క్లీనింగ్ టూల్స్ తో చర్మాన్ని శుభ్రం చేస్తున్నారా...ఈ షాకింగ్ నిజాలు తెలుసా!
.webp)
ముఖాన్ని, చర్మాన్ని శుభ్రం చేసుకోవడానికి నేడు మార్కెట్లో అనేక రకాల క్లీనింగ్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి హైటెక్ గా, ప్రొఫెషనల్‌గా కనిపిస్తాయి. వీటిని వాడేవారు బ్యూటీ ప్రపంచంలో అప్డేటెట్ అనే ఒక ట్యాగ్ ను పొంది ఉంటారు. కానీ వాటిని సరిగ్గా ఉపయోగించకపోతే అవి చర్మానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయనే విషయం మాత్రం చాలామంది అమ్మాయిలకు తెలియదు. చాలా కంపెనీలు చర్మంపై ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపవని చెబుతూ వీటిని అమ్ముతాయి. కానీ ఈ టూల్స్ ను పదే పదే లేదా చాలా ఎక్కువగా స్క్రబ్ చేయడం వల్ల చర్మంపై చిన్న చిన్న కోతలు ఏర్పడతాయి, దీనివల్ల చికాకు, దద్దుర్లు, ఎరుపు, పిగ్మెంటేషన్ కూడా వస్తాయి. చాలా మందికి ఈ టూల్స్ ఏమిటో కూడా తెలియదు.. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
ఫేస్ బ్రష్
ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి మార్కెట్లో అనేక రకాల ఫేస్ బ్రష్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో ముఖాన్ని లోతుగా శుభ్రపరుస్తారు. కానీ దీన్ని ఎక్కువగా, ప్రతిరోజూ ఉపయోగిస్తే, అది చర్మం సహజంగా క్లీన్ అవ్వడాన్ని దెబ్బ తీస్తుంది. దీనివల్ల చర్మం ఎర్రగా, సున్నితంగా, పొడిగా మారుతుంది.
ఎక్స్‌ఫోలియేటింగ్ గ్లోవ్స్
డెడ్ స్కిన్ తొలగించడానికి ఎక్స్‌ఫోలియేటింగ్ గ్లోవ్స్‌ను ఉపయోగిస్తారు. దీనిని సున్నితంగా ఉపయోగించకపోతే చర్మంపై కంటికి సరిగా కనిపించని చిన్న కోతలు ఏర్పడతాయి. ఇది చర్మపు చికాకును కలిగిస్తుంది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా, వారానికి 1-2 సార్లు మాత్రమే ఉపయోగించాలి.
స్క్రబ్బింగ్ ప్యాడ్
చర్మాన్ని స్క్రబ్ చేయడానికి స్క్రబ్బింగ్ ప్యాడ్‌లను ఉపయోగిస్తారు. ఇవి చాలా గరుకుగా ఉంటాయి. తరచుగా ఎక్స్‌ఫోలియేషన్ కోసం వీటిని ఉపయోగిస్తారు. అధికంగా ఉపయోగిస్తే ఇది చర్మంపై దురద, చికాకు, పొడిబారడానికి కారణమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు దీని వాడకాన్ని నివారించాలి.
సిలికాన్ క్లీనింగ్ బ్రష్
చర్మాన్ని శుభ్రం చేయడానికి సిలికాన్ క్లీనింగ్ బ్రష్‌లను ఉపయోగిస్తారు. ఇవి చాలా సున్నితంగా ఉంటాయి. కానీ ఈ బ్రష్‌లు చర్మ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ఈ బ్రష్‌లు మురికిగా మారితే లేదా సరిగ్గా శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా వల్ల చర్మ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఒకవేళ వీటిని ఉపయోగిస్తే వాటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం చాలా ముఖ్యం.
ఎలక్ట్రానిక్ క్లీనింగ్ పరికరాలు..
ఇవి హైటెక్ గా ఉంటాయి. చర్మాన్ని డీప్ క్లీన్ చేస్తాయి. కానీ వీటిని చాలా ఎక్కువ వేగంతో లేదా ప్రతిరోజూ ఉపయోగిస్తే, చర్మానికి ఉండే సహజ తేమ పోతుంది. చర్మం పొడిగా, చికాకుగా మారవచ్చు. కాబట్టి వీటిని కూడా వాడటం మానుకోవడం మంచిది.
*రూపశ్రీ.



