Home

»

Latest News

సెప్టెంబర్ 11 నుంచి ఓటీటీలో.. 'పంచనామా' ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్!

Sep 7, 2026 5:05PM

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో డిజిటల్ ప్రియులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంటెన్స్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'పంచనామా'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమైంది. విలక్షణ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ఒరిజినల్ వెబ్ సిరీస్ అధికారిక ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయగా, ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ట్రైలర్ పరిశీలిస్తే.. వరుసగా జరిగే మూడు అనుమానాస్పద మరణాల చుట్టూ కథ తిరుగుతుంది. పోలీసు రికార్డుల్లో సాధారణ రోడ్డు ప్రమాదాలుగా నమోదై క్లోజ్ అయిన కేసుల వెనుక.. ఒక పక్కా క్రిమినల్ స్కెచ్ ఉందనే సందేహంతో డ్యూటీ నుంచి రిలీవ్ అవ్వడానికి రెండే రోజులున్న పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ జై రామ్ (భరత్ శ్రీనివాసన్) ఈ ఇన్వెస్టిగేషన్‌ను రీఓపెన్ చేస్తాడు.

తన తమ్ముడి మరణం కూడా ప్రమాదం కాదని నమ్మే జై రామ్, ఈ కేసు మూలాల్లోకి వెళ్లేకొద్దీ షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయి. హత్యలను సైతం ప్రమాదాలుగా చిత్రీకరించే ఒక భారీ నేర ముఠా కుట్రను, దాని వెనుక ఉన్న రాజకీయ అవినీతిని ఆయన ఎలా ఛేదించాడనేది ట్రైలర్‌లో ఎంతో ఉత్కంఠభరితంగా చూపించారు. 6 ఎపిసోడ్ల సిరీస్‌గా రానున్న ఈ ప్రాజెక్ట్‌ను దర్శకుడు మోహన్ శ్రీవత్స చాలా గ్రిప్పింగ్‌గా మలిచారు.

నటుడు భరత్ గతంలో ‘ప్రేమిస్తే’, ‘చంద్రముఖి’, ‘బాయ్స్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో కనిపించి తనదైన నటనతో మెప్పించారు. ఈ సిరీస్‌లో శివాజీ రాజా, మేధా రెడ్డి, చరణ్ బాబు, రూప లక్ష్మి, రాధిక ప్రీతి తదితరులు కీలక పాత్రలు పోషించగా, నరేష్ కుమారన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఉదయ భాను ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మిడ్డే విజయేంద్ర మౌళి, ఉదయ భాను సంయుక్తంగా నిర్మించిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'పంచనామా' సెప్టెంబర్ 11 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. థ్రిల్లర్ జోనర్ ప్రియులను ఈ సిరీస్ ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది.

 

 

[Panchanama Telugu Trailer Release, ZEE5 Panchanama Web Series, Bharath Srinivasan Panchanama Trailer, Panchanama OTT Release Date, Telugu Crime Thriller Series ZEE5]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com