అన్నా చెల్లెళ్ళ అనుబంధం!

Publish Date:Feb 3, 2014

Advertisement

 

 

 

ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే... అన్నయ్యా.. నీవేలే నా ప్రాణమూ.. ఓ చెల్లెమ్మా నీవేలే నా లోకమూ... అంటూ అన్నా చెల్లెళ్ళ అనుబంధంతో సాగే సినిమా పాట గుర్తుందిగా. ఆదివారం జరిగిన జగన్ పార్టీ ప్లీనరీలో స్టేజీ మీద ఈ పాటని ప్లే చేసినట్టయితే, స్టేజీమీద కనిపిస్తున్న సీన్‌కి ఈ పాట బాగా సింకయ్యేది. ఎందుకంటే ఈ మీటింగ్‌ వేదిక మీద జగనన్న, ఆ జగనన్న వదిలిన బాణం షర్మిల తమ అన్నాచెల్లెళ్ళ అనుబంధం గురించి అందరికీ తెలిసేలా వ్యవహరిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించారు.

 

జగన్ జైల్లో ఉన్నన్నిరోజులూ పార్టీ బాధ్యతలు తీసుకుని పాదయాత్రలు చేసిన షర్మిలకు జగన్ జైల్లోంచి బయటకి వచ్చాక ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది. షర్మిల కడప నుంచి లోక్‌సభకు పోటీ చేయాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచారని, అయితే దాన్ని జగన్ తిరస్కరించడంతో ఆమె పార్టీ ఛాయలకు రావడం మానుకున్నారన్న అభిప్రాయాలు గతంలో వినిపించాయి. అయితే ఇప్పుడు వైసీపీ కష్టాల్లో ఉన్నందున అన్నయ్య పార్టీని రక్షించడానికి షర్మిల మళ్ళీ ముందుకొచ్చారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  ఈ సందర్భంగా వేదిక మీద తల్లి విజయమ్మ మధ్యలో కూర్చుని వుండగా, అటు జగన్, ఇటు షర్మిల కూర్చుని నవ్వుతూ మాట్లాడుకున్నారు. మేం చాలా సన్నిహితంగా వున్నాం. మామధ్య ఎలాంటి విభేదాలు లేవన్న విషయాన్ని జనంలోకి వెళ్ళేలా చేయడానికే వీరిద్దరూ ఇలా పబ్లిగ్గా అనుబంధాన్ని వ్యక్తం చేసి వుంటారని పరిశీలకులు భావిస్తున్నారు.అలాగే ఈ వేదిక మీద నుంచి షర్మిల చేసిన ప్రసంగం కూడా తనకు, జగనన్నయ్యకి మధ్య ఎలాంటి విభేదాలు లేవనే అర్థం వచ్చేలా సాగిందని అంటున్నారు. ‘నేను జగనన్న వదిలిన బాణాన్ని అంతిమలక్ష్యం చేరేవరకూ ఎంత దూరమైనా సాగుతాను’ అని షర్మిల స్పష్టంగా చెప్పడం కూడా తామంతా ఒక్కటే అనే సందేశాన్ని జనానికి ఇవ్వడంలో భాగమేనని విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News