విశ్వసనీయత జాగాలో వచ్చి చేరిన కొత్త పదం నిజాయితీ

 

ఇంతకు ముందు వైకాపా ‘విశ్వసనీయత’కు పేటెంట్ హక్కులు పొందినట్లు మాట్లాడేది. కానీ తెలంగాణాలో జండా పీకేసినప్పటి నుండి దైర్యంగా ఆ పదం పలకలేకపోతోంది. దానికి బదులు ఇప్పుడు కొత్తగా ‘నిజాయితీ’ అనే పదం అందుకొంది. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయాలని చెపుతున్నజగన్, కేంద్రం రాష్ట్ర విభజన ప్రకటన చేసిన తరువాత ఆయన పార్టీ అన్ని రంగులు ఎందుకు మార్చిందో, ఆ క్రమంలో తెలంగాణా ప్రజలను, కొండా సురేఖ వంటి తన పార్టీ నేతలను నిర్దాక్షిణ్యంగా ఎందుకు వదిలించుకొందో మరిచిపోయినట్లున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతున్నప్పుడు ఆయన పార్టీ అంత హటాత్తుగా తెలంగాణాను ఎందుకు వదిలిపెట్టవలసి వచ్చిందో చెప్పాల్సి ఉంది.

 

అదే విధంగా, ఇంతవరకు ఆయనకు, ఆయన పార్టీకి అండగా నిలిచిన కాంగ్రెస్ యంపీ సబ్బం హరిని, కనీసం పిలిచి సంజాయిషీ అయినా కోరకుండా, మీడియా ద్వారానే ‘అతనికి మాకు సంభందం లేదని’ చెప్పి వదిలించుకోవడం ఎటువంటి నిజాయితీ? పైగా అంత నమ్మకస్తుడిగా పనిచేసిన సబ్బం హరికి వైకాపా చివరిగా ఇచ్చిన బహుమానం ఏమిటంటే ‘కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగస్తుడనే ముద్ర.’ దీనిని ఎటువంటి రాజకీయం అనాలి?

 

జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా సమైక్యాంధ్ర గురించి పోరాడితే ఎవరు తప్పపట్టారు. ఇతర పార్టీలతో ప్రమేయం లేకుండా తన పోరాటమేదో తను చేసుకొంటే నచ్చిన వారు వచ్చి కలుస్తారు. నచ్చని వారు దూరంగా ఉంటారు. కానీ ఆ పేరుతో సీమాంద్రాలో పార్టీని బలపరచుకోవడం, ఆ మిషతో తన ప్రత్యర్ధులను రాజకీయంగా దెబ్బతీయాలనుకోవడం గర్హనీయం.

 

ఒకవేళ ఆయనకున్నంత ‘నిజాయితీ’ ఈ రాష్ట్రంలో మరెవరికీ లేదని ప్రజలు భావిస్తే, వారే ఇతర పార్టీలకు, నేతలకు తగిన గుణపాఠం చెపుతారు. ఆ శ్రమ ఆయనెందుకు తీసుకోవడం? ముందు తన నిజాయితీ ఏమిటో నిరూపించుకొంటే చాలు కదా?