ఏడుపు వల్ల బోలెడు లాభాలట


మగపిల్లలు ఏడిస్తేనేమో ‘ఎందుకలా ఆడపిల్లలా ఏడుస్తావు?’ అని తిడతారు. ఆడపిల్లలు ఏడిస్తేనేమో ‘ఆడపిల్లలు లక్ష్మీదేవితో సమానం. ఏడిస్తే దరిద్రం!’ అంటూ వారిస్తారు. కానీ మనసుకి బాధ కలిగితే తనివితీరా ఏడవాలని ఎవరికి మాత్రం అనిపించదు. ఇకమీదట అలాంటి సందర్భం వస్తే తృప్తిగా ఏడ్చేయమంటున్నారు నిపుణులు. అలా ఏడవడం వల్ల బోలెడు లాభాలు కూడా ఉన్నాయంటున్నారు. అవేవిటంటే...

 

విషాలు బయటకు పోతాయి

ఉద్వేగం వల్ల ఏడుపు వస్తుందన్న విషయం తెలిసిందే! అయితే ఈ ఉద్వేగాన్ని మనసులోనే అట్టిపెట్టేసుకుంటే... దాని వలన కార్టిసాల్, ఎన్‌కెఫలిన్ వంటి హానికారక రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. సుబ్బరంగా ఏడ్చేస్తే ఆ రసాయనాలన్నీ నిమ్మకుండిపోతాయి. అందుకనే ఏడ్చిన తరువాత మనసు మునుపటికంటే చాలా తేలికగా ఉండటాన్ని గమనించవచ్చు.

 

సృజనశక్తి పెరుగుతుంది

త్వరగా కళ్లు చెమరుస్తున్నామంటే మనలో సున్నితమైన స్పందనలు ఇంకా మిగిలిఉన్నట్లు లెక్క. గుండెను రాయి చేసేసుకున్నవారి కళ్లలోకి తడి రాదు కదా! ఇలాంటి సున్నితత్వం ఉన్నవారు తమ స్పందనలకు చక్కటి రూపం ఇవ్వగలరని అంటున్నారు. ఒక బాధాకరమైన విషయాన్ని అక్షరబద్ధం చేయాలన్నా, ఒక ఆలోచనను చిత్రంగా మలచాలన్నా అప్పుడప్పుడూ కంటతడి పెట్టే అలవాటు ఉండాలంటున్నారు.

 

బ్యాక్టీరియాను చంపేస్తుంది

తల్లిపాలు, లాలాజలం, వీర్యం వంటి అతికొద్ది పదార్థాలలో మాత్రమే కనిపించే ‘లైసోజైం’ అనే ప్రొటీన్‌ మన కన్నీరులో కూడా ఉంటుందట. ఇది మన శరీరంలోని బ్యాక్టీరియాను అతి సులువుగా చంపగలదని చెబుతారు. ప్రపంచాన్ని వణికించే ‘ఆంత్రాక్స్‌’ క్రిములను సైతం మన కంటినీరు నిర్వీర్యం చేయగలదట. హానికారక బ్యాక్టీరియా గోడలలోకి చొచ్చుకుపోవడంలో లైసోజైం తీరే వేరంటున్నారు.

 

బంధాలను నిలుపుతుంది

ఇతరులతో మనకు ఉండే ప్రతిస్పందనలకు ఏడుపుని పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఒక కష్టాన్ని మాటల్లో చెప్పలేనప్పుడు, ఇతరుల బాధని చేతల్లో మాన్పలేనప్పుడు... ఎదుటివారి భుజం మీద తల పెట్టి భోరున ఏడ్చేస్తే చాలు. మనకి వాళ్లు, వాళ్లకి మనం ఉన్నామన్న భరోసా ఏర్పడుతుంది. ఓ నాలుగు కన్నీటి చుక్కలు ఒకోసారి తెగిపోయిన బంధానికి కూడా చిగురునిస్తాయి.

 

ముందుకు సాగే ధైర్యం

కష్టసుఖాలు ద్వంద్వాలు. ఈ రెండింటిలో ఏదో ఒకటి లేకుండా జీవితం సాగడం అసంభవం. ఆ విషయాన్ని గ్రహించి కష్టంలో నిబ్బరంగానూ, సుఖంలో నేలమీదా నిలబడినవాడే ముందుకు సాగిపోగలడు. కష్టం వచ్చినప్పుడు ఓ ఏడ్పు ఏడ్చేస్తే, ముందుకు పోయేందుకు సాంత్వన లభిస్తుంది. ఎడతెగని బాద నుంచి తేరుకోవాలన్నా, మనసుని మళ్లీ కుదుటపరచుకోవాలన్నా అది ఏడుపుతోనే సాధ్యం. లేకపోతే ఆ కష్టం మనసులోనే తిష్ట వేసుకుని జీవితాన్ని అటకాయిస్తుంది. అందుకని జీవితం ప్రవహించాలంటే, ఒకోసారి కన్నీరు కూడా ప్రవహించాల్సిందే!

 

ఏడుపు వల్ల అటు ఆరోగ్యంగానూ, ఇటు మానసికంగానూ ఉన్న ఇలాంటి లాభాల గురించి చెప్పుకోవాలంటే పెద్ద జాబితానే తయారవుతుంది. ఏడుపులో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే జపానులో ‘rui-katsu’ పేరుతో బలవంతంగా ఏడ్చే సంఘాలు ఏర్పడుతున్నాయి. ఏడుపు వల్ల నానారకాల సమస్యలూ తీరిపోతాయని ఈ సంఘపు సభ్యులు నమ్ముతారు. అలా మరీ బలవంతంగా ఏడవక్కర్లేదు కానీ, సందర్భం వచ్చినప్పుడు కన్నీటిని దాచుకోకుండా ఉంటే చాలేమో!

 

- నిర్జర.