పాతికవేల మెజారిటీతో నవీన్ యాదవ్ విజయం
posted on Nov 14, 2025 12:26PM

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి మెజారిటీ సాధించింది. శుక్రవారం (నవంబర్ 14) ఉదయం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైన క్షణం నుంచీ కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. మొత్తం పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పాతిక వేలపైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచీ నవీన్ యాదవ్ ఆధిక్యంలోనే ఉన్నారు. అంతే కాకుండా రౌండ్ రౌండ్ కూ ఆ అధిక్యత పెరుగుతూ వచ్చింది. ఈ విజయంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. గాంధీ భవన్ లోనూ, నవీన్ యాదవ్ కార్యాలయంలోనూ కాంగ్రెస్ నేతలు, శ్రేణులూ మిఠాయిలు పంచుకుని, బాణ సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
జూబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం పై హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విజయాన్నిపురస్కరించుకుని గ్రామ గ్రామాన సంబరాలు చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. జూబ్లీ ఉప ఎన్నిక విజయం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గెలుపుగా ఆయన అభివర్ణించారు.
కాగా జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ విజయంపై హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. ఈ విజయం ఊహించిందేనన్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కుఅయ్యి చేసిన రాజకీయాలు ఫలించలేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటైనా.. కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో విజయం సాధించిందన్నారు. ఈ విజయం విజయం కాంగ్రెస్ కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.