Home

»

Latest News

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్ నందన అరెస్ట్.. లుకౌట్ నోటీసులతో చిక్కిన నటి!

Sep 7, 2026 6:04PM

'నందూస్ వరల్డ్' యూట్యూబ్ ఛానల్‌ ద్వారా సోషల్ మీడియాలో ట్రావెల్, లైఫ్‌స్టైల్ వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి, ప్రముఖ యూట్యూబర్ రమా నందన తీవ్ర చిక్కుల్లో పడ్డారు. లండన్, యూకేల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీ స్థాయిలో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వద్ద పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. నందన తన భర్త జగర్లమూడి మధుకర్‌తో కలిసి డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో వ్యవహారాలు సాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. లండన్ సహా విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసా స్పాన్సర్‌షిప్ (CoS) మరియు వీసా రెన్యూవల్ తదితర సేవలు అందిస్తామని నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బాధితుడు మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. వీసా స్పాన్సర్‌షిప్ పేరుతో విడతల వారీగా రూ.15 లక్షలు తీసుకుని, నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి మోసం చేశారని ఆయన పోలీసులను ఆశ్రయించారు. సుమారు 100 మందికి పైగా నిరుద్యోగులను నమ్మించి వీరు భారీ మొత్తంలో డబ్బులు గుంజినట్లు సోషల్ మీడియాలోనూ బాధితులు వీడియోలు పోస్ట్ చేశారు. దీంతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు మధుకర్‌ను ఏ1గా, రమా నందనను ఏ2గా చేర్చుతూ కేసు నమోదు చేశారు.

ఈ కేసు విచారణలో భాగంగా దంపతులు దేశం దాటి పారిపోకుండా అధికారులు ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ (LOC) జారీ చేశారు. విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న నందనను ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆర్‌జీఐఏ పోలీసులు ఆమెను తదుపరి చట్టపరమైన విచారణ నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.

అయితే, ఈ ఆరోపణలను నందన గతంలోనే ఖండించారు. తమపై వ్యక్తిగత కక్షలతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు డెస్టినీ కన్సల్టెన్సీతో తమకు నేరుగా సంబంధం లేదని స్పష్టం చేస్తూ కేసు కొట్టివేయాలని హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇటీవల చిరంజీవి నిర్మించిన 'మన శంకర వరప్రసాద్' సినిమాలోనూ చిన్న పాత్రలో నటించిన నందన.. ఇప్పుడు కేసులో అదుపులోకి రావడం సోషల్ మీడియా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

 

 

[YouTuber Nandana Arrested News, Nandus World Rama Nandana Fraud Case, Shamshabad Airport YouTuber Arrest, UK Visa Fraud Case Telugu YouTuber, Telangana Police Arrest Youtuber Nandana]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com