను సమావేశపరచమని ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ “కాంగ్రెస్ అధిష్టానం విభజనకు అంతా సిద్దం చేసి, టీ-నోట్ ను శాసనసభ అమోదానికి పంపినప్పుడు, శాసనసభ దానిని వ్యతిరేఖించినా దానివల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. అదే ఇప్పుడే శాసనసభను సమావేశపరచి రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసి కేంద్రానికి ముందే ఆ తీర్మానాన్ని పంపినట్లయితే అప్పుడు కేంద్రం కూడా పునరాలోచించుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. వైకాపా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని లేఖ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా తెదేపా, కాంగ్రెస్ పార్టీలు కూడా లేఖలు ఇచ్చినట్లయితే తప్పకుండా రాష్ట్ర విభజన నిలిచిపోతుంది. మా పార్టీ వచ్చేఅక్టోబర్ 15-20 తేదీల మధ్య హైదరాబాదులో సమైక్యశంఖారవం పేరిట ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గట్టిగా డిమాండ్ చేస్తుంది,” అన్నారు.