సిద్దిపేట నియోజకవర్గంలో మొక్కల సంరక్షణకై హరిష్ రావు ప్రత్యేక శ్రద్ద


మనం ఒకప్పుడు విన్న  డైలాగ్   ఇప్పుడు  కళ్ళ ముందు  కనిపిస్తుంది మొక్కె కదా అని పీకేస్తే పీక తెగుద్ది ఇది ఓ పాపులర్ సినిమా లోని డైలాగ్ ఇప్పుడు సిద్దిపేటలో ఇదే జరుగుతుంది. కాకపోతే పీక తెగకుండా మొక్క పీకితే జేబులు ఖాళీ కావచ్చు, జైలుకు వెళ్లవచ్చు, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను ఎవరు ధ్వంసం చేసిన అనుమతి లేకుండా కొమ్మలూ నరికిన మొక్కలకు అమర్చిన ట్రీగార్డు ఎత్తుకెళ్లిన జరిమానాలు విధిస్తున్నారు. లేదంటే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. సిద్దిపేటలో ఇప్పటికే జరిమానాలతో పాటు కేసులు కూడా నమోదయ్యాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల సంరక్షణకు సిద్దిపేటలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. హార్టికల్చర్ అధికారులు ఆకస్మిక తనిఖీలను చేపడుతున్నారు. మొక్కల సంరక్షణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, తొలగించిన సదరు వ్యక్తులపై అక్కడికక్కడే చర్యలు తీసుకుంటున్నారు, జరిమానాలు విధిస్తున్నారు.

మొక్క, చెట్టు ఏజ్ ను బట్టి వెయ్యి నుంచి గరిష్ఠంగా ఇరవై ఐదు వేల వరకు జరిమానా విధిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పట్టణంలో మొక్కల నరికిన దాదాపు పదిహేను మందికి జరిమానాలు విధించారు. వీరిలో కొందరిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ముఖ్యంగా పట్టణాల్లో సీసీ ఫుటేజ్ ఆధారంగా మొక్కలు నరికిన వ్యక్తులను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. రోడ్డుపై లేదా డివైడర్లపై మొక్కలూ చెట్లూ పడిపోయి ఉన్న ట్రీగార్డులు ఎత్తుకెళ్లిన, ఎంక్వైరీ చేసి మరీ జరిమానాలు విధిస్తున్నారు.ఇప్పటిదాక జరిమానాల ద్వారా దాదాపు నలభై వేల రూపాయలు మునిసిపల్ అకౌంట్ లో జమ చేశారు.

మాజీ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో మొక్కల రక్షణకు అనుక్షణం తపిస్తున్నారు. చెట్టు పడింది కనపడటం లేదా అంటూ అక్కడే నిలదీస్తారు. ఇటీవల సిద్దిపేట పట్టణంలో పర్యటిస్తున్న హరీశ్ రావు పాత బస్టాండ్ కరీంనగర్ రోడ్డులో ఒక షాపు ముందు పడి ఉన్న చెట్టును గమనించి కారులోంచి దిగి నేరుగా షాపు యజమాని దగ్గరికి వెళ్లారు.

ఏం బాబు చెట్టు కింద పడింది కనబడటం లేదా షాపు ఓపెన్ చేసేటప్పుడు చెట్టును చూడలేదా రోజు ఉన్న చెట్టు లేదని గమనించలేదా చెట్టంటే అంత నిర్లక్ష్యమా అని షాపు యజమానిని నిలదీశారు. అక్కడే ఉండి అతనితో కింద పడిన మొక్కను కర్రతో కట్టించి సరి చేపించారు. మన ప్రాణం ఎంతో మొక్క ప్రాణం అంతే అని మరోసారి మొక్కను నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వ శాఖలను కూడా ఆయన వదిలిపెట్టటం లేదు.

ఇటీవల సిద్దిపేట నుండి సీతారాంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గాన వెళ్తూ పట్టణంలోని ముస్తాబాద్ రోడ్డులో చెట్లను నరకడం గమనించిన హరీశ్ రావు కారులోంచి దిగి చెట్ల కొమ్మలు తీసేస్తున్న విద్యుత్ లైన్ మెన్ పై సీరియస్ అయ్యారు. విద్యుత్ డీఈ, ఏఈలపై ఫోన్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము మొక్కలు నాటుతూ పోతే మీరు నరుక్కుంటూ పోతారా అని సీరియస్ అయ్యారు.

శాఖల మధ్య సమన్వయంతో వ్యవహరించి చెట్లను సంరక్షించాలని సూచించారు. చెట్లను నరకొద్దు ఇబ్బందిగా ఉన్న కొమ్మలను కట్ చేయాలి తప్ప గొడ్డలిపెట్టి నరకొద్దు. మొక్కలు తీసేస్తే చర్యలు తప్పవని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మొత్తమ్మీద హరితహారం కార్యక్రమంతో సిద్దిపేటని హరితవనంగా మార్చడానికి అటు హరీశ్ రావు ఇటు అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారు.