కూతురిని కోల్పోయినా... 800 ఆడపిల్లలకు ఆసరా!

చాలామంది జీవితంలో కష్టాలు వస్తాయి. కలలా సాగిపోతున్న జీవితం కాస్తా తలకిందులైపోతుంది. అలా తారుమారైన జీవితాన్ని తల్చుకుని తల్చుకుని వారు కుమిలిపోతుంటారు. కానీ కొందరు మాత్రం తాము పడిన కష్టానికి ఉపశమనంగా, అలాంటి కష్టంలో ఉన్న తోటివారందరికీ ఓదార్పుగా..... ఓ భిన్నమైన మార్గాన్ని ఎన్నుకొంటారు. తన కష్టాన్ని సమాజానికి ఓ వరంగా అందిస్తారు. అలాంటి ఓ వ్యక్తే సరోజనీ అగర్వాల్‌!

 


లక్నోలో ఉండే సరోజనీది ఓ అందమైన కుటుంబం. చక్కగా చూసుకునే భర్త, రత్నాల్లాంటి పిల్లలు... అంతా బాగుంది. హిందీలో పీ.హెచ్‌.డీ చేసిన సరోజనీకి కథలన్నా, కవితలన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టంతో స్వయంగా ఎన్నో రచనలు చేశారు. ఓ రోజు సరోజనీ తన కూతురుతో కలిసి ప్రయాణిస్తుండగా... అనుకోని ఉపద్రవం ఎదురైంది. ఆమె నడుపుతున్న బండి ప్రమాదానికి లోనై, ఆమె కళ్ల ముందే కూతురు చనిపోయింది.

 

కళ్లముందే కూతురు చనిపోవడం, అది కూడా తను నడుపుతున్న బండి వల్లే చనిపోవడంతో సరోజనీ తేరుకోలేకపోయింది. కానీ అందరిలా ఆమె ఆవేదనతో మిగిలిపోలేదు. తన కూతురు జ్ఞాపకాలకు విలువనిచ్చేలా ఏదన్నా చేయాలనుకున్నారు. అలా 1985లో తన ఇంట్లోనే ఆడపిల్లల కోసం ఓ అనాథ శరణాలయాన్ని నెలకొల్పారు. ఆ శరణాలయానికి తన కూతురు పేరు మీదుగా ‘మనీషా మందిర్‌’ అని పేరు పెట్టారు. తన రచనల మీద వచ్చే రాయల్టీలతో దాన్ని నడపసాగారు.

 


మనీషా మందిర్‌ను మొదలుపెట్టడమే ఆలస్యం... ఎందరో పిల్లలకి అది ఆసరాగా మారింది. వికలాంగులుగా ఉన్నారనో, పెంచే ఆర్థిక స్తోమత లేదనో... వదిలేసే ఆడపిల్లలకు మనీషా మందిర్‌ నీడనిచ్చింది. రోడ్ల మీద తనకు అనాథలా కనిపించినవారినీ, వేశ్యాగృహాలలో పుట్టినవారినీ కూడా సరోజనీ అక్కున చేర్చుకునేవారు. మనీషా మందిర్లో అనాథలను చేర్చేందుకు ఆ ఇంటి ముంగిట ఒక ఊయల కట్టి ఉండేదంటే... ఆమె నిశ్చయం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

 

మనీషా మందిర్‌లో ఇప్పటివరకూ 800 మందికి పైగా ఆడపిల్లలకు ఆశ్రయం లభించింది. అలాగని వారిని కేవలం అనాథలుగా చూడలేదావిడ. వారందరిలోనూ దూరమైన తన కూతురిని చూసుకుని మురుసుకునేవారు. ఒక కూతురి కోసం ఎలాంటి సుదాపాయాలు కల్పించాలని తల్లి తాపత్రయపడుతుందో... తన ఆశ్రమంలో ఉన్నవారికి అలాంటి సౌకర్యాలన్నీ కల్పిస్తారు సరోజని. లైబ్రరీ, కంప్యూటర్‌ లాబ్‌, బాడ్మింటన్ కోర్ట్‌... లాంటివన్నీ మనీషా మందిర్‌లో కనిపిస్తాయి. ఇక అందులోని పిల్లలకు విద్య, వృత్తి నైపుణ్యాలని అందించడం సరేసరి!

 


మనీషా మందర్‌లో రోజుల వయసులో చేరిన పిల్లలు, తమ కాళ్ల మీద తాము నిలబడేవరకూ చేయూతగా నిలుస్తారు సరోజనీ. అలా మనీషా మందిర్‌లో ఎదిగిన ఎందరో పిల్లలు బ్యాంక్‌ మేనేజర్లుగా, టీచర్లుగా, ప్రభుత్వోద్యోగులుగా గౌరవప్రదమైన స్థానాలకు ఎదిగారు. మరికొందరు పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. ‘‘ఇంతమందికి సాయపడేందుకే భగవంతుడు నా కూతురిని తీసుకువెళ్లిపోయాడేమో! ఇన్ని వందల మందిలో నా కూతురిని పదిలంగా చూసుకునే అవకాశం కల్పించినందుకు ఆయనకి నేను రుణపడిపోయాను,’’ అంటారు సరోజనీ. మనీషా మందిర్‌ ముంగిట ఉన్న మనీష విగ్రహంలోని చిరునవ్వుని గమనిస్తే... ఆమె ఈ మాటలను వింటున్నట్లుగానే తోస్తుంది.

 

- నిర్జర.