బాబ్లీ పై తీర్పు: రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యం

 

ఈ రోజు సుప్రీంకోర్టు వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పును వెలువరించింది. మహారాష్ట్ర నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టును పూర్తిగా తొలగించడం అసాద్యం అని చెపుతూనే ఇరు రాష్ట్రాల సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించిన సుప్రీంకోర్టు, గొడవలు పడకుండా నిజాయితీగా ఇద్దరూ నీళ్ళు పంచుకోమని సలహా ఇచ్చింది. అంత భారీ కట్టడం పూర్తయిన తరువాత సుప్రీంకోర్టయినా అంతకంటే గొప్ప ఉపాయం చెప్పలేదు కూడా. అయితే, పక్క రాష్ట్రాలు అంత భారీ ప్రాజెక్ట్ ను రాత్రికిరాత్రే ఏమి నిర్మించలేదు అని అందరికీ తెలుసు. అందరి కళ్ళ ముందే పకడ్బందీ ప్రణాలికతో అత్యంత వేగంగాఆ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. అయినప్పటికీ, రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలకు ఇటువంటి దుశ్చర్యలకు కళ్ళెం వేయాలనే ఆలోచన రాకపోవడం తెలుగు ప్రజల దురదృష్టం.

 

ఇప్పటికే, కర్ణాటక రాష్ట్రం ఆల్మటి డ్యామ్ ఎత్తుపెంచి మనకి న్యాయంగా దక్కవలసిన నీళ్ళను కాజేయగా, ఇప్పుడు మహారాష్ట్ర బాబ్లీ డ్యామ్ నిర్మించి మన నోట్లో మన్ను కొట్టబోతోంది. ఇందుకు, మహారాష్ట్రను తప్పు పట్టడం శుద్ధ అవివేకం. ఆ రాష్ట్రం తన రైతుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి అంతకు తెగించింది. కానీ, మన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుపక్షపాతినంటూ టముకు వేసుకోవడం మినహా రైతులకు చేసిందేమీ లేదు. రైతులకు నీళ్ళు తెచ్చి ఈయకపోతే పోయే, కనీసం పైనుండి వచ్చే నీటి ధారలను సక్రమంగా రాష్ట్రంలోకి వచ్చేందుకు కూడా ప్రభుత్వం చొరవచూపలేకపోయింది.

 

ఆల్మటి, బాబ్లి డ్యామ్ ల సంగతి పక్కన పెడితే, మన రాష్ట్రం నుండి యదేచ్చగా గ్యాసును కూడా గుజరాత్ రాష్ట్రానికి తరలించుకు పోయేందుకు అనుమతించిన మన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు గ్యాస్ కొరత ఏర్పడిన తరువాత, కేంద్రం కాళ్ళు, గుజరాత్ కాళ్ళు పట్టుకొని ప్రాదేయపడే దుస్థితి చేజేతులా తెచ్చింది. ఇక, నిన్నటి రైల్వే బడ్జెట్ లోను మన రైల్వే మంత్రిగారి, మన యం.పీ.ల నిర్వాకం చూసాము. రెండు మూడు కొత్త రైళ్ళు, ఒక పేరుగొప్ప బాటిలింగు ప్లాంటు, వేగన్ వర్క్ షాప్ తప్ప కొత్తగా సాదించింది ఏమి లేదు. ఇదివరకు మంజూరు చేసిన ప్రాజెక్టులే ఇంతవరకు పూర్తికాలేదు. మరిప్పుడు కొత్తగా మంజూరయినవి పూర్తయి, అవి ప్రజలకు ఉపయోగపడేనాటికి మరెన్ని దశాబ్దాలు పడతాయో ఎవరికీ తెలియదు.

 

అదే విధంగా, తెలంగాణా సమస్యవల్ల రాష్ట్రం తిరోగమన దిశలో వేగంగా సాగిపోతున్నపటికీ, కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజకీయలబ్ది కోసమే ఏళ్లతరబడి నాన్చుతూ రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చుచేసి, జస్టిస్ శ్రీకృష్ణ కమిటి వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ నివేదిక చెత్తబుట్టలోకి విసిరేసి మళ్ళీ చర్చలు అంటూ కొండని తవ్వి ఎలుకను పట్టే ప్రయత్నం చేస్తోందిప్పుడు.

 

ఇక, మొన్న జరిగిన బాంబు ప్రేలుళ్ళలోను అదే నిర్లక్ష్యం. కేంద్రం నుండి గట్టి హెచ్చరికలు వచ్చినప్పటికీ, ప్రభుత్వంలో ఏదో తెలియని నిరాసక్తత, నిర్లిప్తత అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంది. ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరితో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. నిన్న దిల్ షుక్ నగర్ సంఘటన అయితే, ఈ రోజు బాబ్లీ, రేపు మరోటి.

 

ప్రభుత్వం చేస్తున్న తప్పులను, నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టి దారిన పెట్టవలసిన ప్రతిపక్షాలు అధికారంలోకి రావడం కోసం పాదయాత్రలు చేసుకొంటూ తమ బాధ్యతలను విస్మరిస్తున్నాయి గనుకనే ప్రభుత్వం కూడా ఇంత బాధ్యతా రాహిత్యంగా, ఇంత నిర్లక్ష్యంగా ఉండగలుగుతోందని చెప్పవచ్చును.