బీట్రూట్ ఇలా వాడితే.. నేచురల్ గా మెరిసిపోతారు..! బీట్ రూట్ సాధారణంగా సలాడ్‌లలో, కూరలలో, జ్యూస్ లలో ముఖ్యమైన భాగం. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కణాలను మరమ్మతు చేస్తాయి. సూర్యరశ్మి, కాలుష్యం వల్ల కలిగే నష్టాన్ని కూడా తిప్పికొడతాయి. బీట్‌రూట్ పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది, మొటిమల మచ్చలను కూడా తేలికపరుస్తుంది. బీట్‌రూట్‌ను ఫేస్ ప్యాక్ లేదా ఫేస్ మాస్క్‌గా ఉపయోగించడం వల్ల ముఖానికి అప్పటికప్పుడే గులాబీ రంగు మెరుపు వస్తుంది. ముఖం తాజాగా కనిపిస్తుంది. అంతేకాకుండా దీన్ని రోజూ తినడం వల్ల చర్మం తాజాగా కనిపిస్తుంది. చర్మం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. బీట్‌రూట్ పెదవులపై హైపర్‌పిగ్మెంటేషన్‌ను తొలగించి వాటిని సహజంగా గులాబీ రంగులోకి మారుస్తుంది. ఇంత అద్బుతం చేసే ఈ బీట్రూట్ ను ఎలా ఉపయోగించాలంటే.. బీట్రూట్ ఎలా ఉపయోగించాలి.. చర్మ సంరక్షణ కోసం బీట్‌రూట్‌ను ఉపయోగించడానికి ఉత్తమ మార్గం దాని పొడిని తయారు చేసి నిల్వ చేయడం. పొడి చేయడానికి బీట్‌రూట్ తొక్క తీసి శుభ్రం చేయాలి. దానిని సన్నని గుండ్రని ముక్కలుగా కట్ చేసి ఎండలో ఆరబెట్టాలి. అది పూర్తిగా ఆరిపోయి గట్టిగా, సౌండ్ వచ్చేలా మారుతుంది. అప్పుడు పొడిని తయారు చేసుకోవాలి. ఇందుకోసం మిక్సర్ గ్రైండర్ ఉపయోగించవచ్చు. దీన్ని రిఫ్రిజిరేటర్‌లో ఒక నెల వరకు నిల్వ చేయవచ్చు. ఫేస్ ప్యాక్, ఫేస్ స్క్రబ్, లిప్ స్క్రబ్, ఫేస్ మాస్క్ వంటి ఎందులో అయినా ఈ పొడిని చేర్చుకోవచ్చు. ఇలా కూడా వాడచ్చు.. 2 టేబుల్ స్పూన్ల బీట్‌రూట్ రసం, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, ½ టేబుల్ స్పూన్ పెరుగు కలిపి ఫేస్ ప్యాక్ సిద్ధం చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. వృత్తాకారంగా మసాజ్ చేస్తూ దానిని తొలగించాలి. ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి అప్లై చేయాలి. ముఖం మీద మెరుపు కనిపించడం ప్రారంభమవుతుంది. మరో మార్గం.. 2 టేబుల్ స్పూన్ల బీట్‌రూట్ రసంలో 2 టేబుల్ స్పూన్ల తేనె కలపాలి . ఈ మిశ్రమంలో ఒక కాటన్ బాల్ ముంచి ముఖం, మెడపై అప్లై చేయాలి. 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. గోరువెచ్చని టవల్ తో తుడవాలి. బీట్‌రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మం కొల్లాజెన్ స్థాయిని పెంచుతాయి, ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇంకొక మార్గం.. 1 టేబుల్ స్పూన్ బీట్‌రూట్ పొడి, 1 టేబుల్ స్పూన్ నారింజ తొక్కల పొడిని రెండు టేబుల్ స్పూన్ల నీటితో కలిపి పేస్ట్ తయారు చేయాలి. డ్రై స్కిన్ ఉన్నవారు పాలు కలుపుకోవచ్చు. ఐరన్, విటమిన్ సి అధికంగా ఉండే బీట్‌రూట్ హైపర్‌పిగ్మెంటేషన్‌ను తొలగిస్తుంది. విటమిన్ సి అధికంగా ఉండే నారింజ తొక్క, నల్లటి మచ్చలను తగ్గించి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది, చర్మానికి తక్షణ మెరుపును ఇస్తుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఇంట్లోనే మేకప్ రిమూవర్.. ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు..! మేకప్ ఇప్పటి అమ్మాయిలకు చాలా కామన్ విషయం. పార్టీలు, ఫంక్షన్లలలో అందంగా కనిపించడం కోసం అమ్మాయిలు మేకప్ వేసుకుని అతిలోక సుందరులలాగా కనిపించాలని అనుకుంటారు. ఒకప్పుడు బ్యూటీ పార్లర్ కు వెళితే తప్ప మేకప్ వేసుకునే వెలుసుబాటు ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. మేకప్ సామాగ్రి ఉంటే ఇంట్లోనే ఈజీగా మేకప్ వేసుకోవడం జరిగిపోతోంది. అమ్మాయిలు కూడా దీనికి తగిన మెళకువలు నేర్చేసుకుంటున్నారు. అయితే ఎంత మేకప్ వేసుకున్నా ఆ పార్టీ, ఫంక్షన్ లాంటివి అయిపోగానే మేకప్ రిమూవ్ చేయడం పరిపాటి. లేకపోతే చర్మం పాడైపోతుంది. చాలామంది బయట మార్కెట్లో మేకప్ రిమూవర్ లు కొనుగోలు చేసి వాడుతుంటారు. కానీ దానికి అంత డబ్బు పోసే బదులు ఇంట్లోనే ఈజీగా మేకప్ రిమూవర్ తయారు చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మేకప్ రిమూవర్ ఎలా తయారు చేసుకోవాలో ఈ కింద చూసి తెలుసుకోండి మరి.. మేకప్ రిమూవర్ ఇంట్లోనే తయారు చేసుకునే వివిధ పద్దతులు.. కొబ్బరి నూనె.. అలొవెరా జెల్.. మేకప్ రిమూవర్ లేకపోతే దాని బదులు కొబ్బరినూనె, అలొవెరా జెల్ వాడవచ్చు. దీని కోసం ఒక స్పూన్ అలొవెరా జెల్, ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవాలి. ఈ రెండింటిని ఒక చిన్న కంటైనర్ లో వేసి బాగా మిక్స్ చేయాలి. కాటన్ తో ఈ మిశ్రమం తీసుకుని దీంతో మేకప్ రిమూవ్ చేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. మంచి ఫలితం ఉంటుంది. పాలు.. రోజ్ వాటర్.. మిల్క్‌లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది మేకప్ తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది, తేమను అందిస్తుంది. రోజ్ వాటర్ తాజాదనాన్ని ఇస్తుంది. ఈ రెండింటిని కలిపి మిశ్రమాన్ని సిద్ధం చేసి మేకప్ రిమూవ్ చేయవచ్చు. దీని కోసం 2 టీస్పూన్ల పచ్చి పాలలో 1 టీస్పూన్ రోజ్ వాటర్ కలపాలి. దీన్ని కాటన్ సహాయంతో ముఖానికి అప్లై చేసి మేకప్ తొలగించాలి. తరువాత ముఖం కడుక్కుని మాయిశ్చరైజర్ రాయాలి. ఆలివ్ ఆయిల్, తేనె.. ఆలివ్ ఆయిల్ మేకప్‌ను సులభంగా కరిగించగలదు, తేనె చర్మానికి పోషణనిస్తుంది. 1 టీస్పూన్ తేనెను 1 టీస్పూన్ ఆలివ్ నూనెతో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి చేతులతో తేలికగా మసాజ్ చేయాలి. తడి కాటన్ ప్యాడ్ తో ముఖాన్ని తుడిచి, ముఖం కడుక్కోవాలి. దోసకాయ, కలబంద.. దోసకాయలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి, కలబంద జెల్ మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. సగం దోసకాయను బ్లెండ్ చేసి దానికి 1 టీస్పూన్ కలబంద జెల్ జోడించాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి మెల్లగా తుడవాలి. తరువాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలి. బాదం నూనె, కలబంద.. బాదం నూనెలో విటమిన్ E ఉంటుంది, ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. కలబంద జెల్ చర్మాన్ని చల్లబరుస్తుంది. 1 టీస్పూన్ అలోవెరా జెల్‌ను 1 టీస్పూన్ బాదం నూనెతో కలపాలి. ఈ మిశ్రమాన్ని కాటన్ ప్యాడ్ తో ముఖంపై అప్లై చేయడం ద్వారా మేకప్ తొలగించవచ్చు. *రూపశ్రీ.
ఫేషియల్ చేయించుకోవాలి అనుకునేవారు ఈ నిజాలు తెలుసుకోవాలి..! అమ్మాయిల చర్మ సంరక్షణలో ఫేషియల్ చాలా ముఖ్యమైనది. ఇప్పట్లో చాలామంది బ్యూటీ పార్లర్ కు వెళ్లి వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి అయినా ఫేషియల్ చేయించుకుంటారు. మరీ ముఖ్యంగా పండుగలు, శుభకార్యాలు, ఈవెంట్ల సమయంలో ముఖం మెరవాలంటే ఫేషియల్ కు ఓటు వెయ్యాల్సిందే అనుకుంటారు. అయితే చాలామందికి తెలియని నిజం ఏంటంటే.. ఫేషియల్ చేయించుకోవడానికి ముందు, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఫేషియల్ వల్ల పూర్తీ ప్రయోజనాలు పొందవచ్చు. పైగా చర్మానికి ఎలాంటి హాని కలగకుండా కాపాడుకోవచ్చు. ఇంతకీ అవేంటో తెలుసుకుంటే.. ఎండలో తిరగకూడదు.. ఫేషియల్ చేయించుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుందనే విషయం తెలిసిందే. అయితే ఈ ఫేషియల్ వల్ల చర్మాన్ని చాలా రుద్దుతారు. ఈ కారణంగా చర్మం కాస్త సెన్సిటివ్ గా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఎక్కువ ఎండలోకి వెళితే చర్మం దెబ్బతింటుంది. చాలా తొందరగా ట్యాన్ వస్తుంది. ఒకవేళ తప్పనిసరిగా ఎండలో వెళ్లాల్సి వస్తే తప్పకుండా ముఖానికి సన్ స్క్రీన్ ఉపయోగించాలి. ముఖాన్ని తాకడం.. ఫేషియల్ చేసినప్పుడు చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అలాంటప్పుడు ముఖ చర్మాన్ని పదే పదే తాకడం వల్ల చేతులకు ఉన్న మురికి కారణంగా ఇన్ఫెక్షన్లు, మొటిమలు వస్తాయి. అందుకే ఫేషియల్ చేయించుకున్న తర్వాత ముఖ చర్మాన్ని పదే పదే తాకకూడదు. మేకప్ వద్దు.. ఫేషియల్ చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయనే విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితిలో ముఖానికి మేకప్ వేయడం అస్సలు మంచిది కాదు. ఫేషియల్ వేయించుకున్న తర్వాత సుమారు 24 నుండి 72 గంటల పాటు మేకప్ వేసుకోకూడదు.అంటే ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఒకటి నుండి 3 రోజులు మేకప్ వేసుకోకుండా ఉండటం మంచిది. ఒకవేళ మేకప్ వేసుకుంటే మేకప్ లోని రసాయనాలు చర్మ రంధ్రాలలోకి వెళ్లి ముఖ చర్మాన్ని దెబ్బతీస్తాయి. ఫేష్ వాష్ వద్దు.. ఫేషియల్ చేయించుకున్న తర్వాత సుమారు 4 నుండి 6 గంటల పాటు ఫేస్ వాష్ చేయించుకోక పోవడం మంచిది. ముఖం కడుక్కోవడానికి పేస్ వాష్ లేదా సబ్బు వంటివి వాడకూడదు. ముఖాన్ని శుభ్రం చేసుకోవాలంటే కేవలం సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖ చర్మాన్ని కూడా చాలా రూడ్ గా రుద్దకూడదు. వేడి నీరు.. ఫేషియల్ చేయించుకున్న తర్వాత ముఖానికి వేడినీరు ఆవిరి పట్టడం లేదా వేడి నీటితో ముఖం కడగటం వంటివి మానుకోవాలి. ఫేషియల్ వల్ల సున్నితమైన చర్మం వేడినీరు లేదా వేడి ఆవిరి కారణంగా మరింత సున్నితంగా మారి దెబ్బతినే అవకాశం ఉంటుంది. రసాయన ఉత్పత్తులు.. ఫేషియల్ చేయించుకున్న తర్వాత కొన్నిరోజుల పాటు ఎక్స్ఫోలియేటర్లు, టోనర్లు, కెమికల్ పీల్స్ ఉన్న స్కిన్ ప్రోడక్ట్స్ వాడకుండా ఉండటం మంచిది. ఫేషియల్ కు ముందు ఇవి మరవద్దు.. థ్రెడింగ్, వ్యాక్సింగ్, బ్లీచింగ్ వంటివి అవసరం అయితే ఫేషియల్ చేయించుకోవడానికి ముందే వీటిని చేయించుకోవాలి. ఫేషియల్ తర్వాత చర్మం సున్నితంగా మారుతుంది కాబట్టి, పైన చెప్పుకున్న ప్రాసెస్ లు ఫేషియల్ తర్వాత చేస్తే చర్మానికి చాలా నష్టం చేస్తాయి. *రూపశ్రీ.
టీట్రీ ఆయిల్ వాడితే చర్మం మెరుస్తుందా... టీట్రీ ఆయిల్ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. దీన్ని చాలా రకాల బ్యూటీ ఉత్పత్తులలో వాడుతుంటారు. సాధారణంగా చర్మ రక్షణలో ఎసెంటియల్ ఆయిల్స్ వాడకం ఉంటుంది. ఈ ఆయిల్స్ ను క్యారియర్ ఆయిల్స్ లో కొన్ని చుక్కలు మిక్స్ చేసి ముఖానికి రాస్తుంటారు. ఇవి మంచి సువాసనతో ఉండటమే కాకుండా చర్మాన్ని చాలా బాగా రిపేర్ చేస్తుంది. ముఖ్యంగా మొటిమలు, స్కిన్ రాషెస్, చర్మ సంబంధ సమస్యలకు టీట్రీ ఆయిల్ బాగా పని చేస్తుందని చెబుతారు. అయితే టీట్రీ ఆయిల్ వాడటం వల్ల చర్మం మెరుస్తుందని కూడా అంటుంటారు. ఇందులో నిజాలెంతో తెలుసుకుంటే.. టీట్రీ ఆయిల్.. టీట్రీ ఆయిల్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. ప్రయోజనాలు.. టీట్రీ ఆయిల్ లోని యాంటీ ఇన్ప్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షమాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. మొటిమల మీద టీట్రీ ఆయిల్ ను కొద్దిగా రాస్తుంటే మొటిమలు మెల్లిగా మాయం అవుతాయి. నెమ్మదిగా నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. వాపు.. టీట్రీ ఆయిల్ లో ఉండే టెప్పినెన్-4-ఓల్, ఆల్ఫా-టెర్పినోల్ వంటివి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు. ఈ సమ్మేళనాలు ముఖం పై మంటను తగ్గించడంలో సహాయపడతాయి. సొరియాసిస్.. టీట్రీ ఆయిల్ లో టెర్సినెన్-4-ఓల్ సమ్మేళనం ఉంటుంది. ఇది మంట, చికాకు, సోరియాసిస్ నుండి ఉపశమనం ఇవ్వడంలో సహాయపడుతుంది. దీనిని మూలికా పేస్ట్ లు, మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. యాంటీ ఫంగల్, క్రిమినాశక లక్షణాలు.. టీట్రీ ఆయిల్ యాంటీ ఫంగల్, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఫంగల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. జిడ్డు చర్మానికి.. టీట్రీ ఆయిల్ జిడ్డు చర్మం ఉన్నవాళ్లకు గొప్ప వరం అని చెప్పవచ్చు. ఇది చర్మం పై అదనపు నూనెను తగ్గిస్తుంది. తద్వారా జిడ్డు చర్మాన్ని బాలెన్స్ గా ఉంచడంలో సహాయపడుతుంది. అందువల్ల దీనిని ఫేస్ వాష్ లు, ఆయిల్ స్కిన్ కోసం తయారు చేసే ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు. చర్మ వ్యాధులకు.. టీట్రీ ఆయిల్ లో యాంటీ ఎగ్జిమా లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంపై దద్దుర్లు, పొలుసులు, మంట వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. చర్మవ్యాధులు ఉన్న వారు వైద్యుల సలహాతో టీట్రీ ఆయిల్ ఉపయోగించవచ్చు. *రూపశ్రీ.
అసలు బ్లాక్ హెడ్స్ అంటే ఏంటి...వీటిని ఎలా వదిలించుకోవచ్చంటే..! బ్లాక్ హెడ్స్.. చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పడే సమస్య ఇది. అసలు బ్లాక్ హెడ్స్ గురించి ఏమీ తెలియకపోయినా, అవి ఎలా ఏర్పడతాయో తెలియకపోయినా చాలా మంది ముఖం మీద కనిపించే నల్ల మచ్చలు చూడగానే బ్లాక్ హెడ్స్ అని ఫిక్సైపోతారు. అయితే బ్లాక్ హెడ్స్ అంటే ఏంటి? అవి ఎలా వస్తాయి? వీటిని తొలగించుకోవడానికి ఏం చేయాలి? తెలుసుకుంటే.. బ్లాక్ హెడ్స్ అంటే.. బ్లాక్ హెడ్స్ అంటే ముఖం మీద.. ముఖ్యంగా ముక్కు, గడ్డం మీద కనిపించే చిన్న, నల్లటి గడ్డలు. చర్మ రంధ్రాలు సెబమ్ (నూనె), చనిపోయిన చర్మ కణాలు, ధూళితో మూసుకుపోతుంటాయి. ఇలా మూసుకుపోయిన ప్రాంతం గాలికి గురైనప్పుడు, అవి ఆక్సీకరణ కారణంగా నల్లగా మారుతాయి. వీటినే బ్లాక్ హెడ్స్ అంటారు. బ్లాక్ హెడ్స్ అనేవి మొటిమలకు తేలికపాటి రూపం అని చెప్పవచ్చు. ఇవి నొప్పిని కలిగించవు. కానీ చర్మం ఆకృతిని, రూపాన్ని ప్రభావితం చేస్తాయి. బ్లాక్ హెడ్స్ సాధారణంగా టీనేజర్లను ప్రభావితం చేస్తాయి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. అవి ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంటుంది. బ్లాక్ హెడ్స్ కు అసలు కారణాలు.. చర్మంలోని సేబాషియస్ గ్రంథులు అదనపు సెబమ్‌ను ఉత్పత్తి చేసినప్పుడు అది చర్మ రంధ్రాలలో పేరుకుపోయి బ్లాక్‌హెడ్స్‌కు కారణమవుతుంది. యుక్తవయస్సులో ఉన్నవారికి, ఋతుస్రావం అవుతున్న సమయంలో, గర్భధారణ లేదా ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయంలో హార్మోన్ల మార్పులు సెబమ్ ఉత్పత్తిని పెంచి బ్లాక్ హెడ్స్ కు దారితీస్తాయి. కొన్ని బ్యాక్టీరియా చర్మ రంధ్రాలకు సోకి, వాపు, అడ్డంకికి కారణమవుతుంది, ఇది బ్లాక్ హెడ్స్ కు దారితీస్తుంది. చాలా బరువుగా ఉండే లేదా చర్మ రంధ్రాలు మూసుకుపోయేలా చేసే చర్మ ఉత్పత్తులు వాడితే బ్లాక్‌హెడ్స్ సమస్యను మరింత తీవ్రతరం అవుతుంది. ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం లేదా ముఖాన్ని పదే పదే తాకడం వల్ల చర్మ రంధ్రాలలోకి మురికి, బ్యాక్టీరియా చేరి, బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. బ్లాక్ హెడ్స్ ను తొలగించే ఇంటి చిట్కాలు.. కొన్ని ఇంటి చిట్కాలు బ్లాక్ హెడ్స్ ను నివారించడంలో, తగ్గించడంలో సహాయపడతాయి. వాటిని క్రమం తప్పకుండా, జాగ్రత్తగా ఉపయోగిస్తే బ్లాక్ హెడ్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ముఖాన్ని 5–10 నిమిషాలు ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. దీని వల్ల బ్లాక్ హెడ్స్ తొలగించడం సులభం అవుతుంది. బేకింగ్ సోడా స్క్రబ్ ఒక సహజమైన ఎక్స్‌ఫోలియేటర్. కానీ ఇది సున్నితమైన చర్మాన్ని చికాకుపెడుతుంది. కాబట్టి ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకుని తర్వాత వాడాలి. టీ ట్రీ ఆయిల్ బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించగలదు లేదా ఆపగలదు. కొద్ది మొత్తంలో కాటన్ బాల్ కు అప్లై చేసి బ్లాక్ హెడ్స్ మీద రుద్దాలి. చక్కెర లేదా ఉప్పు స్క్రబ్‌లు చర్మం ఉపరితలం నుండి చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తాయి. ప్రభావిత ప్రాంతానికి అప్లై చేసి 30 సెకన్ల పాటు మసాజ్ చేయాలి. తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. *రూపశ్రీ.
ముఖం మీద ముడతలు వదిలించే సూపర్ టిప్స్ ఇవి..! ముఖం మీద ముడతలు లేకుండా.. అందంగా, ఆకర్షణీయంగా, యవ్వనంగా ఉండాలన్నది ప్రతి అమ్మాయి కల. ఇంకా చెప్పాలంటే.. పెళ్లై, పిల్లలు పుట్టినా సరే.. సంతూర్ మామ్ లాగా ఉండాలన్నది మహిళల కల. అయితే యవ్వనంగా ఉండటం అన్నది అందరికీ సాధ్యం కాదు. చాలామంది ఇంకా చిన్న వయసులోనే పెద్ద వయసు వాళ్లలా కనిపిస్తుంటారు. ఇలా కనిపించడానికి కారణం.. ముఖం మీద ముడతలు. ముఖం మీద ముడతలు కనిపించాయంటే చాలు.. పెద్ద వయసు వారు అనుకునే అవకాశాలే ఎక్కువ. అయితే ఇలా ముఖం మీద ముడతలు తగ్గించుకోవడానికి సహాయపడే కొన్ని సూపర్ టిప్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇంటి చిట్కాలు కావడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే ఖర్చు కూడా పెద్దగా ఉండదు. ఇంతకీ ఆ చిట్కాలేంటో తెలుసుకుంటే.. అలోవెరా జెల్.. అలోవెరా జెల్ చర్మాన్ని అద్బుతం చేస్తుంది. ఇది ముఖ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీన్ని రోజూ ముఖానికి అప్లై చేస్తుంటే ముఖం మీద ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. మొక్కల నుండి తాజా కలబంద జెల్ ను ఉపయోగించవచ్చు. లేదంటే రసాయనాలు తక్కువ వేసి తయారు చేసిన కలబంద జెల్ ను మార్కెట్ లో కొనుగోలు చేసి ఉపయోగించవచ్చు. అరటిపండు, తేనె.. అరటిపండు, తేనె ఇవి రెండూ మంచి ఆహార పదార్థాలు. ఇవి శరీరానికి పోషణను, శక్తిని ఇస్తాయి. అయితే.. ఈ అరటిపండు, తేనె రెండూ చర్మ సంరక్షణలో కూడా చాలా బాగా సహాయపడతాయి. ఈ మిశ్రమం ముఖాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఈ కాంబినేషన్ గొప్ప యాంటీ ఏజింగ్ ఏెజెంట్ గా పనిచేస్తుంది. కొబ్బరి నూనె.. కొబ్బరినూనె గురించి ప్రత్యేకంగా ఏం చెప్తారులే అనుకుంటారేమో.. కానీ కొబ్బరినూనెను కేవలం జుట్టుకు రాసుకోవడమే తెలుసు అందరికీ. కానీ కొన్ని చుక్కల కొబ్బరి నూనెను ముఖానికి అప్లై చేసి బాగా మసాజ్ చేయడం వల్ల చర్మం తేమగా ఉంటంది. క్రమంగా ముడతలు కూడా తగ్గుతాయి. రోజ్ వాటర్, గ్లిజరిన్.. రోజ్ వాటర్, ఇంకా గ్లిజరిన్ ఈ రెండూ డెడ్లీ కాంబినేషన్. ఇది చర్మానికి మ్యాజిక్ చేస్తుంది. రెండింటిని కలిపి రాత్రి పూట ముఖానికి అప్లై చేయాలి. చర్మం మృదువుగా ఉంటుంది. ఇది గొప్ప యాంటీ ఏజెంట్ గా పనిచేస్తుంది. పైన చెప్పుకున్న ఫలితాలను కనీసం ఒక నెలరోజుల పాటు కంటిన్యూగా ఉపయోగించాలి. ఆ తరువాత ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది. *రూపశ్రీ.
జుట్టు పెరుగుదల చాలా ఫాస్ట్ గా ఉండాలంటే ఈ విటమిన్లు తప్పక తీసుకోవాలి..! విటమిన్లు శరీరానికి చాలా అవసరం. ఇవి శరీరంలో వివిధ కార్యకలాపాలు జరగడానికి సహాయపడతాయి. అట్లాగే అవయవాలకు పోషణను, బలాన్ని ఇవ్వడంలో సహాయపడతాయి. అయితే కేవలం శరీరంలో అవయవాలకు, అంతర్గత శరీర విధులకే కాదు.. జుట్టు చక్కగా పెరగాలన్నా విటమిన్లే కీలకం. ఆరోగ్యకరమైన జుట్టు లోపలి నుండి మొదలవుతుంది. ఏ ఆహారం తింటున్నాం, జీవనశైలి ఎలా ఉంది? ఇవన్నీ జుట్టు పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తాయి. విటమిన్లు జుట్టు ఫోలికల్స్ కు ఇంధనం లాంటివి. అవి జుట్టును బలంగా ఉంచడానికి, జుట్టు రాలడం తగ్గించడానికి, జుట్టు పెరుగుదలను పెంచడానికి అవసరమైన పోషణను ఇస్తాయి. ఆహారంలో కొన్ని విటమిన్లు లేకపోతే జుట్టు సన్నబడటం, పొడిబారడం, జీవం కోల్పోయినట్టు ఉండటం, చాలా స్లో గా పెరగడం వంటివి జరుగుతాయి. జుట్టు పెరుగుదలను వేగవంతం చేయడానికి 5 విటమిన్లు చాలా బాగా హెల్ప్ అవుతాయి. అవేంటో తెలుసుకుంటే.. బయోటిన్.. ఎప్పుడైనా జుట్టు పెరుగుదల సప్లిమెంట్ల కోసం వెతికితే బయోటిన్ స్టార్ అనే పదార్థం తప్పక కనిపిస్తుంది. బయోటిన్ జుట్టు, చర్మం, గోళ్ళను తయారు చేసే ప్రోటీన్ అయిన కెరాటిన్ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. బయోటిన్ లోపం వల్ల తంతువులు పెళుసుగా మారతాయి. అలాగే గోళ్లు, జుట్టు నాశనం అవుతాయి. చర్మం పాలిపోయి, కళ కోల్పోతుంది. వృద్దాప్యం తొందరగా వచ్చినట్టు కనిపిస్తుంది. గుడ్లు, కాయలు, విత్తనాలు, సాల్మన్ ఫిష్, చిలగడదుంపలు వంటి వాటిలో బయోటిన్ ఉంటుంది. వైద్యుల సలహాతో సప్లిమెంట్లు కూడా వాడవచ్చు. విటమిన్-డి.. విటమిన్ డి లేకపోవడం వల్ల జుట్టు సన్నబడటం, బట్టతల రావడం జరుగుతుంది. ఈ విటమిన్ కొత్త జుట్టు కుదుళ్లను సృష్టించడానికి సహాయపడుతుంది. వారానికి కొన్ని సార్లు ఎండలో 15-20 నిమిషాలు గడపాలి. ఫ్యాటీ ఫిష్, పుట్టగొడుగులు, బలవర్థకమైన పాల ఉత్పత్తుల నుండి కూడా విటమిన్-డి పొందవచ్చు.అవసరమైతే వైద్యుల సలహాతో సప్లిమెంట్లు వాడవచ్చు. విటమిన్-ఇ.. విటమిన్ ఇ జుట్టుకు స్పా టైప్ ట్రీట్మెంట్ ఇస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది జుట్టు కుదుళ్లకు పోషణ ఇస్తుంది. వేగవంతమైన పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్ నుండి జుట్టు నష్టాన్ని కాపాడి, డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది. బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, బచ్చలికూర, అవోకాడోలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. విటమిన్-ఎ.. జుట్టులోని కణాలతో సహా శరీరంలోని ప్రతి కణం పెరగడానికి విటమిన్ ఎ అవసరం. ఇది జుట్టును హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా.. జుట్టుకు సహజంగా మెరుపును ఇచ్చే సెబమ్ ఉత్పత్తికి సహాయపడుతుంది. తగినంత విటమిన్ ఎ లేకపోతే.. జుట్టు తరచుగా పొడిగా, బలహీనంగా మారుతుంది. అలాగే విరిగిపోయే అవకాశం ఉంది. క్యారెట్లు, చిలగడదుంపలు, పాలకూరలలో విటమిన్-ఎ ఉంటుంది. అయితే.. విటమిన్ ఎ ఎక్కువ తీసుకున్నా జుట్టు రాలడానికి కారణమవుతుంది. కాబట్టి ఇది ముఖ్యమైనదే కానీ మితిమీరకూడదు. విటమిన్-సి.. రోగనిరోధక శక్తిని పెంచే బూస్టర్ గా విటమిన్-సి ని పరిగణిస్తారు. కానీ ఇది జుట్టు పెరుగుదలలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి శరీరం జుట్టు నిర్మాణాన్ని బలోపేతం చేసే కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని నివారించడానికి చాలా ముఖ్యమైన ఖనిజమైన ఐరన్ గ్రహించడానికి కూడా ఇది సహాయపడుతుంది. సిట్రస్ పండ్లు, స్ట్రాబెర్రీలు, జామ, బెల్ పెప్పర్స్, బ్రోకలీ నుండి విటమిన్ సి పుష్కలంగా పొందవచ్చు. *రూపశ్రీ.
అల్లం రసంలో వీటిని కలిపి అప్లై చేస్తే కనుబొమ్మలు భలే ఒత్తుగా పెరుగుతాయి..! కనుబొమ్మలు ముఖానికి అదనపు ఆకర్షణను తీసుకువస్తాయి. కనుబొమ్మలు ఒత్తుగా ఉంటే వాటిని షేప్ చేయించుకోవడం కూడా ఎంతో బాగుంటుంది. ఒత్తుగా, ముదురు రంగులో ఉన్న కనుబొమ్మలు కళ్ళ అందాన్ని పెంచడమే కాకుండా ముఖానికి షార్ప్ లుక్ ని కూడా ఇస్తాయి. చాలామంది ఐబ్రో పెన్సిల్ సహాయంతో కనుబొమ్మలను ఒత్తుగా ఉండేలా చూసుకుంటారు. కానీ ఇంటి చిట్కాలు ఉపయోగించి కనుబొమ్మలను సహజంగా ముదురుగా, మందంగా మార్చుకోవచ్చు. కొన్ని చిట్కాలు పాటిస్తే ఇది చాలా సులభంగా సాధ్యమవుతుంది. కొబ్బరినూనె, అల్లం.. కొబ్బరి నూనెతో కలిపి అల్లం పేస్ట్ రాయడం వల్ల కనుబొమ్మల వెంట్రుకలు పోషణ పొందుతాయి. అవి మందంగా మారుతాయి. రంగు కూడా ముదురుగా మారుతుంది. అల్లం, ఉల్లిపాయ రసం.. ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అల్లంతో కలిపి వాడటం వల్ల కనుబొమ్మలు వేగంగా నల్లబడటానికి, ఒత్తుగా మారడానికి సహాయపడుతుంది. అల్లం, అలోవెరా జెల్.. అలోవెరా చర్మాన్ని చల్లబరుస్తుంది. జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. అల్లంతో కలిపితే సహజ టానిక్‌గా పనిచేస్తుంది. అల్లం, ఆలివ్ నూనె.. ఆలివ్ నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. అల్లంతో కలిపి వాడటం వల్ల కనుబొమ్మల మూలాలు బలపడతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. అల్లం, మెంతుల పొడి.. మెంతులలోని ప్రోటీన్లు, నికోటినిక్ ఆమ్లం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అల్లం కలిపిన పేస్ట్‌ను పూయడం వల్ల కనుబొమ్మలు మందంగా మారుతాయి. అల్లం, నిమ్మరసం.. నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు మూలాలను శుభ్రపరుస్తుంది. అల్లంతో కలిపి నిమ్మరసం రాస్తే.. కనుబొమ్మలను నల్లగా, మెరిసేలా చేస్తుంది. ఎలా అప్లై చేయాలి.. పై మిశ్రమాలలో దేనినైనా రాత్రిపూట కనుబొమ్మలకు సున్నితంగా అప్లై చేసి, ఉదయం కడిగేయాలి. క్రమం తప్పకుండా ఉపయోగిస్తుంటే కొన్ని వారాలలో గుర్తించదగిన తేడాను చూడవచ్చు. *రూపశ్రీ.
ఉప్పు నీటి కారణంగా జుట్టు రాలుతోందా... ఈ టిప్స్ తో మళ్లీ జుట్టు పెరుగుతుంది..! ప్రతి నగరం, పట్టణం, గ్రామం.. ఇలా చాలా ప్రాంతాలలో నీటి సప్లై సహజంగా ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాలలో నీరు సహజంగా ఉంటే మరికొన్ని ప్రాంతాలలో మాత్రం నీరు ఉప్పుగా ఉంటుంది.చాలా వరకు ఇంట్లో మినరల్ వాటర్ ను కొనుక్కోవడం, లేదా ఇంట్లోనే వాటర్ ఫ్యూరిఫయర్లు సెట్ చేసుకోవడం కారణంగా నీరు తాగే విషయంలో ఈ ఉప్పు నీటి ఇబ్బంది కనిపించదు. కానీ ఉప్పగా ఉన్న నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలడం అనే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఉప్పు నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఇతర ఖనిజాలు తలపై పేరుకుపోయి, రంధ్రాలు మూసుకుపోతాయి. దీనివల్ల జుట్టు పొడిగా, నీరసంగా, బలహీనంగా మారుతుంది. రాలడం ప్రారంభమవుతుంది. జుట్టు పెరుగుదల కూడా ఆగిపోతుంది. వెంట్రుకలు పలుచగా మారతాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఉప్పు నీటితో స్నానం చేసినా జుట్టు రాలడం ఉండదు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. నిమ్మకాయ.. ఉప్పు నీటితో జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే, నిమ్మకాయను వాడటం మంచి మారాగం. జుట్టు కడుక్కోవడానికి ఉపయోగించే నీటిలో నిమ్మకాయను పిండాలి. ఇది తల చర్మం యొక్క pH ని సమతుల్యం చేస్తుంద. జుట్టు విరిగిపోకుండా నిరోధిస్తుంది. వెనిగర్.. నిమ్మకాయను ఉపయోగించ లేకపోతే వెనిగర్ కూడా ఉపయోగపడుతుంది. ముందుగా రెండు చెంచాల వెనిగర్‌ను ఒక బకెట్ నీటిలో కలపాలి. ఇప్పుడు జుట్టును ఆ నీటితో కడగాలి. ఇది జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది. హెయిర్ మాస్క్.. జుట్టు రకాన్ని బట్టి వారానికి కనీసం రెండుసార్లు హెయిర్ మాస్క్ వాడాలి. మార్కెట్ నుండి హెయిర్ మాస్క్ కొనకూడదనుకుంటే, వారానికి ఒకసారి జుట్టుకు నేచురల్ హెయిర్ మాస్క్ వేయాలి. దీని కోసం పెరుగు, తేనె, కలబంద, గుడ్డు ఉపయోగించవచ్చు. ఇవి జుట్టుకు పోషణను అందిస్తాయి. షాంపూ.. సల్ఫేట్ ఉన్న షాంపూని ఉపయోగిస్తే, అది ఉప్పు నీటితో కలిపినప్పుడు జుట్టుకు మరింత నష్టం కలిగిస్తుంది. కాబట్టి నీరు ఉప్పగా ఉంటే, సల్ఫేట్ లేని షాంపూని ఉపయోగించాలి. తేలికపాటి, సల్ఫేట్ లేని షాంపూ జుట్టు రాలకుండా నిరోధిస్తుంది. నీరు మరిగించి చల్లబరచాలి.. జుట్టు కడుక్కోవడానికి మంచి నీటిని ఉపయోగించడానికి ప్రయత్నించాలి. కానీ ఇది సాధ్యం కాకపోతే ఉప్పు నీటిని బాగా మరిగించి, ఆపై చల్లబరిచి, దానితో జుట్టు కడగాలి. ఇది జుట్టు రాలడాన్ని కూడా ఆపుతుంది. *రూపశ్రీ.
మొటిమల కారణంగా ముఖం మీద గుంటలు పడ్డాయా...ఈ టిప్స్ ట్రై చేయండి..! చర్మం శుభ్రంగా, మెరుస్తూ ఉన్నప్పుడు ముఖం అందం చాలా బాగా కనిపిస్తుంది. కానీ చాలా వరకు ఇది అమ్మాయిలకు ఉండిపోతుంది. దీనికి కారణం మొటిమలు.. సార్లు పాత మొటిమల కారణంగా, ముఖంపై లోతైన గుంటలు లేదా మచ్చలు ఏర్పడతాయి. ఇవి అందాన్ని దెబ్బతీస్తాయి. ముఖం మీద ఉండే ఈ మొటిమలు, గుంటలు తొలగించుకోవడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన ఉత్పత్తుల వైపు ఆకర్షితులు అవుతారు. వీటి వల్ల సమస్య పూర్తీగా తగ్గకపోగా కొన్ని సార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయితే చర్మానికి ఎటువంటి హాని లేకుండా రిపేర్ చేయగల ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే ముఖం మీద గుంటలు, మచ్చలు మాయమై ముఖం చాలా ప్రకాశవంతంగా మారుతుంది. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. గుడ్డులోని తెల్లసొన ముఖం మీద గుంటలు ఉండేవారికి ఇది చక్కని చిట్కా.. అయితే గుడ్లు వాడటానికి ఎలాంటి అభ్యంతరం లేకపోతే ఈ రెమెడీని ప్రయత్నించవచ్చు. దీని కోసం గుడ్డులోని తెల్లసొనను ముఖం మీద ఉపయోగించాలి. గుడ్డును పగలగొట్టి దాని తెల్ల భాగాన్ని తీసి బాగా గిలక్కొట్టాలి. ఇప్పుడు దానిని బ్రష్ సహాయంతో ముఖంపై అప్లై చేయాలి. అది ఆరిన తర్వాత కడగాలి. ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. పెద్దగా ఉన్న చర్మ రంధ్రాలను తగ్గిస్తుంది. దీని కారణంగా మచ్చలు తగ్గుతాయి. శనగపిండి, రోజ్ వాటర్, నిమ్మకాయ.. గుడ్లు వాడటంలో ఇబ్బంది అనిపించేవారు ఈ రెసిపీని ఉపయోగించవచ్చు. దీన్ని రెడీ చేయడానికి ఒక చెంచా శనగపిండికి కొన్ని చుక్కల నిమ్మరసం, రోజ్ వాటర్ జోడించాలి. మూడు వస్తువులను బాగా కలిపిన తర్వాత ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగిస్తే మంచిది. ఇది చనిపోయిన చర్మాన్ని తొలగించి, మచ్చలను తగ్గించి, చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. *రూపశ్రీ.
క్లీనింగ్ టూల్స్ తో చర్మాన్ని శుభ్రం చేస్తున్నారా...ఈ షాకింగ్ నిజాలు తెలుసా! ముఖాన్ని, చర్మాన్ని శుభ్రం చేసుకోవడానికి నేడు మార్కెట్లో అనేక రకాల క్లీనింగ్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి హైటెక్ గా, ప్రొఫెషనల్‌గా కనిపిస్తాయి. వీటిని వాడేవారు బ్యూటీ ప్రపంచంలో అప్డేటెట్ అనే ఒక ట్యాగ్ ను పొంది ఉంటారు. కానీ వాటిని సరిగ్గా ఉపయోగించకపోతే అవి చర్మానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయనే విషయం మాత్రం చాలామంది అమ్మాయిలకు తెలియదు. చాలా కంపెనీలు చర్మంపై ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపవని చెబుతూ వీటిని అమ్ముతాయి. కానీ ఈ టూల్స్ ను పదే పదే లేదా చాలా ఎక్కువగా స్క్రబ్ చేయడం వల్ల చర్మంపై చిన్న చిన్న కోతలు ఏర్పడతాయి, దీనివల్ల చికాకు, దద్దుర్లు, ఎరుపు, పిగ్మెంటేషన్ కూడా వస్తాయి. చాలా మందికి ఈ టూల్స్ ఏమిటో కూడా తెలియదు.. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ఫేస్ బ్రష్ ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి మార్కెట్లో అనేక రకాల ఫేస్ బ్రష్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో ముఖాన్ని లోతుగా శుభ్రపరుస్తారు. కానీ దీన్ని ఎక్కువగా, ప్రతిరోజూ ఉపయోగిస్తే, అది చర్మం సహజంగా క్లీన్ అవ్వడాన్ని దెబ్బ తీస్తుంది. దీనివల్ల చర్మం ఎర్రగా, సున్నితంగా, పొడిగా మారుతుంది. ఎక్స్‌ఫోలియేటింగ్ గ్లోవ్స్ డెడ్ స్కిన్ తొలగించడానికి ఎక్స్‌ఫోలియేటింగ్ గ్లోవ్స్‌ను ఉపయోగిస్తారు. దీనిని సున్నితంగా ఉపయోగించకపోతే చర్మంపై కంటికి సరిగా కనిపించని చిన్న కోతలు ఏర్పడతాయి. ఇది చర్మపు చికాకును కలిగిస్తుంది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా, వారానికి 1-2 సార్లు మాత్రమే ఉపయోగించాలి. స్క్రబ్బింగ్ ప్యాడ్ చర్మాన్ని స్క్రబ్ చేయడానికి స్క్రబ్బింగ్ ప్యాడ్‌లను ఉపయోగిస్తారు. ఇవి చాలా గరుకుగా ఉంటాయి. తరచుగా ఎక్స్‌ఫోలియేషన్ కోసం వీటిని ఉపయోగిస్తారు. అధికంగా ఉపయోగిస్తే ఇది చర్మంపై దురద, చికాకు, పొడిబారడానికి కారణమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు దీని వాడకాన్ని నివారించాలి. సిలికాన్ క్లీనింగ్ బ్రష్ చర్మాన్ని శుభ్రం చేయడానికి సిలికాన్ క్లీనింగ్ బ్రష్‌లను ఉపయోగిస్తారు. ఇవి చాలా సున్నితంగా ఉంటాయి. కానీ ఈ బ్రష్‌లు చర్మ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ఈ బ్రష్‌లు మురికిగా మారితే లేదా సరిగ్గా శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా వల్ల చర్మ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఒకవేళ వీటిని ఉపయోగిస్తే వాటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం చాలా ముఖ్యం. ఎలక్ట్రానిక్ క్లీనింగ్ పరికరాలు.. ఇవి హైటెక్ గా ఉంటాయి. చర్మాన్ని డీప్ క్లీన్ చేస్తాయి. కానీ వీటిని చాలా ఎక్కువ వేగంతో లేదా ప్రతిరోజూ ఉపయోగిస్తే, చర్మానికి ఉండే సహజ తేమ పోతుంది. చర్మం పొడిగా, చికాకుగా మారవచ్చు. కాబట్టి వీటిని కూడా వాడటం మానుకోవడం మంచిది. *రూపశ్రీ.
బ్లాక్ హెన్నా వాడుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా? ఈ రోజుల్లో జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా, చిన్న వయస్సులోనే జుట్టు బూడిద రంగులోకి మారుతోంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పెద్దవాళ్లు కొందరు పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ.. చిన్న వయసులో ఉండే వారు, కాలేజీలకు, ఉద్యోగాలకు వెళ్లేవారు మాత్రం లైట్ తీసుకోలేరు. ఇందుకోసం చాలామంది బ్లాక్ హెన్నాను ఉపయోగిస్తారు. దీన్ని మార్కెట్లో చాలా కంపెనీలు విక్రయిస్తున్నాయి. అయితే బ్లాక్ హెన్నా మంచిదేనా? దీనివల్ల నష్టాలేమైనా ఉన్నాయా? తెలుసుకుంటే.. బ్లాక్ హెన్నా సహజమైనదా? బ్లాక్ హెన్నా సహజమైనది కాదు. చాలా కంపెనీలు దీనిని హెర్బల్ లేదా నేచురల్ అని పిలుస్తూ అమ్ముతాయి. కానీ నిజం ఏమిటంటే చాలా బ్లాక్ హెన్నాలలో రసాయనాలు కలుపుతారు. మార్కెట్లో లభించే చాలా బ్లాక్ హెన్నాలలో PPD అనే రసాయనం కనిపిస్తుంది. ఇది జుట్టుకు ముదురు నలుపు రంగును ఇచ్చే సింథటిక్ డై. నేచురల్ హెన్నా ఎల్లప్పుడూ ఆకుపచ్చ ఆకులతో తయారు చేయబడుతుందని గుర్తుంచుకోండి, ఇది లేత గోధుమ లేదా ఎరుపు రంగును ఇస్తుంది. ఏదైనా బ్లాక్ హెన్నా వెంటనే ముదురు నలుపు రంగును ఇస్తుంటే, దానిలో రసాయన మూలకాలు కలిపి ఉండవచ్చని అంటున్నారు. బ్లాక్ హెన్నా ప్రయోజనాలు.. తెల్ల జుట్టును త్వరగా నల్లగా మారుస్తుంది. దీన్ని అప్లై చేసుకోవడం సులభం. కొన్ని బ్రాండ్లు హెర్బల్ పదార్థాలను కలిగి ఉంటాయి. తక్కువ మొత్తంలో రసాయనాలను కలిగి ఉంటాయి. కొంతకాలం జుట్టును మెరిసేలా చేయగలదు. నష్టాలు.. బ్లాక్ హెన్నా వల్ల అలెర్జీ లేదా చికాకు వచ్చే అవకాశం ఉంటుంది. తల చర్మం దురద లేదా మంటగా అనిపించవచ్చు. జుట్టు మూలాలు బలహీనంగా మారవచ్చు. ఈ కారణంగా జుట్టు రాలిపోవచ్చు. దీర్ఘకాలిక వాడకం వల్ల జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది. *రూపశ్రీ.
జుట్టును మందంగా షైనింగ్ గా మార్చే సూపర్ సీరమ్.. ఇంట్లోనే తయారు చేసుకోండి..! ప్రతి ఒక్కరూ ఒత్తైన, మెరిస్తూ బలమైన జుట్టు ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలకు ఒత్తుగా ఉన్న జుట్టంటే పిచ్చి. జుట్టు ప పెరుగుదల కోసం ఏమైనా చేస్తారు. కానీ రసాయన ఉత్పత్తులు, జుట్టు సంరక్షణలో చేసే తప్పుల కారణంగా, జుట్టు పొడిగా, నిర్జీవంగా, సన్నగా మారుతుంది. కొన్ని ఇంట్లో తయారుచేసే సహజమైన హెయిర్ సీరమ్‌లు బెస్ట్ గా సహాయపడతాయి. ఇవి జుట్టుకు లోతైన పోషణను ఇస్తాయి, జుట్టును బలంగా, మెరుస్తూ, మందంగా ఉండేలా చేస్తాయి. ఈ సహజ సీరమ్‌లు జుట్టును హైడ్రేట్ చేస్తాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. కాబట్టి ఇంట్లో తయారుచేసే పవర్పుల్ హెయిర్ సీరమ్‌లు, వాటిని తయారు చేసే పద్ధతులను తెలుసుకుంటే.. కలబంద, కొబ్బరి నూనె సీరం.. కలబంద కొబ్బరినూనె సీరం జుట్టుకు లోతైన పోషణను ఇస్తుంది. తద్వారా అవి పొడిగా, నిర్జీవంగా ఉండవు. జుట్టు పీచులా ఉండటాన్ని తగ్గించడం ద్వారా జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. దీన్ని తయారు చేయడానికి రెండు టీస్పూన్ల కలబంద జెల్ లో ఒక టీస్పూన్ కొబ్బరి నూనె కలపాలి. దీన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసి బాగా మసాజ్ చేసుకోవాలి. రోజ్ వాటర్, ఆముదం.. రోజ్ వాటర్ జుట్టును హైడ్రేట్ చేస్తుంది, జుట్టుకు తాజాదనాన్ని ఇస్తుంది. ఆముదం జుట్టు పెరుగుదలను పెంచుతుంది. దీన్ని తయారు చేయడానికి మూడు టీస్పూన్ల రోజ్ వాటర్ లో ఒక టీస్పూన్ ఆముదం మిక్స్ చేసి స్ప్రే బాటిల్ లో భద్రపరిచి జుట్టుకు స్ప్రే చేసి తేలికపాటి చేతులతో మసాజ్ చేయాలి. ఉల్లిపాయ రసం, ఆలివ్ ఆయిల్.. సల్ఫర్ అధికంగా ఉండే ఉల్లిపాయ రసం జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. కొత్త జుట్టు పెరుగుదలను పెంచుతుంది. ఆలివ్ ఆయిల్ నెత్తికి పోషణను అందిస్తుంది, పొడిబారడాన్ని తగ్గిస్తుంది. రెండు టీస్పూన్ల ఉల్లిపాయ రసంలో ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. మందార, బాదం ఆయిల్.. మందార పువ్వులు జుట్టును ఒత్తుగా మార్చడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. బాదం నూనె జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. కాబట్టి రెండు మూడు మందార పువ్వులను గ్రైండ్ చేసి ఒక చెంచా బాదం నూనెలో మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. టీ లీఫ్, లెమన్ సీరం.. ఇది జుట్టు నుండి అదనపు నూనె, చుండ్రును తొలగించడానికి సహాయపడుతుంది, ఇది జుట్టును కాంతివంతంగా, మెరిసేలా చేస్తుంది. దీన్ని తయారు చేయడానికి ఒక కప్పు తయారుచేసిన గ్రీన్ టీలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలపాలి. మెంతులు, పెరుగు సీరం.. మెంతుల్లో ఉండే ప్రోటీన్, ఐరన్ జుట్టును బలోపేతం చేస్తాయి, పెరుగు నెత్తిని డీప్ గా మాయిశ్చరైజర్ చేస్తుంది. నానబెట్టిన మెంతులను రాత్రంతా గ్రైండ్ చేసి రెండు టీస్పూన్ల పెరుగులో కలపాలి. *రూపశ్రీ.
