అలొవెరా జెల్ సరిగా వాడకపోతే డేంజర్..!
భారతదేశంలో కలబంద మొక్కను లేని ఇల్లు ఏదీ ఉండదు. దీనిని చాలా మంది అలంకరణ కోసం పెంచుతూ ఉంటారు. నిజానికి దీనిని ఉపయోగించడం ద్వారా అనేక చర్మ, జుట్టు సంబంధిత సమస్యలను నయం చేయవచ్చు. చాలా మంది ఎవరి సలహా లేకుండానే కలబందను ఉపయోగించవచ్చని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. కలబందను సాధారణంగా చర్మానికి ప్రయోజనకరంగా పరిగణిస్తున్నప్పటికీ, సరిగ్గా ఉపయోగించకపోతే, కొంతమందికి ముఖ సమస్యలను కూడా కలిగిస్తుంది. కలబందను సరైన విధంగా ఎలా ఉపయోగించాలి తెలుసుకుంటే..
ప్యాచ్ టెస్ట్..
ఇంటి నివారణలు ఎలాంటి అలెర్జీని కలిగించవని అమ్మాయిలు భావిస్తారు. అందువల్ల దీన్ని ఎప్పుడైనా ఉపయోగించవచ్చు అని అనుకుంటారు. అయితే ఇది నిజం కాదు. కలబందను ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ కూడా చేసుకోవాలి. దీని కోసం ముందుగా కలబందను చేతి లోపలి భాగంలో పూయడం ద్వారా పరీక్షించాలి. 24 గంటల్లోపు ఎలాంటి అలెర్జీ కలగకపోతే అప్పుడు మాత్రమే వాడాలి.
తాజాగానే..
ఈ రోజుల్లో మార్కెట్లో చాలా కంపెనీలు కలబంద జెల్‌ను విక్రయిస్తున్నాయి. ఇందులో రసాయన మిశ్రమం ఉండవచ్చు. అందుకే తాజా కలబంద జెల్‌ను మాత్రమే ఉపయోగించేందుకు ప్రయత్నించాలి. అది తాజాగా లేకపోతే దాని వాడకం చర్మంపై రియాక్షన్ కు కారణం కావచ్చు.
సమయం..
కలబంద వల్ల అలెర్జీ లేదా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెద్దగా లేకపోయినప్పటికీ దానిని అప్లై చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి . దీన్ని ముఖంపై అరగంట కంటే ఎక్కువసేపు అప్లై చేయకూడదు. చర్మ నిపుణుడి సలహా మేరకు మాత్రమే రాత్రంతా అలాగే ఉంచాలి. లేకుంటే అది చర్మ సమస్యలను పెంచుతుంది.
వారానికి ఎన్ని సార్లంటే..
రోజూ ముఖానికి కలబందను పూయకూడదు. ఇది అందరికీ సరిపోదు. ప్రతిరోజూ ఉపయోగించే బదులు వారానికి రెండు నుండి మూడు సార్లు మాత్రమే వాడాలి. తద్వారా ఎలాంటి అలెర్జీ ప్రమాదం ఉండదు.
అప్లై చేసే ముందు..
ముఖానికి కలబందను ఉపయోగించే ముందుగా ముఖాన్ని మంచి ఫేస్ వాష్ సహాయంతో శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖం నుండి మురికిని శుభ్రపరుస్తుంది. అప్పుడు మాత్రమే కలబంద ముఖంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది.
*రూపశ్రీ.
