మంత్రుల రాజీనామాలపై ముఖ్యమంత్రి సైలెంట్

 

ఈ రోజు హైదరాబాదులో మంత్రుల క్వార్టర్ లో సమావేశమయిన సీమంధ్ర రాష్ట్ర మంత్రులు 15మందీ కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ రాజీనామాలు చేయాలని నిర్ణయించుకొన్నట్లు తాజా సమాచారం. వారు నిన్నరాత్రి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి ఇదే విషయం తెలియజేసినప్పుడు ఆయన ఎవరి నిర్ణయాలు వారు తీసుకోవడమే మేలని వారితో అన్నట్లు సమాచారం. అంటే, వారి రాజీనామాలను తానూ వ్యతిరేఖించడం లేదు, అలాగని ఆమోదించడం లేదని ఆయన అభిప్రాయం కావచ్చును. రాష్ట్ర విభజనను గట్టిగా వ్యతిరేఖించిన ఆయన కూడా ఇప్పుడు తన పరిస్థితి ఏమిటనే దానిపై తీవ్ర సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. అటువంటి స్థితిలో తొందరపడి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం కంటే కొంత కాలం ఆగి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం మేలని ఆయన భావిస్తున్నారు. అయితే, రాష్ట్రానికి అధినేతగా వ్యవహరించిన ఆయన సాటి మంత్రులతో కలిసి ఉద్యమాలు చేయడం సాధ్యం కాకపోవచ్చును. కానీ ఆయన తన రాజకీయ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించవలసి ఉంటుంది గనుక అటు పార్టీ అధిష్టానానికి, ఇటు ప్రజలకి కూడా ఆగ్రహం కలిగించకుండా నేర్పుగా వ్యవహరించవలసి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాజీనామాలకు సిద్దపడుతున్న తన మంత్రులకు ఆయన సలహాలు ఇవ్వడం కూడా మంచిది కాదు, గనుకనే ఆయన వారినే నిర్ణయించుకోమని సూచించినట్లు భావించవచ్చును.