Home

»

Latest News

‘స్పిరిట్’ డేట్‌కు ‘ఎల్లమ్మ’: పాన్ ఇండియా షేక్ అవుతుందా.?

Oct 21, 2026 11:19AM

టాలీవుడ్‌లో ఒక సినిమా తప్పుకున్న తేదీని మరో సినిమా అందిపుచ్చుకోవడం కొత్తేమీ కాదు. కానీ, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమా కోసం కేటాయించిన డేట్‌ను మరో క్రేజీ ప్రాజెక్ట్ సొంతం చేసుకుంటే మాత్రం ఆ చర్చే వేరుగా ఉంటుంది. ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ విషయంలో ఇదే జరిగింది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

మొదట ఈ తేదీకి ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ సినిమా విడుదల వాయిదా పడటంతో మార్చి 5 తేదీ ఖాళీ అయింది. ఇప్పుడు ఆ డేట్‌ను ‘ఎల్లమ్మ’ లాక్ చేసుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర కొత్త చర్చ మొదలైంది. ఒకప్పుడు ‘స్పిరిట్’ కోసం ఎదురుచూసిన ప్రేక్షకులు.. అదే తేదీన దేవిశ్రీ ప్రసాద్‌ను హీరోగా చూడబోతున్నారు.

‘ఎల్లమ్మ’ సినిమాకు ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ జీవితం, సంప్రదాయాలు, భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ ‘పర్షి’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతోనే ఆయన పూర్తిస్థాయి నటుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరో విశేషం ఏంటంటే.. నటుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు ఆయనే సంగీతం కూడా అందిస్తున్నారు.

దసరా సందర్భంగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటిస్తూ.. ‘ఎల్లమ్మ’ను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అంటే దేవిశ్రీ ప్రసాద్‌ను కేవలం తెలుగు ప్రేక్షకులకే కాకుండా, ఇతర భాషల ప్రేక్షకులకు కూడా హీరోగా పరిచయం చేయాలన్నది చిత్రబృందం ప్లాన్‌గా కనిపిస్తోంది.

దేవిశ్రీ ప్రసాద్ అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ఆయన సంగీతమే. దశాబ్దాలుగా ఎన్నో విజయవంతమైన ఆల్బమ్స్ అందించిన ఆయన.. ఇప్పుడు నటుడిగా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. 

ఇది కూడా చదవండి: తేజ సజ్జా పెళ్లి.. సాఫ్ట్‌వేర్ అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభం.!

 

 

 

[Yellamma Release Date, Devi Sri Prasad, Yellamma Movie, Venu Yeldandi, Dil Raju, Spirit Release Date, Prabhas, Telugu Movies 2027, Telugu Film News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com