15 ఏళ్ల తరువాత తెరుచుకున్న పాఠశాల!
posted on Jul 11, 2025 10:12AM

వరంగల్ జిల్లా నర్సంపేట మండల పరిధిలోని బోజ్యానాయక్ తండాలో గత దశాబ్దంనరగా మూతపడిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇప్పుడు తెరుచుకుంది. ఈ పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్య శారద ప్రారంభించారు. గ్రామ యువకుల కృషితో పాఠశాల పున: ప్రారంభమైంది. యువకుల కృషినీ, ఆదర్శాన్ని గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఈ పాఠశాల పున: ప్రారంభంలో గ్రామ యువత పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ సైతం ప్రత్యేకంగా ప్రశంసించారు. గ్రామ యువత అంతా ఏకతాటిపైకి వచ్చి ఒక కమిటీగా ఏర్పడి గ్రామ అభివృద్ధి కోసం పని చేయడం ముదావహమన్న కలెక్టర్.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఈ పాఠశాల ముందుంటుందన్న ఆశాభావం వ్యక్త చేశారు. అదే విధంగా ఈ గ్రామం నుంచి చదువుకొని ఉన్నత స్థాయికి చేరిన వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఉద్బోధించారు. భవిష్యత్తులో స్కూల్‌కి అవసరమైన పుస్తకాలు, యూనిఫారంలు అన్నీ అందజేస్తామని కలెక్టర్ చెప్పారు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాలల్లో కూడా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారంటూ సోదాహరణంగా చెప్పిన ఆమె ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎంఈవో సారయ్య.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు.. పాఠశాల పునః ప్రారంభంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దే గొప్ప అవకాశంగా దీనిని అభివర్ణించారు.