కర్ణాటక ముఖ్యమంత్రి మెడకి, గడియారం గొడవ

 

కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష జనతాదళ్‌ పార్టీలు, ఖరీదైన వాచీల గురించి గొడవ పడుతున్న విషయం తెలిసిందే! పేదల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి సిద్దరామయ్య 70 లక్షలు ఖరీదు చేసే వాచీని ధరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించగా, అలాంటిది ఏమీ లేదంటూ ఇప్పటిదాకా సిద్దరామయ్య కొట్టపారేశారు. పైగా మీరే కోట్లకి కోట్లు ఖరీదు చేసే వాచీలను పెట్టుకుని తిరుగుతున్నారంటూ జనతాదళ్‌ నేత కుమారస్వామిని తిట్టిపోశారు. ఈ వివాదం ముదరడంతో ఎట్టకేలకు సిద్దరామయ్య నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు.

 

ఆ వాచీని దుబాయిలో కార్డియాలజిస్టుగా పేరుగాంచిన గిరీష్‌ చంద్ర వర్మ అనే మిత్రుడు తనకు బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆ వాచీ ఖరీదైన మాట నిజమేననీ, త్వరలోనే దానికి సంబంధించిన వివరాలను ఆదాయపన్ను శాఖకు సమర్పిస్తాననీ చెప్పుకొచ్చారు. ఇక మీదట తాన ఆ వాచీ ధరించబోననీ, వెంటనే దాన్ని ప్రభుత్వానికి బహుమతిగా అందచేస్తాననీ అన్నారు. అయితే ఈ ప్రకటనతో ప్రతిపక్షాల మాటం నిజం కావడమే కాకుండా, ప్రభుత్వ యంత్రాంగాన్ని మోసపుచ్చినందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ కూడా దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. మొత్తానికి ఈ వాచీ సిద్దరామయ్య చేతికి కాకుండా మెడకి చుట్టుకున్నట్లే కనిపిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu