అక్కడ ఒక్క రోజు... 45 సిగరెట్లు తాగడంతో సమానం...

 

సాధారణంగా సిగరెట్ తాగిన వాడి పక్కన కూర్చుంటే..ఆ తాగిన వాడి కంటే.. పక్కన కూర్చోని పొగ పీల్చుకునే వారికే ఎక్కువ ప్రమాదం అని చెబుతుంటారు. అది తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఎలాంటి సిగరెట్ తాగకపోయినా.. ఆ పొగ పీల్చకపోయినా చచ్చిపోయే రోజులు వచ్చాయి. అది ఎక్కడో కాదు. ఢిల్లీలో. అదేంటీ అనుకుంటున్నారా...? ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. దేశం మొత్తం మీద కాలుష్యం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అని అడిగితే ఢిల్లీ అని టక్కున చెప్పేయోచ్చు. అంత కాలుష్యం ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఈ కాలుష్యం తారాస్థాయికి చేరింది. మాములుగా వాయునాణ్యత సూచి (ఏక్యూఐ) లో  100 పాయింట్లు దాటితేనే డేంజర్ అని చెబుతుంటారు. అలాంటిది  కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ రీడింగ్‌ 999 పాయింట్లను తాకింది. ఉదాహరణగా చెప్పాలంటే.. ఢిల్లీలో ఒక్క రోజుండి వస్తే, ఒకమనిషి రోజుకు 45 సిగరెట్లు తాగిన దానితో సమానం అన్నమాట. దీంతో పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించుకోవచ్చు. కనీసం మరో రెండు రోజుల పాటు ఇదే విధమైన వాయు కాలుష్యం ఢిల్లీలో ఉంటుందని కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఇంత కాలుష్యమున్న గాలిని పీల్చడం ప్రాణాలను హరిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు.


ఇదిలా ఉండగా.. కాలుష్య నియంత్రణకు అధికారయంత్రాంగం సరిగ్గా పనిచేయడం లేదని మానవ హక్కుల కమిషన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎవరి చావు వారు చావాలన్న చందంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ, కేంద్రప్రభుత్వం సహా ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు నోటీసులు పంపింది.  తాత్కాలిక ఉపశమన మార్గాలు కాకుండా, శాశ్వత పరిష్కారం ఆలోచించాలని సూచించింది. మరి ఒకప్పుడు లండన్.. ఇప్పుడు ఢిల్లీ.. మరి మనం కూడా ఆ పరిస్థితికి రాకుండా ఉండాలంటే.. ప్రభుత్వాలు మేలుకొని ఇప్పటినుండే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం.