ప్రముఖ గాయని వాణీ జయరాం హఠాన్మరణం.... షాక్లో సినిమా ఇండస్ట్రీ
on Feb 4, 2023
లెజండరీ సింగర్ వాణీ జయరామ్ ఇకలేరు. వాణీ జయరాం చెన్నై నుంగంబాకంలోని తన నివాసంలో జారిపడి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆమె వయసు 78 సంవత్సరాలు. వాణీ జయరాం హఠాన్మరణంతో మరో సారి సినిమా ఇండస్ట్రీ మూగ బోయింది. వాణీ జయరాం తమిళనాడు లోని వెల్లూరులో వారి తల్లిదండ్రుల ఎనిమిది మంది సంతానంలో ఐదవ పుత్రికగా జన్మించారు. వాణి జయరాం పసి ప్రాయంలోనే బాల మేధావిగా విశేష ప్రతిభ కనబరిచారు.
ఆమె సుమారు వేయి సినిమాలలో పది వేల పాటలకు పైగానే పాడారు. సినిమాలతో పాటు వేల సంఖ్యలో భక్తి గీతాలను కూడా ఆలపించారు. తెలుగు, తమిళం సహా 19 భాషల్లో ఆమె పాటలు పాడటం విశేషం. వాణీ జయరామ్ ఉత్తమ గాయనిగా మూడు సార్లు జాతీయ పురస్కారం అందుకున్నారు. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన 'అపూర్వ రాగంగళ్' సినిమా (తెలుగులో 'అంతులేని కథ')లో పాటలకు గాను ఒకసారి జాతీయ పురస్కారం అందుకున్నారు. మిగతా రెండు సార్లు కె. విశ్వనాథ్ సినిమాల్లో పాటలు అందుకోవడం విశేషం. '
శంకరాభరణం'లో పాటలకు 1980లో, ఆ తర్వాత 'స్వాతి కిరణం' సినిమాలో 'ఆనతినీయరా హరా...' పాటకు 1991లో మరోసారి వాణీ జయరామ్ జాతీయ పురస్కారం అందుకున్నారు. విశ్వనాథ్ మరణించిన రెండు రోజులకు వాణీ జయరాం కన్ను మూయడం యాదృచ్చికమే అయినా అత్యంత విషాదకరం. సంగీత రంగానికి చేసిన విశేష సేవలకు గాను ఇటీవలే కేంద్రప్రభుత్వం వాణీ జయరాంగారికి ఉన్నత పౌర పురస్కారం పద్మభూణ్ను ప్రకటించింది.
Also Read