ఫసల్ బీమా పథకంపై జగన్ సర్కార్ నిర్లక్ష్యం.. కేశినేని చిన్ని ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబు

ఆంధ్రప్రదేశ్ లో 2020 నుంచి 2022 వరకూ ఫసల్ బీమా పథకం అమలు కాలేదు, అప్పటి జగన్ సర్కార్ ఈ పథకాన్ని అమలు చేయకూడదని నిర్ణయించింది. కేంద్రం ప్ర‌భుత్వం చేసిన ప్ర‌య‌త్నాల వ‌ల్ల ఏపీ ప్ర‌భుత్వం 2022 ఏడాది ఖ‌రీఫ్ సీజ‌న్ నుంచి  రాష్ట్రంలో మ‌ళ్లీ   పీఎంఎఫ్‌బీవై పథకం అమ‌ల్లోకి తీసుకువ‌చ్చింది. 

లోక్ సభలో మంగళవారం (జులై 30) ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో  విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్   ఫసల్ బీమాపై అడిగిన ప్రశ్నకు కేంద్ర‌ వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ స‌హాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లిఖిత పూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి అర్హులైన ల‌బ్ధిదారుల వివ‌రాలు జిల్లాల ప‌రంగా కావాల‌ని, ల‌బ్ధి దారుల్లో స్త్రీ, పురుష‌ల సంఖ్య కూడా చెప్పాల‌ని ఎంపి కేశినేని శివనాథ్ అడిగారు. అలాగే  పీఎంఎఫ్‌బీవై పథకం కింద రాష్ట్రంలో ఎంత‌మందికి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చెల్లింపులు జ‌రిగాయి.ఎన్ని తిర‌స్కరించారు. పెండింగ్ లో వున్న ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వివ‌రాలు సంఖ్య జిల్లాల వారీగా కావాల‌ని అడిగారు.? అంతే కాదు తిర‌స్క‌రించిన‌ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ను తిరస్కరించ‌టానికి కార‌ణాలు ఇవ్వాల‌ని అడిగారు?  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద రూపొందించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ,  విడుదల చేసిన సొమ్ము సగటు  జిల్లాల‌ వారీగా చెప్పాల‌ని కోర‌టం జ‌రిగింది. 

 ఆంధ్రప్రదేశ్‌లో  పీఎంఎఫ్‌బీవై  కింద నమోదైన రైతుల వినతుల  వివ‌రాలు జిల్లా వారీగా చూస్తే కృష్ణ జిల్లా ఎక్కువ వ‌చ్చాయి.  2022-23 ఏడాదిలో 8,21,804 రాగా,  2023-24  ఏడాదికి గాను 7,55,848 వ‌చ్చాయి. అత్య‌ల్పంగా విశాఖ‌ప‌ట్ట‌ణం నుంచి వ‌చ్చాయి. 2022-23 ఏడాదికి 38,464, 2023-24 ఏడాదికి గాను    36,971వ‌చ్చాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప‌రంగా 2022-23 ఏడాదికి వ‌చ్చిన విన‌తుల సంఖ్య 1,23,16,188 వుండ‌గా, 2023-24 ఏడాదికి గాను వ‌చ్చిన విన‌తుల సంఖ్య 1,31,59,483 గా వుంద‌ని వివ‌రించారు.

 ఇక 2022-23 సంబంధించి పీఎంఎఫ్‌బీవై ల‌బ్ధిదారులు సంఖ్య మొత్తం 1,23,16,188 వుండ‌గా వీరిలో 91,49,296 మంది పురుషులు, 31,64,175 మంది స్త్రీలు వున్నార‌ని చెప్పుకొచ్చారు. అలాగే 2023-24 ఏడాదికి పీఎంఎఫ్‌బీవై ల‌బ్ధిదారులు సంఖ్య మొత్తం 1,31,59,483 వుండ‌గా, వీరిలో 98,35,523 మంది పురుషులు, 33,21,756 మంది స్త్రీలు వున్న‌ట్లు తెలిపారు. 

అలాగే 2022-23 సంవత్సరానికి గాను ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 3,49,633 మందికి రైతుల‌కి  ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కింద 5,63,36,49,134 కోట్ల రూపాయ‌లు చెల్లించిన‌ట్లు తెలియ‌జేశారు. అలాగే ఒక్కో రైతుకి స‌గ‌టున ఇన్సూరెన్స్ క్లెయిమ్స్  చెల్లింపు కింద‌  16,113 రూపాయ‌లు చెల్లింపు చేసిన‌ట్లు వివ‌రించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu