ఇంట్లోనే చేసుకునే ఈ ఫేస్ ఫ్యాక్ లు.. సమ్మర్ లో ఎంత హాయిని ఇస్తాయంటే..!
ఫేస్ ప్యాక్ ముఖ చర్మ రక్షణలో చాలా ఎక్కువగా ఉపయోగించే పద్దతి. చర్మానికి మేలు చేసే పదార్థాలను ఉపయోగించి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం రంగు మెరుగవుతుంది. చర్మం మీద మచ్చలు, మొటిమలు వంటివి తగ్గుతాయి. వాతావరణం వల్ల చర్మానికి ఎదురయ్యే సమస్యలు కూడా తగ్గుతాయి. సమ్మర్ లో చర్మ సంరక్షణ కోసం తులసిని ఉపయోగించవచ్చు. ఇది చాలా హాయిని ఇస్తుంది. తులసి ఫేస్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు, తులసి ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి? దీనికి కావలసిన పదార్థాలు అన్నీ తెలుసుకుంటే..
తులసిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల, తులసి ముఖాన్ని చంద్రుడిలా ప్రకాశింపజేస్తుంది. దీనికోసం తులసి తో ఫేస్ మాస్క్ తయారు చేసే సరైన పద్ధతిని తెలుసుకోవాలి.
తులసి, తేనె..
తేనెలో కూడా చర్మానికి మేలు చేసే అనేక లక్షణాలు ఉన్నాయి, ఇవి అనేక ముఖ సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి.అందాన్ని పెంచుకోవడానికి ఈ రెండింటి మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించడం వల్ల ముఖానికి తేమ అందుతుంది. తులసి పేస్ట్ మొటిమలను తొలగిస్తుంది.
ఎలా తయారు చేయాలి..
ముందుగా కొన్ని తులసి ఆకులను బాగా రుబ్బుకుని, ఆపై అందులో తేనె కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం మీద అరగంట పాటు అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు.
తులసి, పసుపు..
తులసి ఆకులు వివిధ ముఖ సమస్యలను తొలగించడంలో సహాయపడినట్టే పసుపు కూడా ముఖాన్ని ప్రకాశవంతం చేయడంలో సహాయపడుతుంది.
ముందుగా తులసి ఆకులను బాగా రుబ్బి పేస్ట్ లా చేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్ లో కొంచెం పసుపు కలపాలి. ఇప్పుడు ముఖం కడుక్కున్న తర్వాత ఈ ప్యాక్‌ను ముఖంపై పూర్తిగా అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖం కడుక్కోవాలి.
తులసి, పెరుగు..
తులసి ఒకవైపు ముఖంలోని అనేక సమస్యలను తొలగిస్తుండగా, మరోవైపు పెరుగు ఈ మండే వేడిలో ముఖానికి చాలా ఉపశమనాన్ని అందిస్తుంది. తులసి, పెరుగుతో ఫేస్ ప్యాక్ ముఖానికి చాలా మంచి ప్రయోజనాలు ఇస్తుంది.
ముందుగా తులసి ఆకులను రుబ్బాలి. తరువాత అందులో చిక్కటి పెరుగు కలపాలి. ప్యాక్ చాలా పలుచగా ఉండకూడదు. లేకుంటే అది ముఖం మీద నుండి జారిపోతుంది. ఇప్పుడు దాన్ని ముఖం మీద అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖం కడుక్కోవాలి. ఈ ప్యాక్‌ని అవసరానికి అనుగుణంగా ఉపయోగించవచ్చు.
*రూపశ్రీ
