బొత్సాకు లగడపాటి కౌంటర్‌

 

తెలంగాణ అంశం కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు రగిలిస్తూనే ఉంది.. జగన్‌ను దగ్గర చేసుకునేందుకే కాంగ్రెస్‌ పార్టీ సొంత పార్టీ నాయకులను పక్కన పెడుతుందని విమర్శలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఇలాంటి విమర్శలే చేసిన జేసి దివాకర్‌ రెడ్డి పై పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారయణ తీవ్రంగా స్పందించారు. ఇష్టం అయితే పార్టీలో ఉండండి లేదంటే వెళ్లిపొండి అని ఘాటుగా బదులులిచ్చారు.

 

అయితే బొత్సా వ్యాఖ్యలపై తమ పార్టీ నాయకుల నుంచే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ బోత్సా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పార్టీని దిక్కరించిన వారిని వెళ్లిపొమనడం సరికాదన్నారు. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కళంకితుల ఆర్డినెన్స్‌ను చించేయడం కూడా పార్టీ ధిక్కారమేనని ఆయన అన్నారు. తాము సమైక్యవాది ఇందిరా గాంధీ బాటలోనే నడుస్తున్నామని చెప్పారు.

 

అంతేకాదు జెసి కుటుంబం ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీలో ఉందన్న  ఆయన, అటువంటివారిని వెళ్లిపొమ్మనడం సరి కాదని ఆయన అన్నారు. విభజనపై పార్టీల అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం తీసుకోవాలని ఆయన అన్నారు. ఏర్పాటు చేయాల్సింది అఖిల పక్ష సమావేశం కాదని, అసెంబ్లీని సమావేశపరచాలి లేదా ఎన్నికలకు వెళ్లాలని ఆయన అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu