తెలిసి తెలియక చేసే ఈ తప్పుల వల్లే జుట్టు రాలిపోతుంది..!


ఈ రోజుల్లో ప్రతి ఇద్దరు వ్యక్తులలో ఒకరు  జుట్టు రాలడమనే సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి.  వాటిలో ప్రధాన కారణం విపరీతమైన వేడి, మారుతున్న వాతావరణం,  చెడు ఆహారపు అలవాట్లు అని ప్రజలు అనుకుంటారు. ఇది చాలా వరకు నిజం. కానీ జుట్టు రాలడానికి  ఆ వ్యక్తే ముఖ్యమైన  కారణం కావచ్చని చాలా మందికి తెలియదు.  నిజానికి తెలిసి లేదా తెలియకుండా చేసే కొన్ని తప్పులు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి.

 జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే ఖరీదైన జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం చాలామంది చేసే మొదటి పని. ఇలా చేసిన తర్వాత కూడా జుట్టు రాలడం తగ్గకపోతే వారు తప్పుగా వెళుతున్నారనే అర్థం.  చాలా మంది చేసే తప్పుల గురించి తెలుసుకుంటే..

తలస్నానం..

ప్రతి ఒక్కరూ తమ జుట్టు రకాన్ని బట్టి జుట్టు కడుక్కోవాలి. కానీ చాలామందికి తమ  జుట్టు రకం తెలియదు. జుట్టు రకం ఏదో తెలియని వారు వారానికి మూడు సార్లు మాత్రమే  జుట్టును కడుక్కోవాలి. జుట్టును మూడు సార్లు కంటే ఎక్కువ వాష్ చేస్తుంటే అది బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది. జుట్టు  ఒకసారి బలహీనంగా మారితే అది రాలిపోవడాన్ని  ఎవరూ ఆపలేరు.

తల చర్మం..

తరచుగా ప్రజలు తమ జుట్టును క్రమం తప్పకుండా వాష్ చేసుకుంటారు.  కానీ తల చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేయరు. దీని కోసం జుట్టుకు సరైన మొత్తంలో షాంపూ వేసి ఆపై శుభ్రం చేసి బాగా కడగాలి. తద్వారా తల చర్మం శుభ్రంగా మారుతుంది. తలపై చర్మం మురికిగా ఉండటం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది.

తడి జుట్టును దువ్వడం..

ఉదయం జుట్టును పూర్తిగా ఆరబెట్టి తరువాత దువ్వుకోవడానికి ఎవరికీ తగినంత సమయం ఉండదు. కానీ తడి జుట్టును ఎప్పుడూ దువ్వకూడదని  గుర్తుంచుకోవాలి. తడి జుట్టును దువ్వడం వల్ల జుట్టు మూలాలు బలహీనపడతాయి. దీనివల్ల జుట్టు వేగంగా రాలిపోతుంది.

జుట్టును గట్టిగా కట్టడం..

 జుట్టును ఎప్పుడూ గట్టిగా కట్టకూడదు. తరచుగా మహిళలు వేడిని నివారించడానికి జుట్టును చాలా గట్టిగా కట్టుకుంటారు. దీనివల్ల జుట్టు మూలాలు స్వయంచాలకంగా బలహీనపడతాయి. అందువల్ల  జుట్టును గట్టిగా కట్టుకునే బదులు, కొంచెం వదులుగా కట్టుకోవాలి. కొప్పు పెట్టుకుంటున్నా జుట్టు వదులుగా ఉండాలి.  అలాగే చాలా టైట్ గా ఉండే రబ్బర్ బ్యాండ్ లను వాడటం ఆపేయాలి.

వేడి చేసే ఉపకరణాలు..

ఈ రోజుల్లో పురుషులు,  మహిళలు ఇద్దరూ తమ జుట్టును స్టైల్ చేయడానికి వేడి చేసే సాధనాలను ఉపయోగిస్తున్నారు. స్ట్రెయిట్నర్లు, కర్లర్లు, బ్లో డ్రైయర్లు జుట్టును బలహీనపరుస్తాయి. కాబట్టి వీలైనంత తక్కువగా వాడాలి. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండండి.


                              *రూపశ్రీ.