మిస్టరీ - ఈ ఊళ్లో అందరూ కవలలే!

మనకి పరిచయం ఉన్నవారిలో ఎంతమంది కవల పిల్లలు ఉండి ఉంటారు? మహా అయితే ఓ నలుగురో, ఐదుగురో ఉంటారు. కానీ ఆ ఊరిలోకి అడుగుపెడితే వీధికో కవల జంట కనిపిస్తుంది. శాస్త్రవేత్తలకి కూడా సవాలు విసురుతున్న ఆ ఊరి పేరు ‘కొడింహి’. కేరళలోని మలప్పురం జిల్లాలోని ఈ మారుమూల ప్రాంతం, తన ప్రత్యేకత కారణంగా ప్రపంచంలోని పరిశోధకులందరినీ ఆకర్షిస్తోంది.

 


మిగతా ప్రపంచంతో పోలిస్తే మన దేశంలో కవల పిల్లలు పుట్టడం తక్కువే! ప్రతి వెయ్యి మంది పిల్లలలో మహా అయితే ఓ ఇరవై మంది, కవల పిల్లలు ఉంటారు. కానీ కొడింహి పట్నంలో మాత్రం దాదాపు పది శాతం పిల్లలు కవలలే కనిపిస్తున్నారు. ఆ ఊళ్లో మొత్తం జనాభా ఇరవైవేల మంది ఉంటే అందులో 500 మంది కవల పిల్లలే! ఇలా కొడింహిలో పుట్టిన కవలలందరూ కలిసి ఏకంగా ఓ ‘కవలల సంఘాన్నే’ ఏర్పాటుచేసుకున్నారు.

 


‘కొడింహి’లో దాదాపు ఓ 70 ఏళ్ల నుంచి ఇలా కవలపిల్లలు పుట్టడం మొదలైందట. అది రోజురోజుకీ పెరిగిపోతోందనీ... కొన్నాళ్లు పోతే ప్రతి కాన్పులోనూ కవల పిల్లలే పుట్టే పరిస్థితి వచ్చేస్తుందని అంటున్నారు. ఇంతాచేసి మహామహా శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ కవలపిల్లల తాకిడి వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కొడింహిలో ఉండే నీరు తాగడం వల్ల ఇలా కవల పిల్లలు పుడుతున్నారేమో అని కొందరు, ఇక్కడి ఆహారంలో ఉండే కొన్ని ప్రొటీన్ల వల్లే ఇలా కవలలు పుడుతున్నారని మరికొందరు ఊహిస్తున్నారు. కానీ ఏ కారణాన్నీ ఇప్పటివరకూ శాస్త్రీయంగా రుజువుచేయలేకపోయారు. కొడింహిలో ఉండే ఈ విచిత్రమైన లక్షణాన్ని తప్పించుకునేందుకు కొందరు చాలా దూర సంబంధాలను చేసుకున్నారు. కానీ కొడింహిలో పుట్టి పెరిగినవారు, ఎంత దూరం వెళ్లినా.... అక్కడ కూడా వారికి కవలపిల్లలు పుట్టడం విచిత్రం.

 

ఈమధ్యనే జర్మనీ, ఇంగ్లండ్‌కు చెందిన పరిశోధకులు కూడా ఈ ఊరికి వచ్చారు. ఇక్కడి కవల పిల్లల DNAను సేకరించారు. ఆ DNAని విశ్లేషించాకైనా కవలపిల్లల రహస్యం తెలుస్తుందని ఆశిస్తున్నారు. అప్పటిదాకా కొడింహి ఓ మిస్టరీనే!

 

- నిర్జర.