విశాఖలో వైసీపీకి షాక్!
posted on Jul 11, 2025 9:14AM

మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా తయారైంది విశాఖలో వైసీపీ పరిస్థితది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభొట్టు అన్నట్లుగా తయారౌతోంది. అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆ పార్టీ కార్పొరేటర్లు.. రాష్ట్రంలో అధికారం మారగానే.. రివెంజ్ తీర్చుకున్నారు. పలువురు పార్టీ ఫిరాయించి మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీకి అప్పగించారు. ఇక ఇప్పుడు జెడ్పీ చైర్ పర్సన్ విషయంలో నూ అదే జరుగుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో జిల్లాలో అత్యధిక జడ్పిటిసిలను గతంలో వైసీపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. జడ్పీచైర్ పర్సన్ గా గిరిజన ప్రాంతానికి చెందిన జల్లిపల్లి సుభద్ర ఉన్నారు.
అయితే ఇటీవలి కాలంలో వైసీపీ జడ్పీటీసీలలో పలువురు ఆమె తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిధులు కేటాయింపు తమ ద్వారా కాక నేరుగా చేస్తున్నారన్నది వీరి ఆరోపణ. అయితే ఆమె ఆ అంశాన్ని అంగీకరించడం లేదు కేవలం స్వపక్షంలో కొందరు పదవి కోసం చేస్తున్న ఆరోపణలుగా కొట్టి పారేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి వైసీపీకి చెందిన 22 మంది జడ్పీటీసీలు గైర్హాజరయ్యారు. నిజానికి జిల్లా పరిషత్ లో అనంతగిరిలో సిపిఎం, మాకవరపాలెం లో తెలుగుదేశం మినహాయిస్తే మిగిలిన జడ్పీటీసీలందూ వైసీపీ సభ్యులే. వారిలో అత్యధికులు జడ్పీ సర్వసభ్య సమావేశానికి గైర్హాజరు కావడం చూస్తుంటే స్వపక్షంలోనే జడ్పీ చైర్పర్సన్ తీరుపై ఎంత అసంతృప్తి గూడుకట్టుకుందో అవగతమౌతుంది. ఈ నేపథ్యంలో త్వరలో అంటే సెప్టెంబర్ తరువాత జడ్పీ చైర్సన్ పదవి కూడా వైసీపీ చేజారడం ఖాయమని అంటున్నారు.
అంత వరకూ ఎందుకంటే.. ప్రస్తుత జడ్పీ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే.. నాలుగేళ్ల పాలనా కాలం ముగియాల్సి ఉంటుంది. అది సెప్టెంబర్ నాటికి ముగుస్తుంది. ఆ వెంటనే జడ్పీ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని వైసీపీ జడ్పీటీసీలు భావిస్తున్నారు. ఇప్పటికే విశాఖ కార్పొరేషన్ విషయంలో చేతులు కాల్చుకున్న వైసీపీ.. జడ్పీ చైర్ పర్సన్ విషయంలో అలా జరగకూడదని భావిస్తున్నది. దీంతో పార్టీ సీనియర్ నాయకుడు కురసాల కన్నబాబు రంగంలోకి దిగి వైసీపీ అసంతృప్త జడ్పీటీసీలతో సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కురసాల కన్నబాబు బుజ్జగింపులు ఫలిస్తాయా లేదా చూడాల్సి ఉంది.