మీరూ స్పైడర్‌మేన్ కావచ్చు

స్పైడర్‌మేన్ పాత్రంటే ఎవరికైనా ఇష్టమే! ఆ స్పైడర్‌మేన్ ఇలా చేయిచాచగానే అతని చేతి నుంచి దారాలు రావడం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ దారాలను పట్టుకుని అతను ఎక్కడికైనా వెళ్లిపోవడం చూసి అసూయా కలుగుతుంది. మనం కూడా చేతికి ఓ యంత్రాన్ని తగిలించుకుని అలా దారాలు వదిలే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు.
సాలెపురుగు దారానికి ఉన్న ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పుకోనవసరం లేదు. అంతే మందమున్న ఇనప తీగతో పోలిస్తే, సాలెదారం చాలా బలంగా ఉంటుంది. ఎటుపడితే అటు వంగుతుంది, సాగుతుంది కూడా! ఇన్ని బలాలు ఉన్నా పట్టులాగా మెత్తగా ఉండటం మరో విచిత్రం. సాలెపురుగు దారానికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి... దీనిని మనిషికి అనువుగా మార్చే ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. దాదాపు 50 ఏళ్ల క్రితమే సాలెపురుగు దారం మీద పరిశోధనలు మొదలయ్యాయి. ఆ పరిశోధనలు ఇప్పుడు కీలక దశ చేరుకున్నాయి.

 


పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు golden orb-weaver spider అనే సాలెపురుగులో ఉండే జన్యువులన్నింటినీ కనుక్కోగలిగారు. ఈ సాలెపురుగుని Genome mapping చేయడం ద్వారా వీరు దాని 14000 జన్యువులనీ గుర్తించారు. వీటిలో 400 జన్యువుల గురించి ఇప్పటివరకూ ప్రపంచానికి తెలియనే తెలియదు. అంతేకాదు! సాలెపురుగు దారాన్ని అల్లేందుకు అవసరమయ్యే 28 రకాల ప్రొటీన్లని కూడా వీరు కనుగొన్నారు. వీటిని spidroins అంటారు.

 


ఈ పరిశోధనలో-  సాలెపురుగు ఒకో సందర్భంలో ఒకో తరహా దారాన్ని వాడుతోందని కూడా తెలిసింది. ఉదాహరణకు సాలెగూడుని అల్లేందుకు ఒక తరహా దారాన్ని వాడితే, సాలెగూడులో చిక్కుకున్న ఆహారాన్ని చుట్టేందుకు మరో తరహా దారాన్ని వాడుతోందట! ఇలా ఒకటే సాలెపురుగు ఏడు సందర్భాల కోసం ఏడు రకాల దారాన్ని వాడుతున్నట్లు గ్రహించారు.
సాలెపురుగు దారం రహస్యమంతా ఇప్పుడు శాస్త్రవేత్తల గుప్పిట్లోకి వచ్చేసింది. కాబ్టటి ఇక కృత్రిమంగా సాలెపురుగు దారాన్ని తయారుచేయడమే తరువాయి! పరిశ్రమల్లోనూ, దుస్తుల్లోనూ, భవన నిర్మాణాలలోనూ... ఇలా రోజువారీ జీవితంలో వేల సందర్భాలలో ఈ దారాన్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు! సాలెపురుగు దారానికి సూక్ష్మక్రిములను ఎదుర్కొనే సత్తా ఉంటుంది. కాబ్టటి గాయాలకు కుట్లు వేసేటప్పుడు, ఎముకలు విరిగినప్పుడు నిరభ్యంతరంగా ఈ దారాన్ని చికిత్సలో వాడవచ్చు.

 


సాలెపురుగు దారాన్ని కనుక కృత్రిమంగా ఉత్పత్తి చేయడం మొదలుపెడితే... ఓ చిన్న యంత్రాన్ని చేతికి బిగించుకుని మనం కూడా స్పైడర్‌మేన్‌గా మారిపోవచ్చునంటున్నారు.

 

- నిర్జర.