చలికాలం కదా అని ముఖం మీద క్రీమ్స్ పూస్తున్నారా... ఈ షాకింగ్ నిజాలు తెలుసా!

చలికాలం చర్మానికి పరీక్ష కాలం. చలి, చల్లగాలి కారణంగా చర్మం పగులుతుంది. చలి కారణంగా చాలామంది నీరు తక్కువ తాగుతారు. ఈ కారణంగా కూడా శరీరంలో నీరు తగ్గి చర్మం పొడిబారుతుంది. చలి నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి చాలామంది మాయిశ్చరై జింగ్ క్రీములు, స్కిన్ కేర్ క్రీములు, స్కిన్ రిపేర్ క్రీములు అంటూ చాలా రకాలు పూస్తుంటారు. ఇవి చర్మానికి తేమను అందించడంలో సహాయపడతాయని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని అనుకుంటారు. కానీ ఈ క్రీములను ఇష్టమొచ్చినట్టు వాడినా, లేక తప్పుగా ఉపయోగించినా చర్మానికి చాలా డేంజర్ అంటున్నారు చర్మ సంరక్షణ నిపుణులు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
స్కిన్ క్రీమ్స్..
చర్మానికి ఉపయోగించే క్రీములలో ప్రోటీన్లు, కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి కొంతమంది చర్మంపై దద్దుర్లు, బ్లాక్ హెడ్స్ లేదా మొటిమలు వంటివి కలిగిస్తుంది.
సున్నితమైన చర్మం ఉన్నవారు, జిడ్డు చర్మం గలవారు ఈ క్రీమ్స్ ను వాడటం వల్ల అలెర్జీ కి గురికావడం లేదా చర్మ రంధ్రాలు మూసుకుపోయి చర్మ సంబంధ సమస్యలు రావడం వంటి వాటికి కారణం అవుతుంది.
స్కిన్ కోసం వాడే క్రీములు తాజాగా లేకపోయినా లేదా చర్మం మీద ఎక్కువ సేపు ఉంచినా అవి చర్మ ఇన్ఫెక్షన్లు, నల్లటి మచ్చలు రావడానికి కూడా కారణం అవుతుంది.అందుకే చర్మానికి వాడే క్రీములు తాజాగా ఉండాలి. అలాగే చర్మానికి క్రీమ్స్ రాసేటప్పుడు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా చర్మానికి కేవలం వారంలో 2 లేదా 3 సార్లు మాత్రమే వాడటం మంచిది. క్రీమ్స్ ఉపయోగించేవారు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. క్రీమ్స్ ను జాగ్రత్తగా వాడినప్పుడే వాటి ఫలితం బాగుంటుంది. లేకపోతే అవి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి.
*రూపశ్రీ.



