అధ్య‌క్షుడు కాలేని మస్క్ పార్టీ పెట్టి ప్ర‌యోజ‌న‌మేంటి?

మ‌స్క్ పెట్టిన  పార్టీపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా  చ‌ర్చ న‌డుస్తోంది. ఎందుకంటే అమెరికాలో ఒక‌రు అధ్య‌క్షులు కావాలంటే..  అందుకు ఫ‌స్ట్ వారు  జ‌న్మ‌తహ అమెరికా పౌరులై ఉండాలి.  35 ఏళ్ల‌ పైబ‌డి వ‌య‌సుగ‌ల వారై ఉండాలి.  ఆపై 14 ఏళ్ల పాటు అమెరికాలోనే నివాసం ఉండి తీరాలి. వీటిలో ఏవీ మ‌స్క్ కి   లేవు. ఆయ‌న ద‌క్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టారు. ఇది సౌతాఫ్రికా కార్య‌నిర్వాహ‌క రాజ‌ధాని. గ‌తంలో జ‌గ‌న్ త‌న  పాల‌న‌లో మూడు రాజ‌ధానుల పాల‌సీ తెచ్చిందే ఇక్క‌డి నుంచి కాపీ కొట్టే అన్నసంగతి తెలిసిందే. అది పక్కన పెడితే.. మస్క్ కి ఎక్కడా  అమెరిక‌న్ మూలాలు కూడా లేవు.   మూలాలు ఉంటే, అయినా వంశ‌పారంప‌ర్య వార‌స‌త్వ‌మైనా వ‌చ్చేది. అయితే అమెరికాలో పుట్ట‌కుండా అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వుల‌ను అలంక‌రించిన వారు లేరా? ఆ డీటైల్స్ ఏంటి? అని చూస్తే..  జాన్ మెక్ కెయిన్. ఇక్కడ ఆయన్ను సేఫ్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే.. ఆయన స్వతహాగా అమెరికాలో పుట్టిన వారు కారు.  జాన్ మెక్‌కెయిన్ పనామా కెనాల్ జోన్‌ లో జన్మించారు.  1936 ఆగస్టు 29 న పనామా కెనాల్ జోన్‌లోని కోకో సోలో నావల్ ఎయిర్ స్టేషన్‌లో జన్మించారు, ఆయన తండ్రి నావికా అధికారి కావడంతో ఆయన ఆ ప్రాంతంలో జన్మించారు. ఆ సమయంలో అంటే 1903 నుంచి 1979 వరకూ పనామా కెనాల్ జోన్ యునైటెడ్ స్టేట్స్ ఆధీనంలో ఉండేది. తర్వాత ఈ ప్రాంతం అమెరికా నుంచి వేరు పడింది. అయితే ఆయన పుట్టిన సమయంలో అక్కడ అమెరికా పాలన ఉండటంతో.. ఆయన్ను అమెరికన్ గానే పరిగణించింది అమెరికా రాజ్యాంగం. దీంతో ఆయన 2008లో రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయగలిగారు. 

అయితే కెనడాలో జన్మించిన ఏకైక అధ్యక్షుడిగా చెస్టర్ ఆర్థర్ గురించి చెబుతారు. అయితే ఈ విషయంలోనూ అవును, కాదూ అంటూ కొన్ని వివాదాలున్నాయి. దీంతో పాటు బ్రిటిష్ అమెరికా బార్న్ అధ్యక్షులు కొందరున్నారు. వారే వాషింగ్టన్, ఆడమ్స్, జెఫెర్సన్, మాడిసన్, మన్రో, క్విన్సీ ఆడమ్స్, జాక్సన్, విలియం హారిసన్‌. వీరు అమెరికాలో కాకుండా బ్రిటిష్ అమెరికాలో జన్మించారు. కానీ ఇదేమంత తప్పు కాదని అంటారు. ఎందుకంటే ఆ సమయంలో అమెరికాలోని ఎన్నో ప్రాంతాలు బ్రిటన్ అధీనంలో ఉండేవి. అమెరికాలో జన్మించిన తొలి అధ్యక్షుడెవరని చూస్తే..  మార్టిన్ వాన్ బ్యూరెన్. ఈయన 1782లో న్యూయార్క్‌లోని కిండర్‌హూక్‌లో జన్మించారు. యునైటెడ్ స్టేట్స్ స్వాతంత్యం పొందిన తర్వాత జన్మించిన తొట్ట తొలి అధ్యక్షుడు. ఈయన్ను ద ఫస్ట్ రియల్ అమెరికన్ ప్రెసిడెంట్ గా పరిగణిస్తారు.
  
వీట‌న్నిటిని బ‌ట్టీ చూస్తే ఎలాన్ మ‌స్క్ కి అంత తేలిగ్గా అమెరికా అధ్య‌క్షుడ‌య్యే అవ‌కాశం లేదు. మ‌రి ఇంత చేస్తే ఆ ఫ‌లితాన్ని ఎవ‌రు కొల్ల‌గొడ‌తారు? ఆ మాట‌కొస్తే ద అమెరికా పార్టీలో చేరేవారెవ‌రు? అన్న‌దొక చ‌ర్చ కాగా.. బిగ్ బ్యూటిఫుల్ బిల్ ని వ్య‌తిరేకించే వారు ఈయ‌న పార్టీలో చేరే ఛాన్సులైతే క‌నిపిస్తున్నాయి. అయితే ఆయ‌న ద‌గ్గ‌రున్న సంప‌ద ఎంత? దాన్ని పార్టీ నిర్మాణానికి ఎలా వాడుకోగ‌ల‌ర‌ని చూస్తే..  ఫోర్బ్స్ గ‌ణాంకాల ప్రకారం మ‌స్క్ ద‌గ్గ‌ర 40 వేల 520 కోట్ల డాల‌ర్ల సంప‌ద ఉంది. కొన్ని లెక్క‌ల ప్ర‌కారం ఆయ‌న 400 బిలియ‌న్ డాల‌ర్ల నిక‌ర నిల్వ‌ల‌కు య‌జ‌మాని.

ఆయ‌న‌కు టెస్లా, స్పేసెక్స్ ద్వారా ఇంత సంపాద‌న స‌మ‌కూరింది. ఇందులోనూ టెస్లా ద్వారా 75 శాతం సంప‌ద జ‌మ‌కూడింది. ప్ర‌స్తుతం ట్రంప్ ప్ర‌వేశ పెట్టిన బిగ్ బ్యూటీఫుల్ బిల్   ఆయ‌న టెస్లా అమ్మ‌కాల‌ను దారుణంగా దెబ్బ తీస్తుంది. బేసిగ్గా టెస్లాల‌ను ట్రంప్ స‌ర్కార్ ఎందుకు వ‌ద్దంటుందంటే.. అదంతా ఎలక్ట్రిక్ వాహ‌నాల వ్య‌వ‌హారం. ఈవీలు ఎప్పుడైతే విరివిగా రోడ్డెక్కుతాయో.. అప్పుడు పెట్రోల్ డిమాండ్ త‌గ్గుతుంది. పెట్రోలుకు సంబంధించి భారీ ఎత్తున డాల‌ర్ల నిల్వ అమెరిక‌న్ ట్రెజ‌రీల్లో దాగి ఉంటుంది. పెట్రోల్ డిమాండ్ ఎప్పుడు ప‌డిపోతుందో ఈ డాల‌ర్ల నిల్వ‌లు కూడా అమాంతం క‌రిగిపోతాయి. కాబ‌ట్టి మ‌స్క్ టెస్లా ఈవీల‌ను వ‌ద్దంటారు ట్రంప్. ఇక్క‌డే ఈ ఇద్ద‌రికీ చెడింద‌ని చెబుతారు. దీంతో ట్రంప్ బిగ్ బిల్ పై సంత‌కం పెట్టిన వెంట‌నే పార్టీ అనౌన్స్ చేశారు మ‌స్క్.

