టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ కొత్త సినిమా ‘రణబాలి’ విడుదలకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున వీరిద్దరూ తిరుమలకు చేరుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. సినిమా విడుదలకు ముందు ఇలా దైవదర్శనం చేసుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వచ్చిన విజయ్, రష్మిక ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ‘రణబాలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముందు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దర్శనం అనంతరం విజయ్, రష్మిక హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. ఈ వేడుకలో సినిమా గురించి చిత్ర బృందం మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించే అవకాశం ఉంది.
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రణబాలి’లో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించగా, రష్మిక మందన్న జయమ్మ పాత్రలో కనిపించనున్నారు. 19వ శతాబ్దంలో రాయలసీమ ప్రాంతంలో జరిగిన చారిత్రక ఘటనలు, అప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను రూపొందించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే వీరుడి కథను ఇందులో చూపించనున్నారు. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ప్రతినాయకుడిగా నటించడం మరో ప్రత్యేకత.
మరో విశేషం ఏమిటంటే.. విజయ్, రష్మిక నిజ జీవితంలో ఒక్కటైన తర్వాత కలిసి నటించిన తొలి చిత్రం ‘రణబాలి’. గతంలో వీరిద్దరూ ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో జంటగా నటించారు. ఇప్పుడు మరోసారి తెరపై జంటగా కనిపించనుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
Vijay Deverakonda, Rashmika Mandanna, Ranabaali Movie, Vijay Rashmika Tirumala Visit, Ranabaali Pre Release Event, Ranabaali Release Date, Rahul Sankrityan, Arnold Vosloo, Mythri Movie Makers, Telugu Cinema News





