ఇరాన్ నుంచి విద్యార్ధులు సురక్షితంగా స్వదేశానికి

ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఉద్రిక్తలు చోటు చేసుకున్నా, ముఖ్యంగా ఇరుగు పొరుగు దేశాల మధ్య యుద్ధ వాతావరణం, నెలకొన్న సమయంలో, ఆయా దేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్ధులను, ఇతరత్రా, ఉద్యోగ, ఉపాధి వ్యాపకాల్లో ఆయా దేశాల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు రావడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారుతున్నది. గతంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన సమయంలో ఉక్రెయిన్ లో చిక్కుకు పోయిన వందలాది మంది భారత విద్యార్ధులను మన విదేశాంగ శాఖ  ఆ దేశంతో దౌత్య పరమైన చర్చలు జరిపి సురక్షితంగా స్వదేశానికి తీసుకు వచ్చింది.
ఇప్పడుమళ్ళీ మరో మారు  అలంటి పరిస్థితే ఎదురైంది.ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ద వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో ఇరు దేశాల్లో చిక్కుకుపోయిన  భారతీయులు, ముఖ్యంగా ఇరాన్ లో పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ విద్యార్ధులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు వచ్చేందుకు  విదేశాంగ శాఖ  నడుం బిగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు మూడు దేశాల విదేశీ పర్యటనలో ఉన్న  విదేశాంగ మంత్రి  ఎస్. జయశంకర్  భారతీయ విద్యార్ధులు సురక్షితంగా  సరిహద్దులు దాటేలా అనుమతించాలని చేసిన విజ్ఞప్తిని   ఇరాన్   ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. అయితే.. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తమ గగనతలాన్ని ఇప్పటికే మూసేసిన నేపథ్యంలో, భూసరిహద్దుల్ని తెరిచి భారతీయ విద్యార్ధులను, సరిహద్దులు దాటించేందుకు ఇరాన్ అంగీకరించింది. 

ఇరాన్లో  భారత్ కు చెందిన 1500 మందికి పైగా విద్యార్దులున్నారు.  వారిని తరలించడానికి సహకరించాల్సిందిగా భారత్ చేసిన అభ్యర్థనల దృష్ట్యా వారు సురక్షితంగా సరిహద్దులు దాటి వెళ్లడానికి అన్ని భూ సరిహద్దులు దాటడానికి తెరిచి ఉన్నాయని ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. దీంతో ఇరాన్ లో చిక్కుకుపోయిన భారత  విద్యార్ధులు  సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటారనీ, ఆందోళన చెంద వలసిన అవసరం లేదని  విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.