భద్రాచలం వద్ద ఉరకలేస్తున్న వరద గోదావరి

గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పెరుగుతోంది. భద్రాచలం వద్ద వరద గోదావరి స్నానఘట్టాలను ముంచేసింది. బుధవారం (జులై 9) 24.1 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం గురువారం తగ్గినట్లే తగ్గి మళ్లీ ఉధృతంగా పెరుగుతోంది. గురువారం(జులై 10)  23 అడుగులకు తగ్గింది.

అయితే  శుక్రవారం (జులై 11) ఉదయానికి వరద మళ్లీ పోటెత్తింది. భద్రాచలం వద్ద నీటి మట్టం 33.30 అడుగులకు చేరింది. ఇక 5 లక్షల 45 వేల 600 క్యూసెక్కుల నీరు దిగువకు తరలిపోతున్నది. శుక్రవారం సాయంత్రానికి గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. పోతే గోదావరి పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తoగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.