మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ విడుదల
posted on Jun 18, 2025 4:35PM

ఇంగ్లండ్ వేదికగా 2026 జూన్ 12 నుంచి జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ రిలీజ్ చేసింది. ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు, శ్రీలంకతో తలపడనుంది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు ప్రతిష్ఠాత్మక ట్రోఫీ కోసం పోటీపడతాయి. గతేడాది ఈ ట్రోఫీని న్యూజిలాండ్ జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే.
నెల రోజుల పాటు సాగే ఈ క్రికెట్ సమరంలో మొత్తం 33 మ్యాచ్‌లు ఇంగ్లండ్, వేల్స్‌లోని ఏడు వేర్వేరు వేదికలపై జరగనున్నాయి. టిమీండియా క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్థాన్ మధ్య గ్రూప్ స్టేజ్ మ్యాచ్ జూన్ 14న జరగనుంది. ఇరు జట్ల మధ్య చివరిసారిగా 2024 అక్టోబర్ 6న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ మహిళల జట్టుపై భారత మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మరోసారి దాయాదుల పోరు కోసం భారత క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.