ఫెర్మెంటెడ్ స్కిన్ కేర్.. దీన్ని ఫాలో అయితే చర్మం యవ్వనంగా మారుతుంది..! మారుతున్న కాలంతో పాటు స్మిన్ కేర్ ప్రపంచంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పుట్లో అమ్మాయిలు చర్మానికి కేవలం క్రీములు లేదా లోషన్లకే పరిమితం కాకుండా, చర్మాన్ని చాలా డీప్ గా హెల్తీగా ఉంచే మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే స్కిన్ కేర్ ప్రపంచంలో ఒక కొత్త మార్గం పుట్టుకొచ్చింది. అదే ఫెర్మెంటెడ్ స్కిన్ కేర్.. ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతున్న స్కిన్ కేర్ మార్గం ఇది. ముఖ్యంగా కొరియన్ బ్యూటీ రొటీన్‌లో దీనికి ముఖ్యమైన స్థానం ఉంది. ఇక భారతీయ మహిళలు కూడా దీని వైపు చాలా ఆకర్షితులవుతున్నారు. అసలు ఈ ఫెర్మెంటెడ్ స్కిన్ కేర్ అంటే ఏంటి? దీని గురించి తెలుసుకుంటే.. ఫెర్మెంటెడ్ స్కిన్ కేర్.. నేచురల్ గా అందం పొందాలనుకునేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ చర్మ సంరక్షణ ప్రక్రియలో ఉపయోగించే పదార్థాలు కిణ్వ ప్రక్రియకు గురవుతాయి, అంటే అవి కిణ్వ ప్రక్రియ ద్వారా చర్య జరగడం వల్ల చర్మానికి మరింత ప్రబావితంగా పనిచేస్తాయి. ఇది ఎలా పనిచేస్తుంది? ఈ పెర్మెంటెడ్ స్కిన్ కేర్ లో సహజ పదార్థాలు బ్యాక్టీరియా, ఈస్ట్ లేదా ఎంజైమ్‌ల సహాయంతో విచ్ఛిన్నమవుతాయి. ఈ ప్రక్రియ తర్వాత ఈ మూలకాలు చర్మాన్ని మరింత సులభంగా డీప్ గా ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మానికి ప్రయోజనం చేకూరుస్తాయి. ఆయుర్వేదంలో కూడా కిణ్వ ప్రక్రియ ఉత్పత్తులు చర్మానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. ఇది చాలా ప్రభావంగా పనిచేస్తుందని చెబుతారు. ఉపయోగించే పదార్థాలు.. ఫెర్మెంటెడ్ స్కిన్ కేర్ లో వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిలో పులియబెట్టిన బియ్యం నీరు, పులియబెట్టిన గ్రీన్ టీ, పులియబెట్టిన సోయా, గెలాక్టోమైసెస్ ఉంటాయి. చాలా మంది వీటిని ఉపయోగించడం ద్వారా ఫెర్మెంటెడ్ చర్మ సంరక్షణను ఫాలో అవుతుంటారు. ప్రయోజనాలేంటంటే.. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. వృద్ధాప్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది చర్మం స్థితిస్థాపకతను పెంచుతుంది చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది ఎవరు వాడవచ్చు? ఫెర్మెంటేటెడ్ స్కిన్ కేర్లో ఉపయోగించే పదార్థాలు ఎవరికీ ఎలాంటి ప్రమాదం కలిగించవు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫెర్మెంటేటెడ్ స్కిన్ కేర్ రొటీన్‌ను ప్రయత్నించవచ్చు. అయితే ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేస్తే సరిపోతుంది, తద్వారా అలెర్జీ వచ్చే అవకాశం ఉండదు. *రూపశ్రీ.
మోకాళ్లు, మోచేతులు నల్లగా మారతాయెందుకు...దీని తొలగించే సూపర్ టిప్స్ ఇదిగో..! మోకాళ్లు నల్లబడటం అనేది ఒక సాధారణ సమస్య. కొందరిలో మోచేతులు కూడా నల్లగా మారుతుంటాయి. తెల్లటి చర్మం ఉన్నవారిలో కూడా ఇలాంటి సమస్య కనిపిస్తుంది. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు, కానీ చాలా సార్లు మోకాళ్లు, మోచేతులు నల్లగా ఉండటం వల్ల తమకు ఇష్టమైన దుస్తులు ధరించలేరు. చర్మ నిర్మాణం, పొడిబారడం లేదా మోచేతులు, మోకాళ్లు భాగాలపై ఒత్తిడి కారణంగా చర్మం నల్లబడుతుందని చర్మవ్యాధి నిపుణులు అంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొన్ని ఈజీ టిప్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. మోకాళ్లు, మోచేతుల చర్మమే ఎందుకు నల్లబడుతుంది.. నిజానికి మోకాళ్లతో పాటు, మోచేతుల చర్మం మన శరీరంలోని మిగిలిన భాగాల చర్మం కంటే భిన్నంగా ఉంటుంది. ఇది మందంగా ఉండటం వల్ల ఇక్కడి చర్మం త్వరగా దెబ్బతింటుంది. అధికంగా రుద్దడం వల్ల మోకాళ్లు, మోచేతుల చర్మం నల్లగా మారుతుంది. ఒత్తిడి.. మోకాళ్లు నల్లగా మారడానికి మరో కారణం వాటిపై ఉండే ఒత్తిడి. కూర్చున్నప్పుడు లేదా వంగినప్పుడు మోకాళ్లపై చాలా ఒత్తిడి ఉంటుంది. దీని కారణంగా మోకాళ్ల రంగు క్రమంగా ముదురు రంగులోకి మారుతుంది. తరువాత అవి నల్లగా మారుతాయి. తేమ లేకపోవడం.. మోకాళ్లు, మోచేతుల చర్మం చాలా పొడిగా ఉంటుంది. ఆ ప్రాంతంలో తేమ లేకపోవడం వల్ల అవి చాలా పొడిగా ఉంటాయి. అందుకే చర్మం ముదురు రంగులో కనిపిస్తుంది. మోకాళ్లు, మోచేతులపై చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోవడం వల్ల వాటి రంగు మారుతుంది. UV కిరణాలు.. ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల టానింగ్ వస్తుంది. UV కిరణాలకు గురికావడం వల్ల చర్మం స్థితిస్థాపకత తగ్గుతుంది. ముడతలు కూడా వస్తాయి. ఇది చర్మం రంగును పాడు చేస్తుంది. అల్ట్రా వైలెట్ కిరణాలు మెలనిన్‌ను పెంచుతాయి, ఇది చర్మం రంగును ముదురు చేస్తుంది. ఎండకు గురైనప్పుడు మోకాళ్లు, మోచేతులు నల్లగా మారుతాయి. వ్యాధులు.. కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యల వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. హైపర్పిగ్మెంటేషన్ వల్ల మోకాళ్లు, మోచేతులు నల్లబడటం జరుగుతుంది. దీనితో పాటు పొడి చర్మం కూడా దీనికి ఒక పెద్ద కారణం. అలాంటి సమస్య కొనసాగితే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. మోకాళ్లు, మోచేతుల నలుపు వదిలించే చిట్కాలు.. ఒక గిన్నె నిమ్మరసంలో బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. తర్వాత కాటన్ సహాయంతో మోకాళ్లపై అప్లై చేసి మసాజ్ చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయాలి. బంగాళాదుంపను తురమి దాని రసాన్ని తీయాలి. తర్వాత ఆ రసాన్ని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతి రాత్రి పడుకునే ముందు మోకాళ్లు, మోచేతులపై రాయాలి. పచ్చి పాలతో మోకాళ్లు, మోచేతులను మసాజ్ చేయాలి. ఈ విధంగా మసాజ్ చేయడం ద్వారా, మోకాళ్లు, మోచేతుల రంగు క్రమంగా స్పష్టంగా మారుతుంది. మోకాళ్లు, మోచేతుల చర్మం పొడిగా మారనివ్వకూడదు. బదులుగా మాయిశ్చరైజర్ రాస్తూ ఉండాలి. దీనివల్ల చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి స్క్రబ్ ఉపయోగించడం ద్వారా మోకాళ్లు, మోచేతుల చర్మం నలుపు వదులుతుంది. *రూపశ్రీ.
