
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెగసీ’ విడుదల తేదీ ఖరారైంది. ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
డిసెంబర్ 3న ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న 'ఫౌజీ' విడుదల కానుంది. ఆ భారీ సినిమా విడుదలవుతున్న మరుసటి రోజే 'లెగసీ' వస్తుందంటే రిస్క్ అనే చెప్పొచ్చు. కంటెంట్ మీద నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది ఆసక్తికరంగ్ మారింది.

సాయికిరణ్ రెడ్డి దైదా రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లెగసీ’ చిత్రాన్ని కలాహి మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మాతలు.
చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఓ స్ట్రైకింగ్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. విశ్వక్ సేన్, ఏక్తా రాథోడ్ కనిపిస్తున్న ఈ కొత్త పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో డిసెంబర్ 4న ‘లెగసీ’తో విశ్వక్ సేన్ ఎలాంటి పవర్‌ఫుల్ అనుభూతిని అందించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది.
‘పిండం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాయికిరణ్ రెడ్డి దైదా, ‘లెగసీ’తో తన రెండో ఫీచర్ ఫిల్మ్‌ను తెరకెక్కిస్తున్నారు. అలాగే ‘పిండం’ తర్వాత కలాహి మీడియా నిర్మిస్తున్న రెండో చిత్రం కూడా ఇదే కావడం విశేషం.
పవర్‌ఫుల్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ‘లెగసీ’లో అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం వంటి అంశాల మధ్య జరిగే ఆసక్తికర సంఘర్షణను ఆవిష్కరించనున్నారు. తన తండ్రి వదిలిన వారసత్వం కారణంగా ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఓ యువకుడి ప్రయాణంలో విశ్వక్ సేన్ పాత్ర సాగుతుంది.
[Vishwak Sen, Legacy Movie, Release Date, Prabhas, Fauzi Movie, Telugu Film News, Telugu News]