అయితే త‌న‌కున్న సంప‌ద‌లోని మొత్తం  పార్టీ కోసం ఖ‌ర్చు చేయ‌డానికి వీల్లేదు. కేవ‌లం నాలుగున్న‌ర  ల‌క్ష‌ల డాల‌ర్లను మాత్ర‌మే వాడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. మిగిలిన విరాళాల‌ను సూప‌ర్ పీఏసీల ద్వారా సేక‌రించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఆయ‌న ఇక్క‌డి చ‌ట్టాల‌ను అనుస‌రించి   సేక‌రించాలి.  2026లో జ‌రిగే మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో హౌస్, సెనెట్ సీట్ల‌కు మ‌స్క్ త‌న‌ పార్టీ అభ్య‌ర్ధుల‌ను నిల‌బెట్టే అవ‌కాశాలు లేక పోలేదని అంటున్నారు. 

అయితే మ‌స్క్ పార్టీ ద్వారా ఏం సాధించ‌నున్నారు? అని చూస్తే కొంద‌రు చెప్పే మాట ఏంటంటే ఒక‌ప్పుడు ట్రంప్ గెలుపున‌కు ఏకంగా ఆయ‌న ట్విట్ట‌ర్ ని కొనుగోలు చేశారు. త‌ద్వారా ట్రంప్ గెలుపు మార్గాన్ని సుగ‌మం చేశారు. అలాంటి మ‌స్క్.. ఇప్పుడు త‌న గ‌ళం తాను వినించుకోడానికి ఒక వేదిక కోసం చూస్తున్నారు. దాన్నే త‌యారు చేస్తున్నారు. దాని పేరే ది అమెరికా పార్టీ. ఇది ఒకే పాముకు రెండు త‌ల‌లాంటి డెమొక్రాట్, రిప‌బ్లిక‌న్ల‌కు ప్ర‌త్యామ్న‌యంగా తన పార్టీ ఉంటుందని ఆయ‌న చెబుతున్నారు. మ‌రి  చూడాలి.. అధ్య‌క్షుడ‌య్యే అవ‌కాశ‌మే లేని మ‌స్క్ ఈ పార్టీ ద్వారా అమెరికా రాజ‌కీయాల‌ను ఎలా ప్రభావితం చేస్తారో?  

అయితే కార్లు, రాకెట్ల‌లో ఏ విధ‌మైన విప్ల‌వాత్మ‌క మార్పు తెచ్చారో.. మ‌స్క్ గానీ రాజ‌కీయాల్లోకి వ‌స్తే.. ఇప్ప‌టికే రెండుగా చీలిన అమెరికా స‌మాజాన్ని ఎలా మ‌లుపు తిప్పుతారో చూడాలంటారు కొంద‌రు ఆశావాదులు.  బేసిగ్గా తాను అమెరికాకు కార్లు, రాకెట్లు త‌యారు చేయ‌డానికి వ‌చ్చాన‌నీ.. తాను ఆఫ్రిక‌న్ కాబ‌ట్టి ఇక్క‌డ అధ్య‌క్షుడు కాలేన‌ని ఆయ‌న గ‌తంలోనే అన్నారు. ట్రంప్ పాల‌న‌లో తాను కూడా ప‌ని చేసి ఆయ‌న‌కు స‌హ‌క‌రిస్తాన‌ని అన్నారు. కానీ బిగ్ బ్యూటిఫుల్ బిల్ కార‌ణంగా ఇద్ద‌రికీ చెప్ప‌న‌ల‌వి కానంత గొడ‌వ‌లు చెల‌రేగ‌డంతో.. ఇదిగో ఇలా  కొత్త పార్టీ పెట్టేశారు. త‌ర్వాత  ఏంట‌న్న‌దాని కోసం వెయిట్ అండ్ సీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu