అనిత‘ర’సాధ్యురాలు!
posted on Jun 17, 2024 7:13AM
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార పార్టీ నేతల తప్పులను ధైర్యంగా ప్రజల ముందుకు తీసుకెళ్లిన మహిళా నేత.. పార్టీ అధినేత ఆదేశాలు జవదాటని కార్యకర్త.. ఎలాంటి క్లిష్టపరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోగల ధీర వనిత.. ఆమే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత. పార్టీలో ఓ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన అనిత.. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర హోం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీలో కష్టపడి పని చేసిన ప్రతిఒక్కరికీ మంచి అవకాశాలు వస్తాయని అనిత ద్వారా అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించారు. గత ఐదేళ్ల కాలంలో వైసీపీ నేతల అరాచక పాలనలో వంగలపూడి అనిత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమె వ్యక్తిగత జీవితంపైనా విమర్శలు చేశారు. అయినా ఆమె కుంగిపోలేదు. అంతేకాదు.. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ డీజీపీ కార్యాలయంకు వెళితే.. ఆమెను పోలీసులు అడుగు కూడా పెట్టనివ్వలేదు. ఆ సమయంలోనే అనిత సవాల్ చేశారు. తనను రాకుండా అడ్డుకున్న కార్యాలయంలోకి.. మీరే ప్రొటోకాల్ తో తీసుకెళ్తారని.. అప్పుడే డీజీపీ కార్యాలయంలోకి అడుగు పెడతానని సవాల్ చేశారు. ఆమె చాలెంజ్ చేసినట్లుగానే అధికార పార్టీ నేతగా కాదు.. ఏకంగా హోం మినిస్టర్ గా ఆమె డీజీపీ కార్యాలయంలోకి అడుగుపెట్టి రాజకీయాల్లో సివంగి అని నిరూపించుకున్నారు.
టీచర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వంగలపూడి అనిత.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆదేశాలను తు.చ.
తప్పకుండా పాటిస్తూ అంచెలంచెలుగా పార్టీలో ఎదుగుతూ వచ్చారు. పార్టీలో కీలక వేదిక అయిన పొలిట్ బ్యూరోలోనూ ఆమెకు అవకాశం దక్కింది. పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగానూ అనిత పని చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేతల నుంచి ఆమె అనేక విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గత ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం అనితపై అనేక అక్రమ కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఆమెకు సంబంధం లేని విషయాల్లోనూ ఆమె పేరును చేర్చి దాదాపు ఇరవైకిపైగా కేసులు పెట్టింది. దీనికి తోడు సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిగత జీవితంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేసింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ పార్టీకి అండగా ఉంటూ అధికార వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వంగలపూడి అనిత అలుపెరగని పోరాటం చేశారు. ఆమె రాష్ట్ర ప్రజల పక్షాన జగన్ ప్రభుత్వంపై పోరాటం సాగించడంతోపాటు.. పార్టీ వాయిస్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. పార్టీ తరపున ప్రజల కోసం అనిత సాగించిన పోరాటాన్ని పలుసార్లు చంద్రబాబు ప్రశంసించారు. ప్రస్తుతం కూటమి అధికారంలోకి రావడంతో ఆమెను ఏకంగా హోంమినిస్టర్ ను చేశారు. తద్వారా దళిత వర్గాలకు, పార్టీ కోసం కష్టపడి పని చేసే వ్యక్తులకు ఏవిధంగా అండగా ఉంటామో చంద్రబాబు మరోసారి నిరూపించారు.
వంగలపూడి అనిత 1984లో విశాఖపట్నం జిల్లా లింగరాజుపాలెం గ్రామంలో జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.ఏ. ఎంఈడీ పూర్తి చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసిన వంగలపూడి అనిత 28 ఏళ్ల వయసులో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2012లో తెలుగుదేశం పార్టీతో ఆమె రాజకీయ జీవితాన్ని ప్రారంభమైంది. పార్టీ బలోపేతానికి పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగుతూ వచ్చారు. పార్టీ అధినేత ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ ప్రజల పక్షాన వంగలపూడి అనిత పోరాటం సాగించారు. 2014 ఎన్నికల్లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా అనిత విజయం సాధించారు. 2019లో తెలుగుదేశం నుండి కొవ్వూరు నియోజకవర్గంలో పోటీచేసి వైసీపీ అభ్యర్థి తానేటి వనిత చేతిలో ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో మరోసారి పాయకరావుపేట నియోజకవర్గం నుంచి పోటీచేసిన అనిత.. సమీప వైసీపీ అభ్యర్థిపై 43,727 ఓట్ల తేడాలో విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో.. సీఎం చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్ లో హోంమంత్రిగా అనితకు అవకాశం కల్పించారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై, అరాచక మూకలపై ఉక్కుపాదం మోపుతామని అనిత స్పష్టం చేశారు.
ప్రతిపక్షంలోఉన్నప్పుడు వంగలపూడి అనిత వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని తప్పుడు ప్రచారం చేసిన వైసీపీ నేతల గుండెల్లో ప్రస్తుతం రైళ్లు పరుగెడుతున్నాయి. మహిళల వ్యక్తిగత జీవితాలపై నీచంగా మాట్లాడిన, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని తాము అధికారంలోకి వచ్చిన తరువాత వదిలిపెట్టే ప్రసక్తే లేదని అనిత అనేకసార్లు హెచ్చరించారు. ప్రస్తుతం ఆమే హోమినిస్టర్ గా బాధ్యతలు చేపట్టడంతో గతంలో మహిళల పట్ల తప్పుగా ప్రవర్తించిన వైసీపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న చర్చ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.