పిల్లల్ని ఏడిపించే పోటీలు..

ఇంట్లో పసిపిల్లలు ఉన్నారంటే ఆ సందడే వేరు. వాళ్ల ఆటపాటలతో రోజులు ఎలా గడిచిపోతాయో తెలియదు. అంతవరకు బాగానే ఉంది. కానీ అదే పిల్లలు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నారనుకోండి... అప్పుడుంటుంది అసలు టెన్షన్‌. పిల్లవాడు ఏడుపు ఆపేవరకు తల్లిదండ్రులకు ఏమీ తోచదు. కానీ జపాన్‌లోని టోక్యోలో సంగతే వేరు. అక్కడ ఏడ్చే పిల్లవాడే విజేతగా నిలుస్తాడు. అదేంటో మీరే చూడండి.

జపాన్‌ రాజధాని టోక్యోలో సెన్‌సోజి అనే బౌద్ధ ఆలయం ఉంది. ఈ ఆలయానికి 1400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ గుడి ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. ఇక వేసవి కాలం మొదలయిందంటే ఆ సందడి ఇంకా పెరిగిపోతుంది. ఇక్కడ జరిగే ఓ పిల్లల పోటీనే ఇందుకు కారణం. ఆ పోటీ పేరు ‘నాకిజుమో’... అంటే ఏడ్చే పిల్లల పోటీ అని అర్థం.

‘ఏడ్చే పిల్లలు బాగా బలంగా ఉంటారు’ అని జపాన్లో ఓ సామెత ఉంది. అంతేకాదు! పిల్లలు ఏడిస్తే... ఆ శబ్దానికి చుట్టుపక్కల ఉన్న దుష్టశక్తులన్నీ పారిపోతాయని కూడా వాళ్లు నమ్ముతారు. అందుకనే ఏటా ఈ పోటీ పెడతారు. నాలుగు నెలల నుంచి రెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఈ పోటీలో ప్రవేశం ఉంటుంది. ఈ పోటీలో పాల్గొనే పిల్లలని ఇద్దరు సుమోలు ఎదురెదురుగా పట్టుకుని నిలబడతారు. ఆ ఇద్దరు పిల్లలలో ఎవరు ముందు ఏడుస్తారో వాళ్లనే విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ పిల్లలిద్దరూ ఒకే సమయంలో ఏడిస్తే, వాళ్లలో ఎవరు గట్టిగా ఏడుస్తున్నారో చూస్తారు.

పోటీలో పిల్లలు బాగా ఏడ్చేందుకు రిఫరీలే వాళ్లని భయపెడుతారు. అప్పటికీ పిల్లవాడు ఏడవకపోతే భయపెట్టే మాస్కులు వేసుకుని పిల్లలు జడుసుకునేలా చేస్తారు. ఆ పోటీ చూసేందుకు వచ్చిన జనం కూడా పిల్లల్ని ఏడవమని అరుస్తూ రెచ్చగొడతారు. ఇంత జరిగిన తర్వాత పిల్లలు ఎడవకుండా ఎలా ఉంటారు చెప్పండి!

ఈ ఏడుపు పోటీలు ఇప్పటివి కాదు. దాదాపు నాలుగు వందల ఏళ్ల నుంచీ వీటని నిర్వహిస్తున్నారట. ఏటా దాదాపు రెండు వందల మంది పిల్లల్ని ఈ పోటీలో పాల్గొనేందుకు తీసుకువస్తూ ఉంటారు. వాళ్లకి సుమో బట్టలు వేసి, నిర్వాహకుల చేతిలో పెడుతుంటారు. నిజానికి పిల్లలు అప్పుడప్పుడూ ఏడవటం మంచిదే కావచ్చు. దాని వల్ల వాళ్ల ఊపిరితిత్తులు బలపడతాయి. వాళ్ల ఆకలి, అనారోగ్యాల గురించి పెద్దవాళ్లకి తెలుస్తాయి. కానీ అదేపనిగా గుక్కపట్టి ఏడవటం వల్ల, వాళ్ల మెదడు దెబ్బతింటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. జపాన్‌వాసులు మాత్రం ఈ మాటని వినేలా లేరు.

- నిర్జర.