ధవళేశ్వరం వద్ద వరద గోదావరి ఉగ్రరూపం
posted on Jul 11, 2025 10:51AM

ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద నీటితో పోటెత్తుతోంది. భద్రచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువ అవుతుండగా, ధవళేశ్వరం వద్ద మాత్రం గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో అధికారులు ధవళేశ్వరం బ్యారేజి గేట్లు ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్లుగా కిందకు విడుదల చేస్తున్నారు.
దీంతో దాదాపు 2 లక్షల 600 క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది. గోదావరి వరద కారణంగా లంక గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. కోనసీమలోని లంక గ్రామాల్లోకి నీరు చేరడంతో వాటికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రానున్న 24 గంటలలో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పరీవాహక ప్రాంతంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.