హిందుత్వాన్ని అణగదొక్కే కుట్ర.. వైవి సుబ్బారెడ్డి రాజీనామా చేయాలి

తమిళనాడులోని 23 ప్రాంతాల్లో ఉన్న శ్రీవారికి సంబంధించిన విలువైన ఆస్తులను విక్రయించేందుకు టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ ఆస్తులు అమ్మే హక్కు మీకెక్కడిది అంటూ ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సర్కారుపై మండిపడ్డారు. శ్రీవారికి భక్తులు ఇచ్చిన ఆస్తిని నిర్వహించడానికి మాత్రమే మీకు హక్కు ఉంది. అలాంటిది మీరెలా వేలం వేస్తారు? అంటూ ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే దీని వెనుక హిందుత్వాన్ని అణగదొక్కే కుట్ర దాగివుందనే అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిపై రాజీలేని పోరాటం చేస్తామని కన్నా స్పష్టం చేశారు.

ఇదే విషయంపై స్పందించిన కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ.. జగన్ సర్కార్ విమర్శలు గుప్పించారు. హిందూ దేవాలయాల ఆస్తులు అమ్మకానికి పెట్టటం హిందువులను అవమానించటమే అని అన్నారు. మీ స్వార్ధ ప్రయోజనాల కోసం, మీ బినామీలకు కట్టబెట్టటం కోసం ఇదో కొత్త  ఎత్తుగడ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ఆస్తులు అమ్మకానికి పెట్టటం చేతకాని తనమని, అంత చేతగాని వారు చైర్మన్  వైవి సుబ్బారెడ్డి , పాలక మండలి సభ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మ పరిరక్షకులు అని ప్రచారం చేసుకునే స్వరూపానంద స్వామి, చిన్నజీయర్ స్వామీ ఇతర పీఠాధిపతులు ఏమయ్యారు? మీరు కూడా ప్రశ్నించటానికి భయపడుతున్నారా? అని నిలదీశారు. హిందూ ధర్మాన్ని కాపాడేది మేమే అని ప్రగాల్భాలు పలికే బీజేపీ, విశ్వ హిందూపరిషత్ పెద్దలు మొద్దునిద్ర పోతున్నారా? అని ప్రశ్నించారు. టీటీడీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొవాలని పద్మశ్రీ డిమాండ్ చేశారు.