నా సినీ కెరీర్ లో ఇదే తొలిసారి: నాగార్జున
posted on Nov 22, 2012 11:45AM

తన 26 సంవత్సరాల సినీ కెరీర్ లో డమరుకం సినిమా విడుదల వాయిదాపడటం ఒక చేదు అనుభవమని నాగార్జున అన్నారు. నవంబర్ 23 వ తేదీన సినిమా విడుదలౌతుందని, ఇది అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ సినిమా విడుదల వాయిదా పడటంపై ఆర్ ఆర్ మూవీ మేకర్స్ ను నాగార్జున నిందించలేదు. వారితో మరో సినిమా చేయడానికి తాను రెడీ అని ప్రకటించాడు. డమరుకం విడుదల పై దాసరి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారని చెప్పారు. ఈ సినిమా తనకు సహనాన్ని, ఓర్పును నేర్పిందని అన్నారు. మనుషుల మీద నమ్మకం పెరిగిందని, సినిమా ఇండస్ట్రీ మీద విశ్వాసం పెరిగిందని అన్నారు.
డమరుకం జాప్యంపై తనకు ఎవరిమీదా ఎలాంటి కోపం లేదని వెల్లడించారు. డమరుకం విడుదల జాప్యంపై ప్రొడ్యూసర్ వెంకట్ గారు తనకు ఫోన్ చేసి సర్.. మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నానని అన్నారనీ, సినిమా తీయడమంటే సామాన్యం కాదనీ, అవన్నీ భరించి చిత్రాన్ని నిర్మించిన ఆర్ఆర్ వెంకట్ గారికి థ్యాంక్స్ అన్నారు. శ్రీనివాస రెడ్డి సినిమాను గొప్పగా తీశారన్నారు. డమరుకం కొత్త రకం సినిమా అని, తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు.