పుంగనూరు పుడింగి... మోసాల గిడ్డంగి!
posted on Jun 17, 2024 6:31AM
ఏపీలో గత ఐదేళ్ల కాలంలో జగన్ మోహన్ రెడ్డి హయాంలో అరాచక పాలన సాగింది. అవినీతి, అక్రమాలతో ప్రజా సొమ్మును వైసీపీ గద్దలు అప్పనంగా దోచేశారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడంతోపాటు కొందరిని మట్టుబెట్టారు. జగన్, ఆయన బ్యాచ్ చేసిన అరాచకాలతో ప్రజలు నోరువిప్పేందుకుసైతం భయపడ్డారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపడంతో రాష్ట్ర ప్రజలు రాక్షస పాలన పోయిందంటూ ఊపిరిపీల్చుకున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే చంద్రబాబు ప్రజా పాలనకు శ్రీకారం చుట్టారు. దీనికితోడు గత ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఆరాతీయడం ఆరంభించారు. ఈ క్రమంలో వైసీపీ నేతల వేల కోట్ల అవినీతి అక్రమాలు గుట్టలు గుట్టలుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అధికారంలో ఉన్నాం.. ఏం చేసినా చెల్లిపోతుందని అనుకున్నారేమో.. లేని బ్యాంకులను ఉన్నట్లుగా చూపి వందల కోట్లు దోచుకున్నట్లు తెలుస్తోంది. వీరి అక్రమాలకు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, కొందరు అధికారుల అండదండలు ఉన్నాయన్న విషయం వెలుగు చూస్తోంది.
ప్రభుత్వానికి ఫేక్ బ్యాంకు గ్యారెంటీ పెట్టి వందల కోట్లను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అయన తనయుడు మిథున్ రెడ్డిలు దోచుకున్నారు. ఒక వ్యక్తి లేదా ఒక కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వం నుండి ఒక కాంట్రాక్టు తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా బ్యాంకు గ్యారంటీ అడుగుతుంది. ఒక వెయ్యి రూపాయలు ఒక వ్యక్తికి కాంట్రాక్టు ఇవ్వాలంటే, అందులో కనీసం 100 రూపాయలకు బ్యాంకు గ్యారంటీ చూపించాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో ఏపీ జెన్‌కోకు సంబంధించిన సీలేరు పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కాంట్రాక్టుకు సంబంధించి పెద్దిరెడ్డి కాంట్రాక్టు సంస్థ టెండర్ వేసింది. అయితే, ఈ టెండర్ డాక్యుమెంట్లలో వెస్టిండీస్ లోని సెయింట్ లుషియాలో ఉన్న బ్యాంకు గ్యారెంటీలు అందించారు. కాంట్రాక్టు విలువ రూ. 10వేల కోట్లు అయితే, 800 కోట్లు సదరు బ్యాంకు గ్యారెంటీ తెచ్చారు. వాటిని ఏపీ మైనింగ్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్, ఏపీ ఎస్పిడిసిఎల్, ఏపీ జెన్ కో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఆమోదించాయి. అంతాబాగానే ఉందికాదా అనుకుంటే పొరపాటే.. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంటుంది.. పెద్దిరెడ్డి కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వానికి చూపించిన బ్యాంకు వెస్టిండీస్ లోని సెయింట్ లుషియాలోనే లేదని తెలుస్తోంది. ఈ బ్యాంకు పేపర్ మీద తప్ప భూమ్మీద ఎక్కడుందో.. అసలు ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందూ వెనుకా చూడకుండా 10వేల కోట్ల ప్రాజెక్టులు ఎలా ఇచ్చింది? అంటే ఈ కుంభకోణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి మాత్రమే కాదు.. తీగ లాగితే బడా నేతల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడానికి వెస్టిండీస్ వరకువెళ్లి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాచ్ ప్లాన్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్క ఏపీలోనే 10వేల కోట్ల రూపాయలు స్కాములు చేస్తే.. ఇక దేశ వ్యాప్తంగా అది ఎన్ని వేల కోట్లు ఉంటుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో కొలువు దీరిన చంద్రబాబు ప్రభుత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలపై విచారణ జరిపితే జగన్ మోహన్ రెడ్డితోపాటు బడా కంపెనీల పేర్లుకూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే.. ఈ మొత్తం వ్యవహారంలో ఎస్ బిఐ అలాగే ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ళకి తెలిసి జరిగిందా? తెలియక జరిగిందా అన్న విషయం విచారణలో తేలుతుంది. దీనికితోడు మేఘా ఇంజినీరింగ్ సంస్థ కూడా సుమారు 400 కోట్ల మేరకు ఏపీ జెన్ కో సీలేరు హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్ కు వెస్టిండీస్ బ్యాంకు గ్యారంటీలనే సమర్పించినట్లు సమాచారం.
ఈ కుంభకోణంలో ముందుగా.. కాంట్రాక్టు సంస్థ చూపిన వెస్టిండీస్‌లోని యూరో ఎక్సిమ్ బ్యాంకు అసలు ఉందా లేదా? ఆర్బీఐ అనుమతి లేకుండా అడ్డగోలుగా బ్యాంకు గ్యారంటీలు ఎలా ఇచ్చింది అనే అంశంపై విచారణ జరగాల్సి ఉంది. అంతే కాదు.. 10వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు కట్టబెట్టే ముందు.. పూర్తిస్థాయి పరిశీలన లేకుండానే ప్రభుత్వం ఎలా కట్టబెట్టింది అనే విషయంపై సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో జగన్ మోహన్ రెడ్డికి కలిగిన లబ్ధి ఎంతో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన కుంభకోణంలో ఉన్న వ్యక్తులు ఎవరు? ఏఏ సంస్థలు, ఏ వ్యవస్థలు ఉన్నాయన్న విషయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెలికితీయాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారంలో సహకరించిన అధికారులను కూడా బయటకు లాగాల్సి ఉంది. కుంభకోణం నిజమేనని నిర్ధారణ అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అయన కుమారుడు మరెక్కడా కాంట్రాక్టులు చేయకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతోపాటు.. తండ్రీకొడుకులిద్దరికి జైలుశిక్ష పడేలా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.