ఇంట్లోనే తయారు చేసుకునే ఈ యాంటీ ఏజింగ్ క్రీమ్ తో.. చర్మం యవ్వనంగా మారడం ఖాయం..! ఈ కాలంలో చాలామంది చిన్న వయస్సులోనే ముఖం మీద ముడతలు, సన్నని గీతలు, చర్మం వదులుగా మారి ముడుతలు పడటం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటిని తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు లేదా రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అయితే దీని వల్ల డబ్బు ఖర్చు తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. కొన్ని క్రీములు చర్మం మీద ప్రబావం చూపించినప్పటికీ అది కేవలం తాత్కాలికం మాత్రమే. ఇలాంటి వారు ఇంట్లోనే తయారు చేసుకుని వాడగల యాంటీ ఏజింగ్ క్రీమ్ ఉంది. దీన్ని చాలా సులువుగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ముఖాన్ని యవ్వనంగా మార్చడానికి సహజ పదార్థాలను మాత్రమే ఉపయోగించి నైట్ క్రీమ్‌ను ఇంట్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. అలోవెరా జెల్ - 2 టీస్పూన్లు బాదం నూనె - 1 టీస్పూన్ విటమిన్ E గుళిక - 1 రోజ్ వాటర్ - 1 టీస్పూన్ తయారీ విదానం.. ఇంట్లో క్రీమ్ తయారు చేయడం చాలా సులభం. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో తాజా కలబంద జెల్ తీసుకోవాలి. తాజా కలబంద జెల్ అందుబాటులో లేకపోతే మార్కెట్లో లభించే జెల్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో రెండు చెంచాల జెల్ తీసుకొని దానికి ఒక చెంచా బాదం నూనె జోడించాలి. రెండింటినీ బాగా కలపాలి. రెండింటినీ బాగా కలిపిన తర్వాత, అందులో విటమిన్ E క్యాప్సూల్ వేసి మళ్ళీ కలపాలి. చివరగా, దానికి రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఇది క్రీమ్ లాగా మారుతుంది. దీన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఎలా వాడాలంటే.. ఈ క్రీమ్ ను వాడే ముందుగా ముఖాన్ని మంచి ఫేస్ వాష్ సహాయంతో శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఈ క్రీమ్ ను అప్లై చేయాలి. ప్రతి రాత్రి పడుకునే ముందు ముఖం, మెడపై ఈ క్రీమ్‌ను తేలికగా అప్లై చేయాలి. ఉదయం గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. జాగ్రత్త.. ఈ క్రీమ్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఉపయోగించే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. తద్వారా చర్మంపై ఎలాంటి అలెర్జీ ప్రమాదం ఉండదు. *రూపశ్రీ.
హెయిర్ కలర్ వేసే వారికి దిమ్మ తిరిగే షాకింగ్ నిజాలు..! ఫ్యాషన్ కోసం లేదా జుట్టు తెల్లబడిందనే కారణంతోనో చాలామంది జుట్టుకు రంగు వేస్తుంటారు. ఇప్పట్లో మార్కెట్లో జుట్టుకు వేసే రంగులు చాలా వచ్చేశాయి. కొందరు జుట్టుకు రోజులు, వారాల వ్యవధిలో రంగు వేస్తుంటారు. ఇలా కొన్ని రోజుల వ్యవధిలో జుట్టుకు రంగు వేసే వారి కోసమే ఈ సమాచారం. జుట్టుకు రంగు వేయడం ఫ్యాషన్ అయిపోయింజి. ట్రెండీ అండ్ న్యూ లుక్ కోసం ప్రతి ఒక్కరూ తమ జుట్టుకు పదేపదే రంగులు వేస్తారు. కానీ జుట్టు రంగు కారణంగా కలిగే నష్టం గురించి ఎవరూ ఆలోచించి ఉండరు. ఈ నష్టాల గురించి తెలిస్తే తప్పకుండా షాకవుతారు. జుట్టుకు తరచుగా రంగు వేయడం వల్ల కలిగే ప్రమాదకరమైన దుష్ప్రభావాలు.. జుట్టు రాలడం పెరుగుతుంది.. ఎక్కువ గ్యాప్ లేకుండా పదేపదే జుట్టుకు రంగులు వేస్తే జుట్టు రాలడం పెరుగుతుంది. హెయిర్ కలర్ వల్ల జుట్టుకు చాలా డ్యామేజ్ అవుతుంది. ఇది జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది. హెయిర్ రూట్స్ బలహీనపడతాయి. దీని కారణంగా వెంటనే జుట్టు రాలడం పెరుగుతుంది. కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా వాడాలి. దురద పెరుగుతుంది.. హెయిర్ కలర్ ను పదేపదే ఉపయోగించడం వల్ల నెత్తిమీద దురద పెరుగుతుంది. ఈ దురద చాలా తరచుగా అలెర్జీగా మారుతుంది. చాలా చికాకు కలిగిస్తుంది. అందువల్ల నెత్తిమీద ఏమాత్రం దురదగా అనిపించినా వెంటనే హెయిర్ కలర్ వాడటం మానేయాలి. లేకపోతే సమస్య పెరుగుతుంది. జుట్టు పొడిబారి నిర్జీవంగా ఉంటుంది.. ఇప్పట్లో మార్కెట్లో అనేక హెయిర్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో అన్ని రకాల రసాయనాలు ఉంటాయి. జుట్టులో ఈ కెమికల్స్ ఎక్కువగా వాడితే జుట్టు పొడిబారి, నిర్జీవంగా, బలహీనంగా మారుతుంది. కాబట్టి జుట్టు పొడిగా, నిర్జీవంగా మారకూడదని కోరుకుంటే, అమ్మోనియాతో కూడినమ హెయిర్ కలర్ ఉపయోగించడం మానుకోవాలి. చుండ్రు సమస్య పెరుగుతుంది.. ఎక్కువ హెయిర్ కలర్ వాడటం వల్ల నెత్తిమీద తేమ లోపిస్తుంది. దీని వల్ల నెత్తిమీద చుండ్రు పేరుకుపోవడం చాలా సాధారణమైన సమస్యగా మారుతుంది. కాబట్టి ఒకసారి రంగు మారిన తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. తద్వారా జుట్టు కూడా శుభ్రంగా ఉంటుంది. *రూపశ్రీ.
వర్షాల వల్ల చుండ్రు, దురద ఇబ్బంది పెడుతున్నాయా...ఈ హెయిర్ మాస్క్ ట్రై చేయండి..! వర్షాకాలం నడుస్తోంది. దీని కారణంగా చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా వర్షంలో తడిసిన తర్వాత చర్మం దురద పెడుతూ ఉంటుంది. జుట్టు సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఈ వర్షంలో తడిసిన తర్వాత చుండ్రుతో బాధపడటం చూస్తుంటాం. ఈ చుండ్రు కారణంగా దురద.. ఇది కాస్తా చర్మ సమస్యలకు దారి తీసి ముఖం మీద అలెర్జీ, మొటిమలు రావడానికి కూడా కారణం అవుతుంది. తల నుండి చుండ్రును తొలగించే సూపర్ హెయిర్ మాస్క్ ఉంది. అదేంటో.. దాని తయారీకి కావలసిన పదార్థాలేంటో, దాన్నెలా తయారు చేయాలో తెలుసుకుంటే.. హెయిర్ మాస్క్ తయారీ సామాగ్రి.. వేప ఆకులు - 10-15 పెరుగు - 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం - 1 స్పూన్ టీ ట్రీ ఆయిల్ - 2-3 చుక్కలు తయారు విధానం.. ముందుగా అన్ని పదార్థాలను తీసి ఒక వైపు ఉంచాలి. ఇప్పుడు ఒక పాన్ లో కొంచెం నీరు తీసుకుని అందులో వేప ఆకులు వేసి మరిగించాలి. ఆకులు ఉడికిన తర్వాత దానిని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వేప పేస్ట్ లో కొంచెం పెరుగు, నిమ్మరసం కలపాలి. చివర్లో ఈ పేస్ట్ లో టీ ట్రీ ఆయిల్ కలపాలి. టీట్రీ ఆయిల్ లేకపోతే దాన్ని మినహాయించవచ్చు. ఇప్పుడు అన్ని వస్తువులను కలిపిన తర్వాత హెయిర్ మాస్క్ సిద్ధమైనట్టే.. ఉపయోగించే విధానం.. తయారు చేసుకున్న పేస్ట్‌ను తలకు అప్లై చేయాలి. అయితే ఈ పేస్ట్ అప్లై చేయడానికి ముందే తల స్నానం చేసి జుట్టును శుభ్రం చేసుకుని ఉండాలి. ఆ తరువాతే హెయిర్ మాస్క్‌ను అప్లై చేయాలి. 30 నిమిషాలు మాస్క్ ను అలాగే ఉంచాలి. 30 నిమిషాల తర్వాత జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి. తద్వారా జుట్టు శుభ్రంగా మారుతుంది. జాగ్రత్తలు.. ఈ హెయిర్ మాస్క్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు. ఈ మాస్క్‌ను రెండు నుండి మూడు సార్లు ఉపయోగించిన తర్వాత, తలపై చుండ్రు పూర్తిగా మాయమవుతుంది. దీన్ని అప్లై చేసిన తర్వాత, కొంచెం దురద లేదా ఏదైనా ఇతర సమస్య ఉంటే వెంటనే జుట్టును కడిగేసుకోవాలి. సైనస్ సమస్యలు ఉన్నవారు హెయిర్ మాస్క్ లకు దూరంగా ఉండటం మంచిది. *రూపశ్రీ.





















